నిత్య పూజలు అందుకుంటున్న అరసవల్లి సూర్యనారాయణస్వామి వార్షిక నికర ఆదాయం పెరిగింది. 2020-21 సంవత్సరానికి గాను రూ.6,47,17,707 సమకూరింది. గతేడాది కంటే ఈసారి రూ.51.05 లక్షలు అధికంగా వచ్చింది. ఒకప్పుడు పండగలు, ముఖ్యమైన రోజుల్లోనే స్వామి దర్శనానికి భక్తులు వచ్చేవారు. ఇప్పుడు నిత్యం బారులు తీరుతున్నారు. దేశ, విదేశాల నుంచి కూడా భక్తులు అధికంగా తరలివస్తున్నారు. దీంతో హుండీ ఆదాయం కూడా ఏటా పెరుగుతూ వస్తోంది. మరో పక్క రూ.100 ప్రత్యేక క్యూలైన్లు, విరాళాలు, కల్యాణాలు, క్షీరాభిషేకాలు, ప్రత్యేక పూజలతో ఆదిత్యునికి అధిక ఆదాయం లభిస్తోంది.
* పెరిగినా మార్పు లేదు..
అరసవల్లి సూర్యనారాయణస్వామి ఆలయం ప్రస్తుతం సహాయక కమిషనరు స్థాయి అధికారి హోదాలో నడుస్తోంది. సాధారణంగా రూ.3 కోట్లపైగా ఆదాయం సమకూరితే డిప్యూటీ కమిషనర్ హోదా స్థాయి అధికారి ఈవోగా విధులు నిర్వర్తించాల్సి ఉంది. రాష్ట్రంలో ప్రముఖ దేవాలయాల సరసన అరసవల్లి దేవస్థానం ఉంది. వాటితో పోల్చుకుంటే ఇక్కడ దేవాలయం అభివృధ్ధిలో వెనుకంజలోనే ఉంది. భక్తులు చెప్పులు విడిచిపెట్టే స్టాండ్ కూడా కనీసం లేని దుస్థితి. సత్రాలు కూడా శిథిలావస్థలో ఉన్నాయి. భక్తులు వాహనాలు నిలిపేందుకు, చరవాణులు, బ్యాగులు ఉంచేందుకు సదుపాయం లేదు. ఆలయానికి అతి ముఖ్యమైన భద్రతా పరికరాలైన మెటల్ డిటెక్టర్లు పనిచేయడం లేదు. ప్రధాన ద్వారం వద్ద ప్రైవేట్ భద్రతా సిబ్బంది ముగ్గురు ఉండాల్సి ఉన్నా ఒకరే ఉంటున్నారు.
***గత ఐదేళ్లలో వచ్చిన ఆదాయం ఇలా..(రూ.కోట్లలో)
*2016-17: 4,38,32,256
*17-18: 5,48,41,853
*18-19: 6,03,28,870
*19-20: 5,96,12,010
*20-21: 6,47,17,707