*తాంబూల (కిళ్లీ) విశేషాలు*
*తాంబూలమును భుజించిన తరువాత వేసుకొనవలెను. భోజనమునకు తరువాత మూడు నాలుగుసార్లు ఒక వక్క, నాలుగు ఆకులు, సున్నము వేసుకొని సేవించవలెను.
* వక్కకు, ఆకులకు సరిపోవునట్లు సున్నము రాచుకొని కషాయ రసం లేక కొంచము కారము ఉండునట్లు చూచుకొని తాంబూలము వేసుకొనవలెను.
* భొజనమునకు ముందు తాంబులం వేయకూడదు. తాంబూలం పిప్పిని మింగకుండా ఉమ్మివేయవలెను.
* తాంబులం వేసుకొనుటకు ముందు నోటిని శుభ్రముగా పుక్కిలించి తాంబులం వేసుకొన్నచో నోటికి రుచిని చేకూర్చి మంగళకరముగా ఉండును.
* తాంబులం నోటిలో వేసుకున్న తరువాత మొదటిసారిగా వచ్చిన తాంబూల రసము మింగిన విషసమానముగా ఉండును. రెండొవసారి వచ్చినది విరోచనకారి. ఆ తరువాత వచ్చు రసము అమృతతుల్యమైనది. చక్కగా జీర్ణం చేయును. రసాయనం.
* పాలు తాగిన వెంటనే తాంబులం వేసుకొన్నయెడల కుష్ఠు రోగము గాని ప్రమేహరోగము గాని, మూత్రరోగము గాని కలుగును.
* పాలు, వెలగపండు, పనస, మామిడి, అరటి, చెరకుగడ, మద్యము, మాంస రసము, కషాయము, నెయ్యి, తేనె, కొబ్బరి నీరు వాడిన ఒక గంట వరకు తాంబులం వేసుకొనిన విషముగా పరిణమించును.
* నేత్రవ్యాధి, క్షయ, పాండువు, భ్రమ, మద్యపానం చేయుట వలన జబ్బు పడినవారు, అపస్మారము, శ్వాస, గుండెజబ్బు, రక్తపైత్యము, గ్రహణి, అతిసారం వంటి సమస్యలతో ఇబ్బందిపడువారు తాంబూల సేవన చేయరాదు.
* దెబ్బలు తగిలినవారు, పిత్తరోగము, రక్తవ్యాధులు కలిగినవారు, వేడిశరీరం కలిగినవారు, మూర్చ, క్షయరోగము కలిగినవారికి తాంబులం నిషిద్దం. సంధ్యాసమయం నందు తాంబూలసేవన చేయరాదు.
* తమలపాకు తొడిమ వ్యాధికారకము, చివర భాగము మంచిది. సున్నము నందు ఉంచిన ఆకు ఆయుక్షీణము. ఈనెలు బుద్దిని చెడగొట్టును. కావున ఆకుల యొక్క తొడిమలు, చివరలు, ఈనెలు వదిలి సున్నము పెట్టిన ఆకును పారవేచి తాంబూల సేవన చేయుట మంచిది.
* సున్నము పెట్టిన ఆకు చూర్ణపర్ణం అనబడును. పురుగులచే కొట్టబడి, రుచిలేనిది అయ్యి నల్లనిరంగు కలిగిన ఆకులు మంచివి కావు. రాళ్లు కలిగి, తెల్లగా ఉండక, ఎండిపోయిన పొడి సున్నము మంచిది కాదు.
* తాంబులం నందు వేయు పోకకాయ మంచి ప్రదేశము నందు పుట్టినది, గట్టిది, బరువు గలది, చిక్కనిది, పగలగొట్టినచో కుందేలు మాంసపు వర్ణము కలది మంచిది.
* తమలపాకును మాలిన్యము లేకుండా వస్త్రముతో తుడిచి ఈనె చీల్చి, సున్నము రాచి రెండువేళ్ళ పొడుగునా పార్శ్వములు మడిచి చుట్టి తీసికొనవలెను.
* పోకలు కషాయ, మధురరసములు కలవిగా ఉండును. ఋక్షగుణము కలవి. త్రిదోషములను పోగొట్టును. బాగుగా వండినది త్రిదోష హరము. వండని పచ్చి వక్క దోషములను ప్రకోపింపచేయను. కారముగా ఉండు తమలపాకు మంచిది. పండిన తమలపాకు సర్వదోషములను హరించును. విశేషముగా కఫవాతములను హరించి దోషములను బేధించి అగ్నిదీప్తిని కలిగించును. క్రిమిదోషములను పోగొట్టును.
* కర్పూర మిశ్రితమైన తాంబూలము మనస్సుకు సంతోషమును , మిక్కిలి సంభోగ శక్తిని, మదమును కలిగించును. ముఖరోగములను, క్రిమిరోగములను పోగొట్టును. కాచుతో కూడిన తాంబూల సేవన వలన ముఖరోగములు, క్రిమిరోగములు పోవుటయే కాక దంతములకు పటుత్వంను కలిగించును. నోటి దుర్గన్ధమ్ పోవును. వాతమును, శ్లేష్మమును హరించి దోషములను చేధించి రక్తమును, పైత్యమును పెంపొందించును.
కిళ్లీ విశేషాలు
Related tags :