ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తూ రోడ్డు ప్రమాదంలో ఐదుగురు తమిళనాడు స్మగ్లర్లు మృత్యువాత పడటం వెనుక పరిణామాలు సంచలనం సృష్టిస్తున్నాయి. తమిళనాడు స్మగ్లర్లను కడప జిల్లాకు చెందిన హైజాక్ గ్యాంగు వెంటాడటంతోనే ప్రమాదం జరిగినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. రెండుకార్లు, టిప్పర్ దగ్ధమైన ఘటనలో ఐదుగురు స్మగ్లర్లు సజీవదహనమవ్వగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. కడపజిల్లా వల్లూరు మండలం గోటూరు వద్ద ఎదురుగా వస్తున్న టిప్పర్‌ను రెండు కార్లు ఢీ కొనడంతో మంటలు చెలరేగి మూడు వాహనాలూ తగులబడ్డాయి. ఈ ప్రమాదంలో స్కార్పియోలో ఉన్న నలుగురు స్మగ్లర్లూ సజీవదహనమయ్యారు. మరోముగ్గురు గాయపడగా వారిని రిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ మరొకరు చనిపోగా ఇద్దరికి చికిత్స కొనసాగుతోంది. స్కార్పియో వాహనంలో 8 మంది ఎర్రచందనం స్మగ్లర్లతోపాటు ఎర్రచందనం దుంగలు కూడా ఉన్నాయి. వీరంతా కడప జిల్లా అడవుల్లో చెట్లను కొట్టి ఎర్రచందనాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు విచారణలో తేలింది. తమిళనాడుకు చెందిన స్మగ్లర్లు ఎర్రచందనం తీసుకెళ్తున్నారన్న సమాచారంతో జిల్లాకు చెందిన హైజాక్ గ్యాంగ్ వారి వాహనాలను వెంబడించింది. ఎక్కడైనా తమిళనాడు స్మగ్లర్లు ఎర్రచందనం తీసుకెళ్తుంటే పట్టుకోవడం హైజాక్ గ్యాంగ్ పన్నాగం. ఈ క్రమంలోనే తెల్లవారుజామున 3 గంటల నుంచి 4 గంటల సమయంలో స్కార్పియో వాహనంలో స్మగ్లర్లు ఎర్రచందనం దుంగలతో వెళ్తున్నట్లు హైజాక్ గ్యాంగ్‌కు సమాచారం అందింది. వెంటనే ఎటియోస్ వాహనంలో స్మగ్లర్లను వెంబడించారు. ఇది గమనించిన తమిళనాడు స్మగ్లర్లు వేగంగా వాహనాలను నడుపుతూ ముందుకు సాగారు. అదే వేగంతో ఎదురుగా వచ్చిన టిప్పర్‌ను స్మగ్లర్ల కారుతోపాటు హైజాక్ గ్యాంగ్ కార్లు ఒకదాని తర్వాత ఒకటి ఢీ కొట్టడంతో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి వచ్చి మంటలు ఆర్పివేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కడప యాక్సిడెంట్‌లో హైజాక్ గ్యాంగ్ హస్తం
Related tags :