ఆశ్వయుజ తదియ రోజున మహిళలంతా జరుపుకునే సంప్రదాయమైన పండగ అట్లతద్ది. చంద్రకళలో గౌరీదేవిని ఆరాధించే తిధి ఇది.
ఈ పండుగలో కన్యలు మొదలుకొని ముత్తైదువుల వరకు కలసి ఆటలాడుకోవడం, వేడుకలు జరపడం, రాత్రివేళ చంద్రునీ గౌరీని పూజించి అట్లనోము జరుపుకొనడం సంప్రదాయం. దీనినే “చంద్రోదయోమావ్రతం” అని కూడా అంటారు. అంత పెద్దమాట నోరు తిరగక, చాలా చక్కగా అందరికి విషయం అర్ధం అయ్యేలా అట్లతద్ది అని మారిపోయింది.
ఆడపిల్లలంతా తెల్లవారుజాము నుంచి రోజంతా ఎంతో స్వేచ్ఛగా, సంతోషంగా ఆటలాడుకునే పండుగ కనుక మొదట ఇది ‘ఆటల తదియ’ అయింది. ఆటపాటలన్నీ అయ్యాక చంద్రోదయ సమయాన అమ్మవారికి పెట్టే నైవేద్యంలో ప్రత్యేకంగా అట్లు ఉంటాయి కనుక ‘అట్లతద్ది’ లేదా ‘అట్లతద్దె’ అని మారింది. ఈ పండగలో ప్రత్యేకత ఉయ్యాల ఊగటం. ఉయ్యాలని వేసి ఊగే ఆ పద్ధతికి కారణం సూర్యుడు తులా(ఉయ్యాల) రాశిలో ఉంటాడని తెలియజేయడానికే..
ఈ రోజున వివాహితలూ, అవివాహితలూ అంతా చంద్రోదయ ఉమావ్రతం జరుపుకుంటారు. సాయంత్రం చంద్రదర్శనం తర్వాత ఉమాదేవిని భక్తిగా పూజించి, అట్లు నైవేద్యంగా సమర్పిస్తారు. ఆ తర్వాత అట్లతద్ది నోము మహాత్యాన్ని తెలిపే కథ చెప్పుకుని అక్షింతలు తల మీద చల్లుకుంటారు. ఈ నోము చేయటం వల్ల గౌరమ్మ తల్లి ఐదో తనాన్ని అష్టభాగ్యాల్ని ప్రసాదిస్తుందని నమ్మకం.