‘కౌ’గిలింత.. ఇప్పుడు ఇది కూడా ఓ థెరపీనే. ఆగండాగండి, కౌగిలింత అనగానే ఎక్కడికో వెళ్లిపోవద్దు. ‘కౌ’ అంటే ఆవు. అంటే గోవు. దానిని ఆలింగనం చేసుకోవడం ద్వారా బోల్డన్ని ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. ఒత్తిడి దూరం కావడమే కాకుండా మనసులోని చీకుచింతా కూడా మాయమైపోతుందని, నూతనోత్సాహం నిండుకుండలా తొణికిసలాడుతుందని చెబుతూ కొత్త వైద్య విధానాన్ని తెరపైకి తెచ్చారు. ప్రస్తుత కరోనా కాలంలో ‘కౌ థెరపీ’కి బోల్డంత డిమాండ్ కూడా వచ్చేసింది. ఇప్పుడు జనాలందరూ గోవుల వేటలో పడ్డారు. అది కనిస్తే చాలు ఈ జన్మకు ఇదే భాగ్యం అన్నట్టు ఆలింగనం చేసుకుని దానికి తమ బాధలు చెప్పుకుంటూ సేదదీరుతున్నారు. నెదర్లాండ్స్‌లోని రీవర్‌లో ఎప్పటి నుంచే ఈ థెరపీ అందుబాటులో ఉంది. దీనిని అక్కడ ‘కొ నఫెలెన్’ అంటారు. అంటే డచ్‌లో ‘కౌ హగ్గింగ్’ అని అర్థం. ఇప్పుడు దీనికి ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ వచ్చేసింది. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా ‘గో కౌగిలి’ కోసం వెల్‌నెస్ సెంటర్లు కూడా వెలస్తున్నాయి. గోవును హగ్ చేసుకోవడం వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుందని, చిరాకు దూరమవుతుందని, మానసిక ఆరోగ్యం మెరుగవుతుందని చెబుతున్నారు పలు అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. నిజానికి గోవుతో చాలా లాభాలు ఉన్నాయనేది పూర్వీకుల మాట. గోమూత్రం, గోమయం వల్ల చెప్పలేనన్ని ప్రయోజనాలు ఉన్నాయని అంటారు. అందుకనే దానిని ‘మాత’గా కొలుస్తారు. పల్లెల్లో తెల్లారిలేస్తే ఆవుపేడతో కళ్లాపి చల్లని వాకిలి కనిపించదు. హిందూమతంలో గోవుకు విశిష్టమైన స్థానం ఉంది. పురాణేతిహాల్లో అయితే చెప్పక్కర్లేదు. 2007లో ‘అప్లైడ్ యానిమల్ బిహేవియర్ సైన్స్’ జర్నల్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనం ప్రకారం.. గోవులను ఆలింగనం చేసుకోవడం వల్ల ఒత్తిడి పోయి మనసుకు హాయిగా ఉంటుందని, దాని వీపు, మెడ, చెవులు, గంగడోలు ప్రాంతాల్లో ప్రేమగా నిమరడం వల్ల ఒత్తిడి దూదిపింజంలా ఎగిరిపోతుందని అధ్యయనం వివరించింది. గోవును కౌగిలించుకోవడం వల్ల మానవులలో పిట్యుటరీ గ్రంథి ప్రేరేపితమవుతుంది. ఫలితంగా ఒత్తిడి తగ్గుతుందని నమ్ముతారు. సామాజిక పరమైన బంధాలలో ఈ హార్మోన్ విడుదలవుతుంది. క్షీరదాలను ఆలింగనం చేసుకోవడం వల్ల ప్రశాంతమైన భావాలు జనిస్తాయని అధ్యయనం నొక్కి చెప్పింది. అధ్యయనాలు ఎన్ని చెబుతున్నా.. జంతువులను ప్రేమగా చూడడం, వాటితో మమేకమై జీవించడం మనకు అలవాటే. పూర్వీకులందరూ వాటిని సొంతబిడ్డల్లా చూసుకుని లాలించినవారే. అందుకే కాబోలు.. వారంతా సంతోషంగా, ఏ చీకూచింతా లేకుండా జీవించారు. కానీ ఇప్పటి తరమే టెక్నాలజీ ముసుగులో వాటికి దూరమై, ఒత్తిడితో సతమతమవుతూ తిరిగి థెరపీల పేరుతో మళ్లీ అక్కడికే చేరుకుంటుండడం విడ్డూరంగా లేదూ!
గో కౌగిలింతలతో ఒత్తిడికి చికిత్స
Related tags :