Sports

నా 83 ఫ్యామిలీని త్వరలో కలుస్తాను

నా 83 ఫ్యామిలీని త్వరలో కలుస్తాను

ఇటీవల గుండెపోటుతో ఆస్పత్రి పాలై కోలుకున్న టీమిండియా మాజీ కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌ తొలిసారి అభిమానుల ముందుకొచ్చారు. తన ఆరోగ్యం బాగుందని వెల్లడించారు. తన కోసం ప్రార్థించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. 1983లో ప్రపంచకప్‌ సాధించిపెట్టిన తన జట్టు (ఫ్యామిలీ) సభ్యులను కలవాలని ఉందని పేర్కొంటూ ఓ వీడియోను విడుదల చేశారు. 1983 వరల్డ్‌కప్‌ టీమ్‌ సభ్యుల వాట్సాప్‌ గ్రూప్‌లో దీన్ని పోస్ట్‌ చేశారు. ‘‘నా ఫ్యామిలీ 83. మిమ్మల్ని త్వరగా కలవాలని ఆతృతగా ఉంది. నేను బాగానే ఉన్నాను. నా ఆరోగ్యం కోసం ప్రార్థించిన అందరికీ కృతజ్ఞతలు. అతి త్వరలోనే అందరినీ కలుసుకుంటానని భావిస్తున్నా. సినిమా ఎప్పుడు విడుదలవుతుందో నాకు తెలియదు.. కానీ మిమ్మల్ని సాధ్యమైనంత త్వరలో కలిసేందుకు ప్రయత్నిస్తా. ఈ సంవత్సరం చివరకు వచ్చేశాం. తర్వాతి ఏడాది గొప్పగా ప్రారంభమవుతుందనే విశ్వాసం నాకు ఉంది. లవ్‌ యూ ఆల్‌’’ అని 29 సెకెన్ల పాటు ఉన్న ఈ వీడియోలో పేర్కొన్నారు.