Business

రిలయన్స్‌కు భారీ లాభాలు

రిలయన్స్‌కు భారీ లాభాలు

కరోనా పరిణామాల ఫలితంగా చమురుకు గిరాకీ తగ్గడంతో, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబరు త్రైమాసికంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ నికర లాభం 15 శాతం క్షీణించి రూ.9,567 కోట్లకు చేరుకుంది.2019-20 ఇదే త్రైమాసిక లాభం రూ.11,262 కోట్లు కావడం గమనార్హం. ఆదాయం సైతం 24 శాతం తగ్గి రూ.1,53,384 కోట్లుగా నమోదైంది. కంపెనీ మొత్తం ఆదాయాల్లో 35 శాతం వాటా ఉన్న వినియోగదారు ఆధార విభాగాలు మాత్రం రాణించాయి. సంస్థ సంప్రదాయ విభాగమైన పెట్రో రసాయనాల విభాగ ఆదాయం 23% తగ్గి రూ.29,665 కోట్లకు; పన్నుకు ముందు లాభం 33% తగ్గి రూ.5964 కోట్లకు పరిమితయ్యాయి.

త్రైమాసికం వారీగా వృద్ధి
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-జూన్‌తో పోలిస్తే కంపెనీ ఏకీకృత ఆదాయం 27.2 శాతం వద్ధితో రూ.1,28,385 కోట్లకు చేరుకుంది. నికర లాభం కూడా (అసాధారణ అంశాన్ని పక్కనపెట్టాక) 28 శాతం వృద్ధితో రూ.10,602 కోట్లుగా నమోదైంది. ఈపీఎస్‌ రూ.14.8కు చేరుకుంది.
జియో.. జిగేల్‌..
టెలికాం విభాగం రాణించింది. సెప్టెంబరు త్రైమాసికంలో 73 లక్షల కొత్త కనెక్షన్లు జత చేరడంతో మొత్తం చందాదార్ల సంఖ్య 40.56 కోట్లకు చేరుకుంది. ఈ విభాగంలో నికర లాభం మూడింతలు పెరిగి రూ.2844 కోట్లకు చేరుకుంది. 2019 ఇదే త్రైమాసికంలో లాభం రూ.990 కోట్లు మాత్రమే. జియో ఆదాయం 33% వృద్ధితో రూ.17,481 కోట్లుగా నమోదైంది. వినియోగదారులపై సంస్థకు లభించే సగటు ఆదాయం(ఆర్పు) రూ.127.40 నుంచి 13.8% పెరిగి రూ.145కు చేరుకుంది. 2020 జూన్‌ త్రైమాసికంలో ఇది రూ.140.3గా ఉంది.
రిటైల్‌ ఆదాయం రూ.39,199 కోట్లు
లాక్‌డౌన్‌ అనంతరం మార్కెట్లు తెరచుకోవడంతో రిటైల్‌ వ్యాపార ఆదాయం పెద్దగా మార్పు లేకుండా రూ.39,199 కోట్లకు చేరుకుంది. తన రిటైల్‌ స్టోర్లలో 85 శాతం తెరచుకున్నాయని కంపెనీ తెలిపింది,. అదనంగా 232 స్టోర్లనూ జత చేయడంతో వీటి మొత్తం సంఖ్య 11,931కు చేరుకుంది.
వ్యూహాత్మక వాటా విక్రయాలు
రిటైల్‌, టెలికాం విభాగాల్లో మైనారిటీ వాటాలను సిల్వర్‌ లేక్‌, కేకేఆర్‌లకు కంపెనీ విక్రయించింది. జియో ప్లాట్‌ఫామ్స్‌లో ఫేస్‌బుక్‌, గూగుల్‌, పీఈ ఫండ్‌లకు 32.96 శాతం వాటాను అమ్మడం ద్వారా రూ.1.52 లక్షల కోట్లు; రిటైల్‌ విభాగంలో 8.48 శాతం వాటా విక్రయంతో రూ.37,710 కోట్ల మేర సమీకరించింది ఇవి కాకుండా.. రైట్స్‌ ఇష్యూ ద్వారా రూ.52,124 కోట్లు సమీకరించింది. సమీక్షిస్తున్న త్రైమాసికంలోనే బ్రిటన్‌ సంస్థ బీపీకి తన ఇంధన రిటైల్‌ వ్యాపారంలో 49 శాతం వాటా అమ్మడం ద్వారా రూ.7629 కోట్లు(ఇది ఈ త్రైమాసిక ఫలితాల్లో అసాధారణ అంశం) పొందింది.
రుణాలున్నాయి కానీ..
సెప్టెంబరు 30, 2020 నాటికి కంపెనీ స్థూల రుణాలు రూ.2,79,251 కోట్లుగా ఉన్నాయి. అంతక్రితం త్రైమాసికంలో ఇవి రూ.3,36,294 కోట్లుగా ఉన్నాయి. రూ.1,85,711 కోట్ల నగదు; వాటా విక్రయ ఒప్పందాల ద్వారా అందుకున్న రూ.30,210 కోట్లు; అందుకోవాల్సిన రూ.73,586 కోట్లను పరిగణనలోకి తీసుకున్నాక మిగులు రూ.10,250 కోట్లుగా ఉంది.