ప్రపంచ ప్రసిద్ధి గాంచిన మంచినీటి కొల్లేరు సరస్సు వ్యర్థ జలాల మడుగులా మారింది. వ్యవసాయ రసాయనాలు, ఫ్యాక్టరీల కాలుష్య నీటితో కొల్లేరు సరస్సు సహజత్వాన్ని కోల్పోతోంది. దీంతో నల్లజాతి చేప జాతులు అంతరించి పోతున్నాయి. పక్షులు, మూగజీవాలపైనా ప్రభావం చూపుతోంది. సమతుల్యత దెబ్బతింటోంది. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కొల్లేరు 77,138 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ జిల్లాల నుంచి 67 డ్రెయిన్లు, వాగుల ద్వారా లక్షా పది వేల క్యూసెక్కుల నీరు వరదల సమయంలో కొల్లేరుకు చేరుతోంది.
**ఏడాదిలో 17 వేల టన్నుల వ్యర్థాలు..
కొల్లేరు సరస్సులో రెండు జిల్లాల నుంచి ఏటా 17 వేల టన్నుల వ్యర్థాలు కలుస్తున్నాయని జియోగ్రాఫికల్ రీసెర్చ్ సర్వే అంచనా వేసింది. పొలాల నుంచి ఎరువులు, పురుగుమందులు సహా మిల్క్, షుగర్ ఫ్యాక్టరీలు, రైస్, పేపరు మిల్లులు.. ఇలా 36 వివిధ రకాల కర్మాగారాల నుంచి విష జలాలు కొల్లేరుకు చేరుతున్నాయి. నాలుగేళ్ల క్రితం నెదర్లాండ్‌కు చెందిన జులూలాండ్ యూనివర్సిటీ కొల్లేరు జలాలను పరీక్షించి 14 రసాయనాలను గుర్తించింది. నీటిలో 3% ఉండాల్సిన సెలినిటీ(ఉప్పుశాతం) కొల్లేరులో 12% ఉన్నట్టు వాటర్ అండ్ ఎన్విరాన్‌మెంట్ టెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ (వెట్)- భీమవరం వివరించింది.
**నల్లజాతి చేపలు కనుమరుగు..
వ్యర్థ జలాల వల్ల కొల్లేరులో కొరమేను, ఇంగిలాయి, బొమ్మిడాయి, మట్టగిడిస వంటి నల్లజాతి చేపలు అంతరిస్తున్నాయి. పొలాల నుంచి బైప్యూరాన్, నియోడాక్స్, గ్రోవిరాన్, ఎకలెక్స్, గెమాక్సిన్ వంటి రసాయనాలు చేరుతున్నాయి. ఫ్యాక్టరీల నుంచి మెరూ‍్క్యరీ, ఆర్సెనిక్, కాడ్మియం, అల్యూమినియం వంటివి మోతాదుకు మించి కొల్లేరులో ఉన్నట్టు ఆంధ్రా యూనివర్సిటీ ప్రొఫెసర్లు గుర్తించారు. ఈ నీటిని తాగిన, వీటిలో పెరిగిన చేపలను తిన్న మానవుల నాడీ వ్యవస్థ, కిడ్నీలు దెబ్బతినడంతో పాటు ప్రధానంగా క్యాన్సర్‌కు దారితీస్తోందని కైకలూరు ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మోహన్‌నాయుడు చెప్పారు.
*కొల్లేరు విస్తీర్ణం: 77,138 ఎకరాలు
**విస్తరించిన మండలాలు.. పశ్చిమగోదావరి-7, కృష్ణా- 2
*ఏటా కొల్లేరులో కలిసే వ్యర్థ జలాలు: 17 వేల టన్నులు
*రెండు జిల్లాల్లో కొల్లేరు జనాభా: 3.20 లక్షలు
*కొల్లేరుకు నీటిని చేరవేసే డ్రెయిన్లు: 67
విషసరస్సుగా మారిన కొల్లేరు
Related tags :