WorldWonders

లక్షల కిలోలు చికెన్ తినేస్తున్న చిత్తూరోళ్లు

లక్షల కిలోలు చికెన్ తినేస్తున్న చిత్తూరోళ్లు

వారం.. వర్జ్యంతో పనిలేదు.. పగలు.. రాత్రి అన్న తేడా లేదు.. ఎప్పుడైనా.. ఎక్కడైనా… ముక్కలేనిదే ముద్ద దిగడం లేదు. నీసు లేకుంటే.. చిత్తూరు జిల్లా వాసులకు పూటగడవం లేదు.. అతిశయోక్తిగా అనిపిస్తున్నా.. ఇదే నిజం. ఎందుకంటే చిత్తూరు జిల్లాలో మాంసం వినియోగం అంతకంతకూ పెరుగుతోంది. స్థోమతను బట్టి ఎవరికి వారు చికెన్, మటన్‌..చేపలు.. రొయ్యలు అంటూ.. లాగించేస్తున్నారు. జిల్లాలో గతంలో (కరోనా లాక్‌డౌన్‌కు ముందు) వారంలో సగటున 2 లక్షల నుంచి 3 లక్షల కేజీల వరకు ఉన్న మాసం వినియోగం ప్రస్తుతం.. సగటున 4 లక్షల నుంచి 5 లక్షల కేజీలకు చేరడమే ఇందుకు నిదర్శనం.
**చిత్తూరు జిల్లాలో మాంసం వినియోగం భారీగా పెరిగింది. మేక, గొర్రె, కోడి, కముజు పిట్టల అమ్మకాలు రోజురోజుకూ ఎక్కువౌతున్నాయి. ప్రధాన మేకల సంత అయిన తిరుపతికి ప్రతి శనివారం వేల సంఖ్యలో వచ్చే మేకలు, గొర్రెలు హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఇక ఆదివారం మేకల, గొర్రెల మాంసం వినియోగం సుమారు 50 వేల కిలోల వరకు ఉన్నట్టు అంచనా. ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో బోన్‌ మటన్‌ ధర కిలో రూ 660, బోన్‌లెస్‌ రూ. 750 నుంచి 800 వరకు ఉంది. వ్యాపారులు వీటిని ఎక్కువగా తిరుపతి న్యూ బాలాజీ కాలనీ సమీపంలోని మేకల సంతలో కొనుగోలు చేస్తారు. ఇవికాకుండా మొక్కుబడుల కోసం కొనుగోలు చేసే జీవాలు 500 నుంచి 800 వరకు ఉంటాయని తెలుస్తోంది. మాంసం ధరలు పెరిగినా కొనేందుకు మాత్రం వినియోగదారులు వెనుకడుగు వేయడం లేదు.
**చికెన్‌కే ప్రాధాన్యం..
చికెన్‌ కంపెనీల గుత్తాధిపత్యంతో కోడి మాంసం ధర విపరీతంగా పెరిగింది. అదే విధంగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ను తట్టుకునే వ్యాధి నిరోధక శక్తి చికెన్‌ ద్వారా లభిస్తుందనే ప్రచారం జరుగుతుండడంతో మాసం ప్రియలు రెచ్చిపోతున్నారు. అయిన దానికి.. కానిదానికి.. చికెన్‌కే ప్రాధాన్యం ఇస్తున్నారు. చిత్తూరు జిల్లాలో కోళ్ల ఫారాలు సుమారు వెయ్యికి పైగా ఉన్నాయి. వీటిలో సుమారు 1.80 లక్షల బ్రాయిలర్‌ కోళ్లు పెరుగుతున్నాయి. మిగిలిన చోట్ల లేయర్‌ కోళ్లు పెంచుతున్నారు. జిల్లాలో లైవ్, స్కిన్, స్కిన్‌లెస్‌ పేరిట కోడి మాంసం వినియోగం జరుగుతోంది. చిత్తూరు జిల్లాలో రోజుకు లక్షల కిలోల కోడి మాంసం విక్రయాలు సాగుతున్నాయి. ఇక నాటుకోడి మాంసం కిలో రూ. 500 వరకు పలుకుతుండగా.. గ్రామాల్లో కిల్లో రూ. 350 వరకు ఉంటోంది. దీంతోపాటు కముజు పిట్టల మాంసం వినియోగం కూడా పెరిగింది. పిట్ట ఒకటి రూ. 40 వరకు ధర పలుకుతోంది. ఇక కిలో ధర రూ. 400 చొప్పున పిట్టమాసం వినియోగం రోజుకు 1000 కిలోల వరకు ఉంటోంది. ఇక జిల్లా వాసులు మాసం వినియోగం కోసం రోజూ సగటున కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు.