Business

అలయెన్స్ ఎయిర్ CEOగా కెప్టెన్ హర్‌ప్రీత్-వాణిజ్యం

అలయెన్స్ ఎయిర్ CEOగా కెప్టెన్ హర్‌ప్రీత్-వాణిజ్యం

* చైనాకు చెందిన ఆర్థిక సేవల దిగ్గజ సంస్థ ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ రాడార్‌లోకి వచ్చింది. ఈ సంస్థకు కళ్లెం వేయాలని ఆయన కార్యవర్గం భావిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే అమెరికా సహా ఐరోపా ఇతర ప్రాంతాల్లో హువావేను కట్టడి చేసిన ట్రంప్‌ ఇప్పుడు మరో చైనా సంస్థపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. చైనాకు చెందిన బడా ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ సంస్థ అలీబాబా గ్రూప్‌నకు చెందిన ‘యాంట్‌ గ్రూప్‌’ను కట్టడి చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు ప్రముఖ ఆంగ్ల వార్త సంస్థ పేర్కొంది. ఇదే జరిగితే డ్రాగన్‌కు అంతర్జాతీయంగా పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లవుతుంది.

* భారత విమానయాన చరిత్రలో తొలిసారి ఓ మహిళా అధికారి దేశీయ విమానయాన సంస్థ పగ్గాలు చేపట్టనున్నారు. ఎయిరిండియా(ఏఐ) ప్రాంతీయ అనుబంధ సంస్థ అయిన అలయన్స్‌ ఎయిర్‌కు కెప్టెన్‌ హర్‌ప్రీత్‌ సింగ్‌ను సీఈవోగా నియమిస్తూ ఎయిరిండియా సీఎండీ రాజీవ్‌ భన్సల్‌ ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు ఈమె ఆ పదవిలో కొనసాగనున్నారు. ప్రస్తుతం హర్‌ప్రీత్‌ సింగ్‌ ఎయిరిండియా ఫ్లైట్‌ సేఫ్టీ విభాగంలో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈమె స్థానాన్ని కెప్టెన్‌ నివేదితా భాసిన్‌ భర్తీ చేయనున్నారు.

* ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర, రాష్ట్రాల సంయుక్త ద్రవ్యలోటు జీడీపీలో 13 శాతానికి చేరే అవకాశం ఉందని సింగపూర్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే రుణసంస్థ డీబీఎస్‌ తెలిపింది. ఏడాదిక్రితంతో పోలిస్తే ద్రవ్యలోటు దాదాపు రెట్టింపు అవుతోందని పేర్కొంది. కరోనా పరిణామాల నేపథ్యంలో వృద్ధి క్షీణత బాట పట్టడం, ఉద్దీపనల కింద జీడీపీలో 2 శాతం మేర అదనంగా వెచ్చించడం లాంటివి ద్రవ్యలోటు పెరిగేందుకు కారణం కానున్నాయని డీబీఎస్‌ నివేదిక పేర్కొంది. మూడేళ్లుగా జీడీపీలో 70 శాతం లోపునకు ఉన్న ప్రభుత్వ రుణభారం.. ఈ ఆర్థిక సంవత్సరంలో 80 శాతానికి పెరిగి రూ.75.6 లక్షల కోట్లు లేదా 1.01 లక్షల కోట్ల డాలర్లకు చేరనుంది. ఇదే జరిగితే ఆసియాలో చైనా తర్వాత అత్యధిక అప్పు ఉన్న రెండో దేశంగా భారత్‌ నిలుస్తుంది. 2019-20లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మొత్తం ద్రవ్యలోటు జీడీపీలో 7 శాతానికి పైగా నమోదైంది. గత ఐదేళ్ల సగటు అయిన 6.6 శాతం కంటే ఇది ఎక్కువ కావడం గమనార్హం. 2015-16 నుంచి 2018-19 వరకు కేంద్రం 4 శాతం లోపునకే ద్రవ్యలోటును నియంత్రిస్తూ వచ్చింది. అయితే అధిక కేటాయింపులు, ఆదాయం తగ్గడంతో 2019-20లో ద్రవ్యలోటు 4.6 శాతానికి పెరిగింది. ‘కరోనా మహమ్మారి సంబంధిత పరిణామాలతో ఈ ఏడాది సంయుక్త ద్రవ్యలోటు జీడీపీలో 13 శాతానికి ఎగబాకే అవకాశం ఉంద’ని రాధికా రావు నేతృత్వంలోని డీబీఎస్‌ ఆర్థికవేత్తలు తమ నివేదికలో తెలిపారు. గత మూడేళ్లలో సగటున జీడీపీలో సుమారు 70 శాతంగా ఉన్న ప్రభుత్వ అప్పు వాస్తవానికి తగ్గాల్సి ఉంది. అయితే ఆర్థిక వ్యవస్థపై కరోనా పరిణామాల ప్రభావంతో అప్పు పెరిగి, జీడీపీలో 80 శాతానికి చేరే అవకాశం ఉందని వెల్లడించింది. 2020 జులై చివరినాటికి కేంద్ర ప్రభుత్వ రుణాలు (బాండ్లు, టి-బిల్లులు) రూ.75.6 లక్షల కోట్లు లేదా 1.01 ట్రిలియన్‌ డాలర్లు కాగా.. రాష్ట్రాల అభివృద్ధి రుణాలు రూ.34 లక్షల కోట్లు లేదా 459 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. 2018-19లో రుణాల నిమిత్తం రాష్ట్రాలు జారీ చేసిన మొత్తం బాండ్ల విలువలో ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాలవే సగానికి పైగా ఉంటుండగా.. తొలి 10 స్థానాల్లో ఉన్న రాష్ట్రాలది 75 శాతం వరకు ఉంటుంది.

* కొవిడ్‌ పరిణామాలను ఎదుర్కోడానికి పేద దేశాల్లోని ప్రైవేటు రంగ కంపెనీలకు 400 కోట్ల డాలర్ల(దాదాపు రూ.30,000 కోట్లు) రుణాలిచ్చినట్లు ద ఇంటర్నేషనల్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌(ఐఎఫ్‌సీ) తెలిపింది. వర్థమాన దేశాల్లోని ప్రైవేటు రంగ కంపెనీలపై ఈ అతిపెద్ద అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ దృష్టి సారిస్తుంటుంది.మొత్తం 800 కోట్ల డాలర్ల రుణాలను ప్రైవేటు కంపెనీలకు వేగంగా అందించాలని మార్చిలో ఈ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. అందులో ఇప్పటిదాకా 400 కోట్ల డాలర్ల రుణాలు ఇచ్చినట్లు ఐఎఫ్‌సీ దక్షిణాసియా ప్రాంతీయ డైరెక్టర్‌ మెంగిస్తు అలెమయెహు ఒక ప్రకటనలో తెలిపారు. భారత్‌లో ఎన్ని రుణాలిచ్చిందీ తెలపలేదు. అయితే డీసీఎమ్‌ శ్రీరామ్‌కు 4 కోట్ల డాలర్ల(దాదాపు రూ.300 కోట్లు) రుణాన్ని ఇచ్చినట్లు తెలిపారు. 2019-20లో అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని ప్రైవేటు కంపెనీలు, ఆర్థిక సంస్థల్లో ఐఎఫ్‌సీ మొత్తం 22 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టింది.

* జులై- సెప్టెంబరు త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌ లిమిటెడ్‌ (జేఎస్‌పీఎల్‌) నికర నష్టం రూ.706.49 కోట్లకు పెరిగింది. 2019-20 ఇదే సమయంలో నికర నష్టం రూ.399.31 కోట్లుగా ఉంది. మొత్తం ఆదాయం రూ.7,688.62 కోట్ల నుంచి రూ.9,137.43 కోట్లకు పెరిగింది. ‘సమీక్షా త్రైమాసికంలో దేశీయ ఉక్కు పరిశ్రమ మెరుగైన పనితీరు కనబర్చింది. వినియోగ స్థాయిలు పెరిగాయి. దేశీయంగా గిరాకీ పరిస్థితులు పుంజుకున్నాయి. వ్యాపారమూ సాధారణ స్థితికి చేరింద’ని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. స్టాండలోన్‌ పద్ధతిలో కంపెనీ ఉత్పత్తి రికార్డు స్థాయిలో 1.84 మిలియన్‌ టన్నులుగా నమోదు కాగా.. విక్రయాలు 1.93 మిలియన్‌ టన్నులు అని పేర్కొంది. ఎగుమతులు 0.74 మిలియన్‌ టన్నులుగా నమోదయ్యాయని తెలిపింది.

* పదేళ్ల నాటి ఓ పేటెంట్‌ హక్కుల కేసులో ప్రముఖ సాంకేతిక దిగ్గజం యాపిల్‌కు అమెరికాలోని ఓ కోర్టు భారీ జరిమానా విధించింది. ఈ విషయంలో విర్‌నెట్‌ఎక్స్‌ కార్ప్‌ అనే సంస్థకు 502.8 మిలియన్‌ డాలర్లు పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది. యూఎస్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ కోసం అభివృద్ధి చేసిన ఓ ప్రత్యేక సాంకేతికతను యాపిల్‌ తమ ఉత్పత్తులలో అందిస్తున్న ‘వీపీఎన్‌ ఆన్‌ డిమాండ్‌’, ఫేస్‌టైమ్‌ ఫీచర్లలో వినియోగించుకుంటోందన్నది విర్‌నెట్‌ఎక్స్‌ వాదన. అయితే, ఆ పేటెంట్‌ హక్కులు కాలం చెల్లినవని యాపిల్‌ చెబుతోంది. తమ ఉత్పత్తుల ప్రధాన పనితీరులో విర్‌నెట్‌ఎక్స్‌ సాంకేతికత ఉపయోగమేమీ లేదని తెలిపింది. ఇలాంటి కేసుల వల్ల సాంకేతిక రంగానికి, వినయోగదారులకు నష్టం చేకూరుతుందని వాదించింది. ఇప్పటికే గత ‘వీపీఎన్‌ ఆన్‌ డిమాండ్‌’, ఫేస్‌టైమ్‌ ఫీచర్ల వెర్షన్లలో ఇదే సాంకేతికతను వినియోగించుకుందన్న కేసులో కోర్టు ఆదేశాల మేరకు యాపిల్‌ 454 మిలియన్‌ డాలర్లు చెల్లించింది.