NRI-NRT

వైభవంగా టాంటెక్స్ 159వ నెలనెలా తెలుగు వెన్నెల సదస్సు

Tantex 159th NNTV Held In Dallas Virtually

నేడు అక్టోబరు మాసపు నెలనెలా తెలుగు వెన్నెల సమావేశం దసరా పండుగ వాతావరణంలో జరగడం వల్ల సాహిత్య గోష్ఠి తోబాటు సభికులందరూ శభాకాంక్షలు పంచుకొనే అవకాశం కలిగినట్లయింది. సాహిత్యాన్ని గురించిన చర్చలు, తెలుగు పండుగ రెండూ మన సంస్కృతిని గుర్తు చేసేవే కాబట్టి సభ్యులందరూ విచ్చేసి ఉత్సాహం కనబరచారు.

ప్రారంభంలో చిన్నారులు సాహితి , సిందూర “ఏది హిందు ఏది ముస్లిమ్ ఏది క్రైస్తవము, ఎల్ల మతముల సారమొక్కటే, హృదయమే మతము” అనే మతసామరస్య సందేశాన్ని ప్రార్థనా గేయంగా ఆలపించి సభికులను ఆకట్టుకున్నారు. ముఖ్య అతిధి శ్రీమతి పద్మ దేవగుప్తపు గారిని స్థానిక ఆచార్యులు జగదీస్వరన్ పూదూరు గారు వేదికకి పరిచయం చేసారు. ఎప్పూడూ చివరి అంశంగా ఉండే ప్రధాన వక్త ప్రసంగం ఈ మారు కూడా మొదటి అంశంగా ఉండడం ఒక విశేషం. శ్రీమతి పద్మ దేవగుప్తపు గారు “కవి-సత్యాన్వేషణ” అన్న అంశంపై ప్రధాన ప్రసంగం చేస్తూ ప్రాచీన కాలంనుండి మొదలు ఆధునిక యుగం వరకూ సాగుతున్న తెలుగు కవితా ప్రస్థానంలో ఆయా మహాకవులు తమ తమ సాహిత్యంలో ఏవిధంగా ఆయా కాలాలను ప్రభావితం జేసిన సామాజిక సత్యాలను పొందుపరచారో సోదాహరణంగా వివరించారు. “పద్మ పద్యవాహిని” అనే శీర్షికన వారు రచించి ప్రచురించిన ఆధ్యాత్మిక భావ గేయ కవితా సంపుటి లోనివి కూడా మచ్చుకు కొన్ని వినిపించారు. వారి ప్రసంగానికి సభికుల సహృదయ స్పందన కూడా తోడై చక్కటి అంశంగా తొలి కార్యక్రమం వికసించింది

ఎప్పటివలెనే “మనతెలుగు సిరి సంపదలు” శీర్షికన జాతీయాలు, పొడుపు కథల పరంపరను ఉరుమిండి నరసింహా రెడ్డి గారు కొనసాగించారు. వాటికి తోడుగా తెలుగు సాహితీ జగత్తు లోని ప్రసిద్ద కవితాపంక్తులను ప్రశ్నలు జవాబుల రూపంలో సదస్యులందరినీ చర్చలో భాగస్వాములును చేయడం జరిగింది. శ్రీ ఉపద్రష్ట సత్యం గారు “పద్య సౌగంధం” శీర్షికన శ్రీనాథ కవి సార్వభౌముడు సంస్కృతాంధ్రము, అచ్చతెనుగు రెంటిలోనూ ఏ విధంగా సాహిత్య సవ్యసాచియో నిరూపణ చేశారు. శ్రీనాథుని అచ్చతెలుగు కవితా పటిమను సోదాహరణంగా అర్థతాత్పర్య సహిత విశేషాలతో వివరించడం జరిగింది. శ్రీ జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం గారు “మాసానికో మహనీయుడు” అనే శీర్షక కొనసాగింపుగా, అక్టోబరు మాసంలో జన్మించిన తెలుగు సాహితీ మూర్తులను ప్రజెంటేషన్ ద్వారా సభకు గుర్తు చేసి స్మరణకు తెచ్చారు. మరొక అంశంలో లెనిన్ బాబు వేముల దసరా పండుగ సందర్భంగా శ్రీ రాచాలపల్లి బాబు దేవీదాసు గారు సంగ్రహపరచిన “శ్రీ లలితా సహస్రనామార్థ సంగ్రహం” లోని కొన్ని శ్లోకాలను అర్థ సహితంగా సభికులకు వివరించడం జరిగింది. లలితా సహస్రనామ పుట్టుక, సాహిత్యంలో దాని విశిష్ఠతను కూడా సభికులు గ్రహించే విధంగా చెప్పడం జరిగింది.

ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం అధ్యక్షులు శ్రీ కృష్ణా రెడ్డి కోడూరు గారు ముఖ్య అతిధి శ్రీమతి పద్మజ దేవగుప్తపు గారికి,ప్రార్థనా గీతం పాడిన సాహితి,సింధూరలకి, మిగిలిన వక్తలకి,విచ్చేసిన సాహిత్య అభిమానులకి ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం కార్యవర్గం మరియు పాలక మండలి తరుపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

వైభవంగా టాంటెక్స్ 159వ నెలనెలా తెలుగు వెన్నెల సదస్సు