DailyDose

హైదరాబాద్‌లో మత ఘర్షణలకు భాజపా కుట్ర-తాజావార్తలు

హైదరాబాద్‌లో మత ఘర్షణలకు భాజపా కుట్ర-తాజావార్తలు

* పంజాబ్‌ పోరాటం ముగిసింది. అబుదాబి వేదికగా చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో తొమ్మిది వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసి టోర్నీ నుంచి వైదొలిగింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. దీపక్ హుడా (62*; 30 బంతుల్లో, 3×4, 4×6) అజేయ అర్ధశతకంతో రాణించాడు. అనంతరం బరిలోకి దిగిన చెన్నై 18.5 ఓవర్లలోనే వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

* దుబ్బాక ఉపఎన్నిక ప్రచారం గడువు ముగియనున్న తరుణంలో భాజపా నేతలు మరో కొత్త కుట్రకు తెరలేపేందుకు యత్నిస్తున్నారని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు. హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున అలర్లు సృష్టించేందుకు భాజపా ప్రయత్నిస్తోందని.. ఆ పార్టీలోని అత్యంత విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందినట్లు కేటీఆర్ చెప్పారు. తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ మీడియాతో మాట్లాడారు.

* ఐపీఎల్ లీగ్ మ్యాచుల్లో మరో ఆసక్తికరమైన పోరు జరుగుతోంది. దుబాయ్‌ వేదికగా కోల్‌కతా, రాజస్థాన్ జట్లు తలపడుతున్నాయి. టాస్ నెగ్గిన రాజస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది. కోల్‌కతా బ్యాట్స్‌మెన్ నిలకడగా ఆడుతున్నారు. ప్లేఆఫ్‌ రేసులో గెలిచిన జట్టే ఉంటుంది. కాబట్టి విజయంపై ఇరు జట్లు కన్నేశాయి.

* దుబ్బాక ఉపఎన్నిక ప్రచార గడువు ముగిసింది. సాయంత్రం 6 గంటల నుంచి మైకులన్నీ మూగబోయాయి. ఈనెల 3న పోలింగ్‌ జరగనుండగా.. 10న ఫలితాలు వెల్లడికానున్నాయి. తెరాస ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతితో దుబ్బాకలో ఉపఎన్నిక అనివార్యమైంది. ఉపఎన్నిక బరిలో 23 మంది అభ్యర్థులు నిలిచినప్పటికీ ప్రధాన పోటీ మాత్రం అధికార తెరాస, భాజపా, కాంగ్రెస్‌ మధ్యే ఉండనుంది.

* హైదరాబాద్‌లో పట్టుబడిన నగదుతో తనకెలాంటి సంబంధం లేదని దుబ్బాక భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు స్పష్టం చేశారు. ఒక సంస్థ యజమాని మరో సంస్థకు ఇచ్చిన నగదు హవాలా సొమ్ము ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఆ నగదు సిద్దిపేట, దుబ్బాకకు వచ్చిందా? అని ఆయన నిలదీశారు. దుబ్బాకలో నిర్వహించిన మీడియా సమావేశంలో రఘునందన్‌రావు మాట్లాడారు. ఈ సందర్భంగా తెరాస ప్రభుత్వం, మంత్రి హరీశ్‌రావుపై విమర్శలు గుప్పించారు.

* బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే జేడీయూ అధినేత నీతీశ్‌ కుమార్‌ ఆర్జేడీ నేతృత్వంలోని మహా కూటమి పంచకు చేరడం ఖాయమని ఎల్జేపీ అధినేత చిరాగ్‌ పాస్వాన్‌ అన్నారు. అంతేకాదు 2024 లోక్‌సభ ఎన్నికల్లో మోదీకి పోటీగా ప్రధాని అభ్యర్థిగా బరిలో నిలవాలని భావిస్తున్నారని చెప్పారు. ఎప్పటికైనా భాజపాకు తామే అత్యంత విశ్వాసపాత్రమైన పార్టీ అని చెప్పారు.

* ‘‘దుబ్బాక నియోజకవర్గంలో తెరాస చాలా బలమైన పార్టీ. నిన్నటి వరకు దుబ్బాకలో కొన్ని పార్టీలు పరాయి నాయకులు.. కిరాయి కార్యకర్తలతో ప్రచారం చేశారు. ఇవాళ్టితో మొత్తం ఖాళీ అయింది. నేటి నుంచి దుబ్బాకలో ఇక్కడి మట్టి బిడ్డలు మాత్రమే ఉంటారు. సీఎం కేసీఆర్‌కు దుబ్బాక మట్టి పరిమళం తెలుసు’’ అని మంత్రి హరీశ్‌రావు అన్నారు. దుబ్బాకలో ఆయన మీడియాతో మాట్లాడారు.

* ఏపీ ప్రభుత్వం కరోనా బులెటిన్‌ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో 88,780 నమూనాలను పరీక్షించగా 2,618 మందికి కొవిడ్‌ నిర్ధారణ అయినట్లు వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,25,966కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో కొవిడ్‌ చికిత్స పొందుతూ 16 మంది మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 6,706కి చేరింది.

* పండగలు వచ్చాయంటే చాలు.. ఇంటినీ, వేడుకలను, ప్రియమైన వ్యక్తులను, పాత జ్ఞాపకాలు గుర్తుకు తెస్తాయి. మనకు ఇష్టమైన పండగ అయితే, ఇంటిని మిస్సవుతున్నామన్న బాధ ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది. పండగ వినోదాలు లేవన్న మీ బాధను తీర్చడానికి ఫ్లాష్‌ సేల్‌తో మీ ముందుకు వచ్చింది యప్‌ టీవీ. అమెరికా రీజియన్‌లో అక్టోబరు 29న మొదలైన ఈ సేల్‌ నవంబరు 2తో ముగుస్తుంది.

* దేశంలో పెరుగుతున్న రైల్వే ప్రయాణికుల అవసరాలను ఆ శాఖ తీర్చేలేకపోతోందన్న చేదు నిజం మరోసారి బయట పడింది. టికెట్‌ కొన్నా చాలా మంది ప్రయాణానికి దూరమవుతున్నారన్న విషయం ఓ ఆర్‌టీఐ దరఖాస్తు ద్వారా వెల్లడైంది. ఒక్క 2019-2020 ఏడాదిలోనే ఇలా కోటి మందికి పైగా ప్రజలు రైల్వే ప్రయాణానికి దూరమయ్యారని తేలింది. వెయిటింగ్‌ లిస్ట్‌ ఉండే టికెట్లు ఆటోమేటిక్‌గా రద్దు కావడమే ఇందుకు కారణం.

* తెలంగాణ భాజపా అధికార ప్రతినిధి, ముఖ్యనేత రావుల శ్రీధర్‌రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ప్రకటించారు. తనతోపాటు జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో వివిధ డివిజన్ల నేతలు, కార్యకర్తలు తెరాసలో చేరనున్నట్లు వెల్లడించారు. భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పూర్తి అబద్ధాలతో ప్రజలను మభ్యపెడుతోందని.. ఆ పార్టీతో తెలంగాణకు న్యాయం జరగదని చెప్పారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో తెరాంగాణ పురోగమిస్తోందన్నారు. మంత్రి కేటీఆర్‌ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఐటీ, పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందుతోందని శ్రీధర్‌రెడ్డి చెప్పారు. శాసనసభ ఎన్నికల్లో జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం నుంచి ఓటమి పాలైనా గత పదేళ్లుగా ప్రజల్లోనే ఉన్నానని ఆయన వివరించారు.

* కేరళకు చెందిన పీసీసీ అధ్యక్షుడు ముళ్లపల్లి రామచంద్రన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అత్యాచార బాధితురాలిని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అత్యాచారానికి గురైన మహిళను వ్యభిచారితో పోల్చారు. ఆత్మగౌరవం ఉన్న మహిళ అయితే ఎంతమాత్రం ప్రాణాలతో ఉండబోరని పేర్కొన్నారు. అధికార ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. కాసేపటికే తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకోవద్దంటూ సర్ది చెప్పుకునే ప్రయత్నం చేశారు.

* కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ నుంచి వెళ్లే పన్నుల్లో సంగం మాత్రమే రాష్ట్రానికి తిరిగి వస్తుందని.. ప్రజలకు ఈ విషయాలు తెలపాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. కేంద్ర, రాష్ట్ర ఆర్థిక గణాంకాలను వివరిస్తూ మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌లో పోస్టు చేశారు. 2014 నుంచి ఇప్పటివరకు రూ. 2,75,926 కోట్లను కేంద్ర ప్రభుత్వం పన్నుల రూపంలో తీసుకోగా రూ.1,40,329 కోట్లను మాత్రమే రాష్ట్రానికి తిరిగి ఇచ్చిందని వివరించారు. కీలక రంగాల్లో పెట్టుబడులతో పాటు ప్రభుత్వం పెద్ద ఎత్తున ఖర్చు చేసిన మూలధన వ్యయం ఫలితంగానే రాష్ట్ర జీడీపీ దేశంతో పోలిస్తే భారీగా పెరిగిందన్నారు. అదే సమయంలో రాష్ట్రానికి సంబంధించిన అప్పులు, జీఎస్‌డీపీ నిష్పత్తి 22.8 శాతంగా ఉందన్నారు. దేశంలో రుణాలు, జీఎస్‌డీపీ నిష్పత్తి తక్కువ కలిగిన 5 రాష్ట్రాల్లో ఒకటిగా తెలంగాణ నిలిచిందని కేటీఆర్ తెలిపారు.

* ఏపీ సీఎం జగన్‌ పోలవరం ప్రాజెక్టుపై అవగాహనలేని రాజకీయం చేస్తున్నారని.. ప్రాజెక్టు విషయంలో సమస్య వస్తే కేంద్రంతో మాట్లాడకుండా బాధ్యతారాహిత్యంగా లేఖ రాస్తారా అని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. జగన్‌కు అవగాహన లేకపోతే పూర్తిగా తెలుసుకోవాలన్నారు. పోలవరం ప్రాజెక్టు తుది అంచనాల విషయంలో జోక్యం చేసుకోవాలని, నిర్మాణం పూర్తి చేసేలా నిధులు ఇప్పించాలని కోరుతూ సీఎం జగన్‌ ప్రధాని లేఖ రాసిన విషయం తెలిసిందే. ఆదివారం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ జగన్‌ ప్రధానికి రాసిన లేఖపై స్పందించారు.. . పోలవరంపై కేంద్రంతో నేరుగా మాట్లాడకుండా తెదేపాపై ఎదురుదాడి చేస్తున్నారని విమర్శించారు. ప్రాజెక్టులపై ఎలాంటి అవగాహన లేకుండా రాష్ట్రానికి నష్టం చేయొద్దని హితవు పలికారు. ప్రధానికి రాసిన లేఖ ద్వారా జగన్‌ చులకన అయ్యారని ఎద్దేవా చేశారు.