NRI-NRT

ఆలస్యంగా తేలనున్న అమెరికా భవితవ్యం

ఆలస్యంగా తేలనున్న అమెరికా భవితవ్యం

కరోనా వైరస్‌ విజృంభిస్తోన్నప్పటికీ అమెరికాలో ఎన్నికల ప్రక్రియ సవ్యంగానే సాగుతోంది. ఇప్పటికే దాదాపు 9కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు సమాచారం. అయితే, కరోనా కారణంగా ఈసారి ఎక్కువమంది పోస్టల్‌ ఓట్ల వైపే మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. దీంతో వీటిని లెక్కించడానికి ఎక్కువ సమయం పట్టడంతో ఈసారి ఎన్నికల తుది ఫలితాలు మరింత ఆలస్యంగానే వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమెరికాలో ముందస్తు ఓటింగ్‌ ప్రక్రియ ప్రతిసారి సాధారణమే అయినప్పటికీ ..కరోనా కారణంగా ఈసారి ఎక్కువ మంది దీన్ని ఉపయోగించుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో చాలా రాష్ట్రాల ప్రజలు ముందస్తు ఓటింగ్‌కే ప్రాధాన్యత ఇచ్చారు. ముఖ్యంగా డెమొక్రాటిక్‌ మద్దతుదారులు పోస్టల్‌ ద్వారా ముందస్తుగానే వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇప్పటికే భారీ స్థాయిలో ముందస్తు పోలింగ్‌ నమోదైంది. పోలింగ్‌ రోజే భారీస్థాయిలో ఓటును వినియోగించుకోవాలని అధ్యక్షుడు ట్రంప్‌ తన మద్దతుదారులకు సూచించారు. దీంతో రిపబ్లికన్‌లు నేరుగా పోలింగ్‌ రోజే ఓటు వేసే అవకాశం ఉంది.

ఎన్నికల్లో అటు పోస్టల్‌, బ్యాలెట్‌లలో వేసే ప్రతి ఓటునూ లెక్కించాల్సి ఉంటుంది. ఇందుకు చాలా రోజుల సమయం పడుతుంది. అయితే, ఆయా రాష్ట్రాల నుంచి వచ్చిన ట్రెండ్స్‌ను బట్టి మరుసటి రోజుకే ఫలితం అర్థమవుతుంది. కానీ, ఈసారి తుది ఫలితం ఆలస్యమయ్యే అవకాశాలే ఎక్కువని అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా వచ్చిన ఓట్ల చెల్లుబాటును అధికారులు ధృవీకరించిన తర్వాతే లెక్కింపు టేబుల్‌పైకి పంపిస్తారు. పోలింగ్‌ తేదీ ముగిసిన తర్వాత కూడా ఈ ఓట్లను అనుమతిస్తున్నారు. ఈసారి ఇవి భారీగా వస్తుండడంతో లెక్కించేందుకు ఎక్కువ సమయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా అవకతవకలు జరిగే అవకాశాలున్నాయని అధ్యక్షుడు ట్రంప్‌ వీటిని వ్యతిరేకిస్తున్నారు. ఒకవేళ ఓడిపోతే వీటిపై న్యాయపోరాటానికి కూడా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే ఎన్నికల తుది ఫలితం మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఒక్కోసారి ఫలితాల వ్యవహారం కోర్టు కేసును ఎదుర్కోవడం కూడా ఆలస్యానికి కారణమవుతుంది. 2000 సంవత్సరంలో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఫలితం రావడానికి నెల సమయం పట్టింది. చివరకు సుప్రీం కోర్టు తీర్పుతో విజేతను ప్రకటించారు.

ఒకవేళ ఎన్నికల్లో ఓడిపోతే ఫలితాలను సవాలు చేసేందుకు ట్రంప్‌తో పాటు అతని మద్దతుదారులు సన్నద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఎన్నికల రోజు రాత్రి తరువాత ఓట్లను లెక్కించకూడదని ట్రంప్‌ కొత్త వాదనను తీసుకొచ్చారు. నవంబర్‌ 3నే ఎన్నికలు పూర్తికావాలని..ఈ ప్రక్రియ కొన్నివారాలపాటు కొనసాగకూడదని ఈ మధ్యే ట్రంప్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. ముఖ్యంగా కొన్ని రాష్ట్రాలు మినహా చాల రాష్ట్రాల్లో నవంబర్‌ 3 తర్వాత ఓట్ల లెక్కింపునకు చాలా సమయం తీసుకుంటున్నాయని..వాటిని కోర్టులు కూడా అనుమతించవని అభిప్రాయపడ్డారు. అందుకే ఓట్ల తేదీ(నవంబర్‌ 3) ఆర్థరాత్రి నాటికే ఈ ప్రక్రియ మొత్తం పూర్తయ్యేలా కోర్టులు రాష్ట్రాలపై ఒత్తిడితేవాలని సూచిస్తున్నారు. దీన్ని విశ్లేషకులు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. అదే రోజు లెక్కింపు పూర్తిచేయడం అసాధ్యమని వెల్లడిస్తున్నారు. అయితే, అమెరికా ఎన్నికల్లో ఒట్ల లెక్కింపు సుదీర్ఘ ప్రక్రియే అయినప్పటికీ అధ్యక్ష గెలుపుపై మాత్రం వీటి ప్రభావం తక్కువగానే ఉంటుందని విశ్లేషకులు స్పష్టంచేస్తున్నారు. ముఖ్యంగా విజేతను నిర్ణయించడం రాష్ట్రాల ఎలక్టోరల్‌ ఓట్లపైనే ఆధారపడి ఉంటుంది. ఎక్కువ ఎలక్టోరల్‌ ఓట్లు ఎవరు సాధిస్తే వారే విజేతలవుతారు. మొత్తం 538 ఎలక్టోరల్‌ సభ్యులున్న అమెరికాలో, అధ్యక్షుడిగా విజేత కావడానికి 270 ఎలక్టోరల్‌ ఓట్లు కావాల్సి ఉంటుంది.