Health

UAE ప్రధానికి కరోనా టీకా-TNI బులెటిన్

UAE ప్రధానికి కరోనా టీకా-TNI బులెటిన్

* యూఏఈ ప్రధాని షేక్‌ మహమ్మద్‌ బిన్‌ రషిద్‌ అల్‌ మాక్తొమ్‌ మంగళవారం కరోనా టీకా వేయించుకున్నారు. వాక్సిన్‌ వేయించుకుంటున్న ఫొటోను ట్విటర్‌ ద్వారా పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ‘ఈరోజు కొవిడ్‌ టీకా వేయించుకున్నాను. ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా, సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నా. యూఏఈలో వాక్సిన్‌ అందుబాటులోకి వచ్చేందుకు రాత్రింబవళ్లు శ్రమించిన వైద్య బృందం పట్ల గర్వంగా ఉంది. ఇకపై యూఏఈలో మంచిరోజులు రాబోతున్నాయి’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు.

* ప్రపంచదేశాలపై కరోనా మరోమారు మృత్యుపంజా విసురుతోంది. అగ్రరాజ్యంలో రెండు వారాలుగా రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. కొవిడ్‌ ఉరవడి తగ్గిపోయిందన్న ధీమాతో విహార యాత్రలు ముమ్మరించగానే.. కరోనా మళ్ళీ కోర సాచింది. రెండున్నర లక్షల కేసులు రావడంతో బిత్తరపోయిన ఐరోపాలోని దేశాలన్నీ లాక్‌డౌన్లు, పలురకాల ఆంక్షలతో హడావుడి చేస్తున్నాయి. అప్రమత్తతే రక్షాకవచం అన్న విషయం మరిచి ఉపేక్షించడమే అనర్థదాయకమైంది.మాటు వేసిన పులిలాంటి కరోనా మహమ్మారి ఉపశమించినట్లే కనిపించి, మరోమారు మృత్యుఘాతాలతో విరుచుకుపడుతుండటంతో అమెరికా ఐరోపాలు వణికిపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే నాలుగు కోట్ల 70 లక్షల కేసులు, 12 లక్షలు దాటిన మరణాలతో ‘శతాబ్దపు మహమ్మారి’గా ముద్రవేసిన కొవిడ్‌- శీతకాలంలో మరింతగా చెలరేగి పోతోంది. 95 లక్షలకు చేరువైన కేసులు, రెండు లక్షల 36 వేల పైచిలుకు మరణాలతో అగ్రరాజ్య హోదా నిలబెట్టుకొన్న అమెరికాలో- రెండు వారాలుగా పాతిక రాష్ట్రాలు కరోనా కేసుల పరంగా కొత్త రికార్డులు నెలకొల్పుతున్నాయి. నిర్ధారణ పరీక్షల్లో పెరుగుదల తొమ్మిదిశాతం ఉంటే, కేసుల పెరుగుదల 24 శాతంగా నమోదు కావడం- అమెరికాలో కరోనా విజృంభణ తీవ్రతకు తార్కాణం.

* ఐరోపా, అమెరికా దేశాల్లో ఒకవైపు కరోనా మహమ్మారి తన ప్రతాపం చూపిస్తుంటే..భారత్‌లో కొత్త కేసుల నమోదు తగ్గుముఖం పట్టడం ఊరట కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో 38,310 కొత్త కేసులు నమోదయ్యాయి. గత వారం రోజుల్లో నమోదైన కేసుల్లో ఇదే అత్యల్పం కావడం గమనార్హం. దేశంలో సోమవారం నాటికి మొత్తం క్రియాశీల కేసుల సంఖ్య 5,41,405 కాగా..ఈ రేటు 6.55 శాతానికి తగ్గింది. ఇప్పటివరకు వైరస్‌ బారినపడి కోలుకున్న వారి శాతం 91.96గా ఉంది.

* ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు కరోనా మహమ్మారి నుంచి పూర్తిగా కోలుకున్న వారి సంఖ్య 8 లక్షలు దాటింది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 84,534 కరోనా పరీక్షల నిర్వహించగా.. 2,849 కొత్త కేసులు నమోదయ్యాయి. 15 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,30,731కి చేరింది. తాజా మరణాలతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 6,734 మంది కొవిడ్‌తో మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో 3,700 మంది బాధితులు పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 21,672 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 82,66,800 కరోనా సాంపుల్స్‌ని పరీక్షించినట్లు వైద్యారోగ్య శాఖ బులెటిన్‌లో వెల్లడించింది.