Agriculture

“ధరణి”తో ఇక క్రయ విక్రయాలు సులభం వేగవంతం

“ధరణి”తో ఇక క్రయ విక్రయాలు సులభం వేగవంతం

ధరణి పోర్టల్​ను ప్రారంభించిన సీఎం కేసీఆర్​

మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ‘ధరణి’ పోర్టల్‌ను సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు.

ధరణి పోర్టల్‌లో స్లాట్ల బుకింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ధరణి ప్రారంభంతో మూడుచింతలపల్లికి ప్రత్యేకమైన గౌరవం దక్కిందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

1969లో తెలంగాణ కోసం పోరాటం చేసిన వీరారెడ్డి పురిటిగడ్డ మూడుచింతలపల్లని.. అందువల్లనే ఈ పోర్టల్​ ప్రారంభానికి ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసినట్లు తెలిపారు.

తెలంగాణ కోసం జైలు పాలైన వారిలో వీరారెడ్డి ఉన్నారన్నారు. 30 దేశాల్లో ప్రజలు నా ఉపన్యాసం వింటున్నారని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

ధరణి పోర్టల్‌ భారతదేశానికే ట్రెండ్‌ సెట్టర్​ అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఒకప్పుడు భూమి ఉత్పత్తి సాధనం మాత్రమేనని.. క్రమపద్ధతిలో వ్యవసాయం ప్రారంభించిన తర్వాత భూమికి విలువ పెరిగిందన్నారు.

రాష్ట్ర రైతుల భూములకు సంపూర్ణ రక్షణ కోసం ఐదేళ్ల క్రితం నిర్ణయం తీసుకున్నామన్నారు. తప్పు చేసే అధికారం తనకు లేదని.. ఒక తప్పు జరిగితే భవిష్యత్‌ తరాలు ఇబ్బందులు పడతాయని తెలిపారు.

తప్పటడుగులు లేకుండా కఠినంగా నిర్ణయాలు తీసుకున్నట్లు స్పష్టం చేశారు. కోటి 45 లక్షల 58 వేల ఎకరాల భూముల వివరాలు ధరణి పోర్టల్‌లో ఉన్నాయని సీఎం తెలిపారు.

విదేశాల్లో ఉన్నవాళ్లు కూడా వారి భూముల వివరాలు ఇందు‌లో చూసుకోవచ్చన్నారు.

ఇవాళ్టి నుంచి ఎట్టిపరిస్థితుల్లోనూ అక్రమ రిజిస్ట్రేషన్లు జరగవని సీఎం స్పష్టం చేశారు. ధరణి పోర్టల్‌ రూపకల్పన కోసం 200 వరకు సమావేశాలు నిర్వహించినట్లు కేసీఆర్​ పేర్కొన్నారు.

కొత్తగా జరిగే క్రయ, విక్రయాల నమోదు నిమిషాల్లో పూర్తి అవుతాయన్నారు.

కార్యాలయాల చుట్టూ తిరిగే కర్మ ఇకపై మనకు ఉండదని.. రిజిస్ట్రేషన్ల కోసం పైరవీలు చేసే అవసరం ఉండదన్నారు.

మీ-సేవా, ధరణి పోర్టల్‌, వ్యక్తిగతంగా కార్యాలయానికి వెళ్లి భూముల రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని పేర్కొన్నారు.

ధరణి పోర్టల్‌ నమూనా పత్రాలు కూడా అందుబాటులో ఉన్నాయన్నారు.

నమూనా పత్రాల ఆధారంగా ఎవరికి వారే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ చేసుకోవచ్చని తెలిపారు.

ఒకవేళ డాక్యుమెంట్‌ రైటర్ల సహాయం కావాలంటే వాళ్లు అందుబాటులో ఉంటారని.. ఇందుకోసం తీసుకోవాల్సిన రుసుం కూడా నిర్ణయిస్తామన్నారు.

మిషన్‌ భగీరథతో శాశ్వతంగా తాగునీటి సమస్య తీర్చుతామన్నామని.. మారుమూల ప్రాంతాలకు తాగునీరు ఇవ్వకపోతే మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోమని ప్రకటించినట్లు గుర్తుచేశారు.

మిషన్‌ భగీరథపై అనేక అనుమానాలు వ్యక్తం చేశారని.. సంకల్పబలంతో ఈ ప్రాజెక్టును పూర్తి చేసినట్లు స్పష్టం చేశారు. ఈ ఫలాలు ఇప్పుడు ప్రజల ముందు ఉన్నాయన్నారు సీఎం కేసీఆర్.

తలసరి విద్యుత్‌ వినియోగంలో దేశంలోనే తెలంగాణ తొలి స్థానంలో ఉందని కేసీఆర్​ పేర్కొన్నారు.

వ్యవసాయం సహా అన్ని రంగాలకు 24 గంటలు కరెంట్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం మనదేనని స్పష్టం చేశారు.

మనల్ని ఎకసెక్కాలు చేసిన వాళ్లను వెనక్కి నెట్టేశామన్నారు. ఎఫ్‌సీఐకి 55 శాతం ధాన్యం అందించిన రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని సీఎం కేసీఆర్ వెల్లడించారు.

పరిశ్రమలు తీసుకురావడం, శాంతిభద్రతలు కాపాడటంలో ముందు ఉన్నామని సీఎం కేసీఆర్​ అన్నారు.

రెవెన్యూ శాఖలో విప్లవాత్మకమైన సంస్కరణలు తీసుకొచ్చినట్లు తెలిపారు. గొప్ప సంస్కరణలు వచ్చినప్పుడు చిన్నచిన్న సమస్యలు ఉంటాయన్నారు.