ScienceAndTech

విపత్తు సహాయక సేవలో వీధికుక్కలు

విపత్తు సహాయక సేవలో వీధికుక్కలు

వీధి కుక్క‌లకు స‌రైన శిక్ష‌ణ ఇచ్చి డాగ్ స్క్వాడ్‌లో చేర్చుకునే కార్య‌క్ర‌మానికి NDRF శ్రీకారం చుట్టింది. భారీ సంఖ్య‌లో వీధి కుక్క‌ల‌కు ట్రెయినింగ్ ఇచ్చి సెర్చ్, రెస్క్యూ ఆప‌రేష‌న్‌ల‌లో వినియోగించాల‌ని భావిస్తున్న‌ది. ఈ ప్ర‌యోగాత్మ‌క కార్య‌క్ర‌మంలో భాగంగా NDRF 8వ బెటాలియ‌న్‌ ఇప్ప‌టికే నాలుగు వీధి కుక్క‌ల‌కు శిక్ష‌ణ ఇస్తున్న‌ది. అందులో బ్లేజ్‌, టైగ‌ర్ అనే రెండు వీధి కుక్క‌లు 40 వారాల శిక్ష‌ణ పూర్తి చేసుకున్నాయి. బ్లేజ్, టైగ‌ర్ త్వ‌ర‌లోనే NDRF డాగ్ స్క్వాడ్‌లో సభ్యులుగా చేర‌నున్నాయి.బ్లేజ్, టైగ‌ర్ రెండూ జ‌ర్మ‌న్ షెఫ‌ర్డ్స్‌గానీ, లాబ్రాడ‌ర్స్‌గానీ కావ‌ని.. అయినా అవి విజ‌య‌వంతంగా ట్రెయినింగ్ పూర్తి చేసుకున్నాయ‌ని NDRF 8వ బెటాలియ‌న్ తెలిపింది. ఘ‌జియాబాద్‌లోని గోవింద‌పురం క్యాంప‌స్ నుంచి తాము నాలుగు వీధి కుక్క‌ల‌ను ద‌త్త‌త తీసుకున్నామ‌ని, అందులో బ్లేజ్‌, టైగ‌ర్ రెండూ 17 నెల‌ల వ‌య‌సు క‌లిగి ఉండ‌గా.. మ‌రో రెండు కుక్క పిల్లలు 50 రోజుల వ‌య‌సు క‌లిగి ఉన్నాయ‌ని చెప్పింది. ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ ఓక‌ల్ ఫ‌ర్ లోక‌ల్ భావ‌న‌కు అనుగుణంగా తాము ఈ కొత్త ప్ర‌యోగం చేప‌ట్టామ‌ని NDRF అధికారులు తెలిపారు. జ‌ర్మ‌న్ షెఫ‌ర్డ్స్‌, లాబ్రాడ‌ర్స్‌తో పోల్చుకుంటే వీధి కుక్క‌ల‌కు ట్రెయినింగ్ ఇవ్వ‌డం కొంచెం క‌ష్ట‌మేన‌ని, అయితే అవి కొంచెం దారిలోకి వ‌చ్చాయంటే చాలా చ‌క్క‌గా నేర్చుకుంటాయ‌ని NDRF 8వ బెటాలియ‌న్ కమాండెంట్ పీకే తివారీ చెప్పారు. వీధి కుక్క‌ల‌కు ట్రెయినింగ్ కొంచెం క్లిష్ట‌మైనా.. జ‌ర్మ‌న్ షెఫ‌ర్డ్స్, లాబ్రాడ‌ర్స్‌తో పోల్చుకుంటే వాటికి అంత‌గా కేర్ తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉండ‌ద‌ని తివారీ పేర్కొన్నారు. త‌మ బెటాలియ‌న్‌లోని డాగ్ స్క్వాడ్‌లో ప్ర‌స్తుతం 20 శిక్ష‌ణ పొందిన శున‌కాలు ఉన్నాయ‌ని, త్వ‌ర‌లో బ్లేజ్‌, టైగ‌ర్ కూడా వాటితో చేర‌బోతున్నాయ‌ని ఆయ‌న తెలిపారు.