అమెరికా అగ్రరాజ్యం అధ్యక్షపీఠాన్ని అధిరోహించడానికి డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ 6 ఎలక్టోరల్ ఓట్ల దూరంలో నిలిచారు. కాలిఫోర్నియా వంటి అతిపెద్ద రాష్ట్రంతోపాటు 72 ఏళ్లకు పైగా డెమొక్రాట్‌లకు అవకాశం ఇవ్వని ఆరిజోనాతో కూడా బైడెన్ జై కొట్టించుకున్నారు. అమెరికా అధ్యక్ష స్థానానికి 270 ఎలక్టోరల్ ఓట్లు అవసరం కాగా, 264 ఓట్లు సాధించిన బైడెన్‌తోపాటు ఆయన ఆధిక్యంలో ఉన్న నెవేడా ఫలితాలపై ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. కీలక స్వింగ్ స్టేట్స్‌లో ఆధిక్యం కనబరిచిన ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ చివరిలో నిర్ణయాత్మక రాష్ట్రాల్లో ఓటమి చవిచూసి రెండోసారి అధ్యక్ష పీఠాన్ని అధిష్ఠించే అవకాశానికి దాదాపు దూరమయ్యారు. మిషిగన్, పెన్సిల్వేనియా రాష్ట్రాల కౌంటింగ్ ప్రక్రియపై అనుమానం వ్యక్తం చేసిన ట్రంప్ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే.
మరోవైపు అమెరికా అధ్యక్ష పీఠాన్ని ఎవరు అధిరోహించబోతున్నారన్నది దాదాపుగా తేలిపోయింది.అగ్రరాజ్యం రాజకీయాల్లో కురువృద్ధుడైన డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ అధ్యక్ష హోదాలో శ్వేతసౌధంలో అడుగు పెట్టడానికి కేవలం ఆరు ఎలక్టోరల్ ఓట్ల దూరంలో ఉన్నారు. ఇప్పటి వరకు 45 రాష్ట్రాల్లో ఫలితాలు వెలువడగా.. బైడెన్ 264 ఎలక్టోరల్ ఓట్లు సాధించారు. మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లకు 270 ఎలక్టోరల్ ఓట్లు గెలిచిన అభ్యర్థి అధ్యక్షపీఠంపై కూర్చోనుండగా.. బైడెన్ ఆధిక్యంలో ఉన్న నెవేడాలో ఆరు ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి.అటు ప్రస్తుత అధ్యక్షుడు రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ 214 ఎలక్టోరల్ ఓట్లతో రెండో సారి అధ్యక్ష పీఠం అధిష్ఠించే అవకాశానికి దాదాపు దూరమయ్యారు.
జార్జియా, పెన్సిల్వేనియా, నార్త్‌కరోలైనా. అలస్కా, నెవేడా రాష్ట్రాల ఫలితాలు వెల్లడి కావాల్సి ఉండగా..ఇవన్నీ ట్రంప్ సొంతం చేసుకోగలిగితేనే ఆయనకు మళ్లీ అవకాశం ఉంటుంది.అయితే ఇందులో నెవేడాలో మొదట్నుంచీ బైడెన్ ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పటి వరకు గడిచిన 72 ఏళ్లలో 11 ఎలక్టోరల్ ఓట్లు ఉన్న ఆరిజోనా ఓటర్లు రిపబ్లికన్ల వైపే మొగ్గు చూపేవారు.. కానీ తొలిసారిగా బైడెన్‌కు జైకొట్టారు. 16 స్థానాలున్న మిషిగన్, 10 స్థానాలున్న విస్కాన్స్‌ను కూడా బైడెన్‌నే వరించాయి. మెయిన్‌లో 4 స్థానాలకు గానూ 1 ట్రంప్‌నకు, మిగతా 3 బైడెన్ ఖాతాలో చేరాయి. మిషిగన్‌లో తొలుత ట్రంప్ ఆధిక్యం ప్రదర్శించినప్పటికీ చివరికి దానిని బైడెన్ సొంతం చేసుకున్నారు.