* వ్యవసాయ పనులు చేస్తున్న ఓ రైతు పొలంలో పురాతన రాతి విగ్రహాం బయటపడింది. వివరాల్లోకి వెళితే అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలంలోని కలుగోడు గ్రామంలో నాగేంద్ర అనే రైతు శుక్రవారం తన పొలంలో దుక్కి దున్నుతుండగా నాగలికి రాయి తగిలింది. దీంతో పూర్తిగా తవ్వి చూస్తే రెండు అడుగుల దేవుడి రాతి విగ్రహం బయటపడింది. ఆయన వెంటనే ఈ విషయాన్ని తహసీల్దార్ వెంకటాచలపతికి తెలియజేశారు. సమీప గ్రామాల పెద్దలు చూసినా ఏ దేవుడి విగ్రహమో గుర్తుపట్టకపోయారు. దీంతో రాయదుర్గం చరిత్ర పురావస్తు పరిరక్షణ సమితి సంయుక్త కార్యదర్శి శివకుమార్‌కు వివరాలు అందించారు. ఆయన ఈ విగ్రహాన్ని సూర్య భగవానుడిగా ధ్రువీకరించారు. ఈ విగ్రహం 10వ శతాబ్దం పల్లవుల కాలం నాటిదని తెలిపారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామని ఎస్సై, తహసీల్దార్ చెప్పారు.
* కరోనా వ్యాక్సిన్ వచ్చిన వెంటనే.. దాన్ని దేశవ్యాప్తంగా పంపిణీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను సమన్వయం, పర్యవేక్షణ కోసం కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని అన్ని రాష్ట్రాలకు సూచించింది. అంతేకాకుండా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగే సమయంలో ఇతర ఆరోగ్య సేవలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని తెలిపింది. ముఖ్యంగా టీకా పంపిణీని, వాటి అంగీకారాన్ని ప్రభావితం చేయగలిగే వదంతులపై సామాజిక మాధ్యమాల్లో ఎప్పటికప్పుడు ట్రాక్ చేయాలని మరోసారి స్పష్టంగా పేర్కొంది.
* తమను వ్యతిరేకించి ఉక్కు పిడికిలి నుంచి బయటపడిన వారిని చైనా పాలకులు వేటాడుతున్నారు. ఆ దేశం నుంచి అమెరికా పారిపోయి ప్రాణాలు కాపాడుకోవాలనుకుంటున్న వారిని కూడా తిరిగి రప్పించేందుకు షీజిన్‌పింగ్ నేతృత్వంలోని సర్కారు రహస్యంగా ‘ఆపరేషన్ ఫాక్స్ హంట్’ను చేపట్టింది. అమెరికాలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్, ఎఫ్‌బీఐలు ఈ గుట్టును ఛేదించాయి. అక్టోబర్ 28న ఎనిమిది మంది చైనా ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు. పలువురిని వెంటాడేందుకు, అమెరికా నుంచి తరలించేందుకు వీరిలో ఆరుగురు కుట్రలు పన్నుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ‘‘వీరంతా పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అధికారుల ఆదేశాల మేరకు అమెరికాలో నిఘా కార్యక్రమాలు చేపట్టారు. దీంతోపాటు కొందరిపై దాడి చేశారు. ఇక్కడ నివసిస్తున్న కొందరిని చట్ట విరుద్ధంగా చైనా తరలించాలని చూస్తున్నారు. తమ దేశం నుంచి పారిపోయిన వారిని ఎక్కడున్నా సరే వెతికి పట్టుకొచ్చేందుకు చట్టవిరుద్ధంగా ‘ఆపరేషన్ ఫాక్స్ హంట్’లో వీరు భాగం’’ అని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
* చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కుమార్తె వివాహానికి సీఎం జగన్ హాజరయ్యారు. విశాఖ నగరంలోని పార్క్‌హోటల్‌లో జరిగిన వివాహ వేడుకు హాజరై వధూవరులు సుమ-చిన్నంనాయుడును సీఎం ఆశీర్వదించారు. సీఎంతో పాటు మంత్రులు బొత్స సత్యనారాయణ, అవంతి శ్రీనివాస్, ఎంపీ విజయసాయిరెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
* మహిళను లైంగికంగా వేధించిన అనంతరం హత్య చేసిన నిందితుడిని సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. బాలానగర్ డీసీపీ పద్మజ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 17వ తేదీన మేడ్చల్ లేబర్ అడ్డాలో కూలీ పని నిమిత్తం వేచి ఉన్న విజయ అనే మహిళను తన ఇంట్లో పని ఉందని చెప్పి రవికుమార్ అనే వ్యక్తి ద్విచక్రవాహనంపై తీసుకెళ్లాడు. మద్యం సేవించిన రవికుమార్ మహిళను లైంగికంగా వేధించి అతికిరాతకంగా ఆమె ఛాతిపై దాడి చేయడంతో ఊపిరాడక చనిపోయింది. నిందితుడు మృతురాలిపై ఉన్న ఆభరణాలను అపహరించి మృతదేహాన్ని పక్కనే ఉన్న మేడ్చల్ రైల్వే గేట్ దగ్గర వదిలేసి మూసాపేట్‌కి పరారయ్యాడు. విజయ ఎంతసేపటికీ ఇంటికి రాకపోవడంతో ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీ ఫుటేజీలను పరిశీలించి నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీసీపీ తెలిపారు.
* హైదరాబాద్ శివారులో అన్నాచెల్లెళ్లు అదృశ్యమయ్యారు. హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కుంట్లూరులో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుంట్లూరుకు చెందిన యాడపల్లి సౌమ్య, ఆనంద్‌కుమార్ దంపతులు. వీరికి కుమార్తె ప్రేమ(11), కుమారుడు శ్రీపాల్ (13) ఉన్నారు. గురువారం రాత్రి భోజనం చేశాక ఎప్పటిలాగే వారు బెడ్‌రూంలో నిద్రకు ఉపక్రమించారు. శుక్రవారం ఉదయం ఎనిమిదిన్నర గంటలకు తల్లిదండ్రులు నిద్రలేచి చూసే సరికి పిల్లలు బెడ్‌రూంలో లేరు. ఆందోళనకు గురైన తల్లిదండ్రులు సమీప బంధువుల వద్ద వాకబు చేసినప్పటికీ చిన్నారుల ఆచూకీ లభించలేదు. దీంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
* రాజధాని అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు సంకెళ్లు వేసి అరెస్టు చేయడం హేయమైన చర్య అని తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. తమ పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు వైకాపా ప్రభుత్వ తీరుపై ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని చెప్పారు. కృష్ణా జిల్లా మైలవరంలో స్థానిక ఎన్టీఆర్ విగ్రహం నుంచి నూజివీడు రోడ్డులోని గాంధీ విగ్రహం వరకు నిర్వహించిన నిరసన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. అనంతరం దేవినేని మీడియాతో మాట్లాడుతూ అన్నం పెట్టే రైతులకు సంకెళ్లు వేయడం సీఎం జగన్ నిరంకుశతీరుకు అద్దంపడుతోందని విమర్శించారు. రైతుల పోరాటానికి తెదేపా ఎల్లవేళలా అండగా ఉంటుందని చెప్పారు.
* తెలంగాణ భవిష్యత్‌కు దుబ్బాక ఉప ఎన్నిక నాంది పలుకుతుందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. తెరాస, కేసీఆర్‌కు బుద్ధిచెప్పే అవకాశం వచ్చిందని వ్యాఖ్యానించారు. ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా భాజపా అభ్యర్థి రఘునందన్‌రావుకు మద్దతుగా భూంపల్లి క్రాస్ రోడ్డు వద్ద నిర్వహించిన సభలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా తెరాస ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రత్యేక రాష్ట్ర పోరాటంలో దుబ్బాక కీలకపాత్ర పోషించిందని చెప్పారు. తెరాస అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు లేకుండా పోయాయని ఆరోపించారు.
* దుబ్బాక ఉప ఎన్నిక పోరు తారాస్థాయికి చేరింది. ప్రచారానికి ముగింపు తేదీ దగ్గర పడుతుండటంతో పార్టీలు జోరుపెంచాయి. త్రిముఖ పోరులో పైచేయి సాధించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ప్రధాన పార్టీల రాష్ట్ర నాయకత్వమంతా దుబ్బాకలోనే మకాం వేసి తమ అభ్యర్థుల గెలుపుకోసం వ్యూహాలు రచిస్తున్నాయి. నవంబర్ 1న సాయంత్రం 5గంటలతో ప్రచార గడువు ముగియనుండటంతో సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ నాయకులు ముందుకుసాగుతున్నారు. తెరాస తన ప్రచారంలో ప్రధానంగా భాజపాపై దృష్టిసారిస్తోంది. కేంద్ర నిర్ణయాలతో రైతులు నష్టపోతున్నారంటూ నేతలు ర్యాలీలు, సభల్లో ప్రస్తావిస్తున్నారు. సిద్దిపేటలో అంజన్‌రావు ఇంట్లో నగదు స్వాధీనం అనంతరం పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. తెరాస, భాజపా నాయకులు రాజకీయ ఆరోపణలతోపాటు వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. మరోవైపు ప్రచారంలో నిమగ్నమైన కాంగ్రెస్.. తెరాస, భాజపా ఒక్కటేనని ఆరోపిస్తోంది.
* పొరుగు రాష్ట్రం నుంచి నాణ్యమైన మద్యాన్ని తెచ్చుకునే ప్రజలను ఏపీ ప్రభుత్వం కేసుల పేరుతో వేధించడం సరికాదని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శించారు. దొంగ మద్యం రాష్ట్రంలో ఏరులై పారుతోందని.. అనధికార బెల్ట్‌షాపులు ఎక్కువయ్యాయని ఆయన ఆరోపించారు. దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రజల శ్రమను కొంతమంది మద్యం వ్యాపారులు దోచుకుంటున్నారని రఘురామకృష్ణరాజు ఆరోపించారు. బిహార్‌లో సంపూర్ణ మద్య నిషేధంతో మద్యం అమ్మకాలు తగ్గకపోగా.. సరఫరా ఎక్కువైందని చెప్పారు. తలసరి ఆదాయం తక్కువ గల అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. ముఖ్యంగా మహిళలు ప్రస్తుత ప్రభుత్వానికి ఓటు వేయవద్దని నిర్ణయించుకున్నారని రఘురామకృష్ణరాజు వివరించారు. ఏపీలోనూ రానున్న రోజుల్లో ప్రభుత్వానికి అదే పరిస్థితి ఎదురుకానుందన్నారు.
* ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 84,401 కరోనా పరీక్షలు చేయగా .. 2,886 కొత్త కేసులు నమోదు కాగా.. 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8,20,565కి చేరింది. తాజా మరణాలతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 6,676 మంది కొవిడ్‌తో మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో 3,623 మంది బాధితులు పూర్తిగా కోలుకోగా.. రాష్ట్రంలో కోలుకున్నవారి సంఖ్య 7,88,375కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 25,514 యాక్టివ్ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 73,47,776 కరోనా సాంపుల్స్‌ని పరీక్షించినట్లు వైద్యారోగ్య శాఖ బులెటిన్‌లో వెల్లడించింది.
* తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 43,790 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 1,531 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,37,187కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే కరోనాతో ఆరుగురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,330కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న ఒక్క రోజే 1,048 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 2,17,401కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 18,456 యాక్టివ్ కేసులు ఉన్నాయని, వారిలో 15,425 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య 42,40,748కి చేరింది.
* భారత క్షిపణి ప్రయోగాల పరంపర కొనసాగుతోంది. సరిహద్దు దేశాలతో ఉద్రిక్తతల నేపథ్యంలో రక్షణ రంగంలో పెద్ద ఎత్తున మార్పులు తీసుకొచ్చే దిశగా భారత్ అడుగులేస్తోంది. ఇటీవల కాలంలో వరుస క్షిపణి ప్రయోగాలు చేపట్టిన భారత్.. తాజాగా యాంటీ షిప్ మిసైల్ (ఏఎస్‌హెచ్ఎం)ను పరీక్షించింది. బంగాళాఖాతంలో యుద్ధనౌక ఐఎన్‌ఎస్ కోర నుంచి ఇండియన్ నేవీ ఈ ప్రయోగం చేపట్టింది. నిర్దేశిత లక్ష్యాన్ని క్షిపణి సులువుగా ఛేదించిందని వెల్లడించింది. క్షిపణి ఢీ కొట్టడంతో లక్షిత నౌక పేలిపోయి.. పొగలు వస్తున్న ఫోటోను ఇండియన్ నేవీ విడుదల చేసింది.
* పుల్వామా దాడిలో తమ ప్రమేయం ఉందని పాక్ సీనియర్ మంత్రి స్వయంగా అంగీకరించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీపై భాజపా విరుచుకుపడింది. దాడి వెనుక తమ హస్తం ఉందని స్వయంగా పాకిస్థానే అంగీకరించినందున కాంగ్రెస్ పార్టీ సహా ఇతర విపక్ష పార్టీలు క్షమాపణలు చెప్పాలని కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్ డిమాండ్ చేశారు. గత ఏడాది ఫిబ్రవరిలో పుల్వామాలో జరిగిన దాడిలో అధికార పార్టీ కుట్ర ఉందంటూ ఆరోపించిన వారు వెంటనే దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్నారు.
* కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో కొత్త కొత్త మాస్క్‌లు మార్కెట్లోకి వస్తున్నాయి. ఈ వైరస్ వ్యాప్తిని ఎదుర్కోవడమే లక్ష్యంగా శాస్త్రవేత్తలు పరిశోధనలతో కొత్త పరికరాలను రూపొందిస్తున్నారు. తాజాగా కరోనాను ఎదుర్కోవడమే కాకుండా వైరస్‌ను నాశనం చేయగల సామర్థ్యంతో ఓ కొత్త తరహా మాస్కును అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇప్పుడు వాడుతున్న మాస్కులు పరిమిత రక్షణ మాత్రమే కల్పిస్తాయని.. అవి గాలిని శుభ్రం చేసి వైరస్‌ను కట్టడి చేయలేవని మస్సాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)కి చెందిన పరిశోధకులు వెల్లడించారు. తాము మరింత ముందుకు వెళ్లి రాగి, ఉష్ణోగ్రత ఆధారంగా కరోనా వైరస్‌ను నశింపచేసే మాస్కులను కనిపెట్టినట్టు తెలిపారు.