అత్యధిక కాలం అధ్యక్షుడిగా పనిచేసిన నేతగా ఫ్రాంక్లిన్ డి రూజ్‌వెల్ట్ చరిత్ర సృష్టించారు. ఆయన వరుసగా 1932, 1936, 1940, 1944ల్లో నాలుగుసార్లు ఎన్నికయ్యారు. నాలుగో దఫా పదవిలో కొనసాగుతూనే 1945 ఏప్రిల్ 12న మరణించారు. ఎన్నిసార్లయినా అధ్యక్ష పదవి చేపట్టే అవకాశం అప్పట్లో ఉండేది. రెండుసార్లకు మించి ఈ పదవిని చేపట్టరాదని 1951లో రాజ్యాంగాన్ని సవరించారు. ఈ సవరణ అనంతరం అయిదుగురు నాయకులు… డ్వైట్ డి ఐసెన్ హోవర్, రొనాల్డ్ రీగన్, బిల్ క్లింటన్, జార్జి డబ్ల్యూ బుష్, బరాక్ ఒబామా రెండుసార్లు అధ్యక్షులయ్యారు.
* అతి తక్కువ కాలం పని చేసిన అధ్యక్షుడు విలియం హెన్రీ హారిస్. ఒహాయోకు చెందిన హారిస్ కేవలం 31 రోజులు పదవిలో ఉన్నారు. పదవిలో ఉంటూ మరణించిన (1841లో) మొదటి దేశాధినేత అయనే.
**నాడు 6% ఓటర్లే!
* తొలి అధ్యక్షుడిగా వర్జీనియాకు చెందిన జార్జి వాషింగ్టన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన తరవాత ఏ అధ్యక్షుడూ ఇప్పటివరకు ఏకగ్రీవంగా ఎన్నిక కాలేదు. వాషింగ్టన్ ఏ పార్టీకీ చెందిన వారు కారు. 1789 ఏప్రిల్ 30న న్యూయార్క్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. 1797 మార్చి 4న పదవీ విరమణ చేశారు. రెండు దఫాలు అత్యున్నత పదవిని నిర్వహించారు. ముగ్గురు ఉత్తమ అధ్యక్షుల్లో ఒకరిగా వాషింగ్టన్‌కు పేరుంది. ఒక నాయకుడు రెండు సార్లకు మించి అధ్యక్ష పదవి చేపట్టడం పై మున్ముందు చర్చించాలని ఆయన సూచించారు. ఈ సూచన చాలాకాలం తరవాత కార్యరూపం దాల్చింది.
* అమెరికా తొలి అధ్యక్ష ఎన్నిక నాటికి అమెరికన్ జనాభాలో 6 శాతం మందికి మాత్రమే ఓటు హక్కు ఉంది. చాలా రాష్ట్రాల్లో.. భూములు కలిగిన పురుషుల్లో 21 ఏళ్లు నిండిన వారు మాత్రమే ఓటు హక్కుకు యోగ్యులన్న నాటి నిబంధనలే ఇందుకు కారణం. నేడు 18 ఏళ్ల వయసుపైబడిన వారందరికీ ఓటేసే వెసులుబాటు ఉంది. వారు ఫెడరల్, రాష్ట్ర, స్థానిక ఎన్నికల్లో ఓటు వేయవచ్చు.
**మహిళలకు ఆలస్యంగా…
స్వేచ్ఛ, సమానత్వం గురించి అమెరికా ఎంత గొప్పగా చెప్పుకున్నప్పటికీ మహిళల విషయంలో ఆ దేశ రాజ్యాంగం తొలుత కొంత వివక్ష ప్రదర్శించిన మాట వాస్తవం. 1920 ఆగస్టులో 19వ సవరణ ద్వారా మహిళలకు ఓటుహక్కు లభించింది. అప్పటివరకు ఎన్నికల ప్రక్రియలో మహిళలకు ఎలాంటి పాత్ర లేదు. 26వ సవరణ ద్వారా 1971లో 18 ఏళ్లు నిండిన యువతకు ఓటుహక్కు కల్పించారు. అప్పటివరకు 21 సంవత్సరాలు నిండిన వారికి ఓటుహక్కు ఉండేది.
* అమెరికా అధ్యక్షులు ఎప్పుడు ఎన్నికైనప్పటికీ జనవరి 20నే ప్రమాణ స్వీకారం చేస్తారు. 1933 నాటి 20వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ మార్పు చోటు చేసుకుంది. అప్పటివరకు మార్చి 4న ప్రమాణ స్వీకారం చేసేవారు. శ్వేత సౌధం మెట్లపై నూతన అధ్యక్షుడి చేత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అధ్యక్షుడు ఒక చేతిలో బైబిల్ పట్టుకుని ప్రమాణ స్వీకారం చేస్తారు.
* అమెరికా రాజ్యాంగానికి రెండు శతాబ్దాలకు పైగా చరిత్ర ఉంది. 1787లో రచించారు. 1788లో ఆమోదం పొందింది. ఇప్పటికి 27సార్లు మాత్రమే సవరించడం విశేషం. 1789 మార్చి 4న రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు పార్టీల వ్యవస లేదు. రాజ్యాంగాన్ని చివరిసారి 1992 మే 7న సవరించారు.
FDR రికార్డు అధ్యక్ష కాలం
Related tags :