అమెరికా ఓట్ల లెక్కింపు ఇంకా పూర్తి కాకముందే ఈ ఎన్నికల్లో తామే గెలిచినట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించుకున్నారు. అంతేకాకుండా ఎన్నికలపై సుప్రీంకోర్టుకు వెళ్తానని తెలిపారు. ఫలితాలు కీలకంగా మారుతున్న నేపథ్యంలో అధ్యక్షుడు ట్రంప్ ప్రజలనుద్దేశించి మాట్లాడారు. కొన్ని ప్రాంతాల్లో ఇంకా పోలింగ్‌ను అనుమతిస్తున్నారని దీన్ని వెంటనే ఆపాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్‌లను అనుమతించడం వెంటనే ఆపివేయాలని పేర్కొన్నారు. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్తానని స్పష్టంచేశారు. ‘నిజంగా ఈ ఎన్నికల్లో మనమే గెలుపొందాం. ప్రస్తుతం కొనసాగుతోన్న కౌంటింగ్ అమెరికన్ ప్రజలను మోసం చేయడమే’ అని ట్రంప్ తన మద్దతుదారులతో అన్నారు. ఎన్నికల సమయం పూర్తైన తర్వాత వచ్చిన పోస్టల్ బ్యాలెట్లను అమెరికాలోని కొన్ని రాష్ట్రాలు అనుమతిస్తున్నాయి. పోలింగ్ ముగిసిన తర్వాత ఇలా వచ్చిన పోస్టల్ ఓట్లను అనుమతించవద్దని డొనాల్డ్ ట్రంప్ మొదటినుంచి వ్యతిరేకిస్తున్నారు. నవంబర్ 3వతేదీ అర్థరాత్రి నాటికి వీటి ప్రక్రియ పూర్తిచేయాలని ఎన్నికల ప్రచారంలోనూ ట్రంప్ అభిప్రాయపడ్డారు. కరోనా నేపథ్యంలో ఈసారి భారీ స్థాయిలో పోస్టల్ బ్యాలెట్లను అనుమతించారు. దీంతో ఇప్పటికే వీటిలో చాలావరకు తిరిగి చేరుకోగా మరికొన్ని ప్రాంతాల్లో ఇంకా అనుమతిస్తున్నారు. దీంతో వీటి లెక్కింపుకు చాలా సమయం పట్టే ఆస్కారం ఉంది. ఈ నేపథ్యంలోనే ఆలస్యంగా వచ్చిన పోస్టల్ ఓట్లను అనుమతించవద్దని ట్రంప్ వ్యతిరేకిస్తున్నారు. దీనిపై సుప్రీంకోర్టుకు వెళుతానని ప్రకటించారు.
అమెరికాలో ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్న సమయంలో… రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.. ‘ఈ రోజు రాత్రి నేను కీలక ప్రకటన చేస్తా.. భారీ విజయం మనకే..’ అని ట్వీట్ చేశారు. అంతకుముందే ట్రంప్ మరో ట్వీట్ చేశారు.. ‘భారీ విజయం దిశగా మనం దూసుకెళ్తున్నాం.. కానీ ప్రత్యర్థి పార్టీ విజయాన్ని అపహరించుకుపోవాలని చూస్తోంది.. దీన్ని మనం అడ్డుకుని తీరతాం.. పోలింగ్ ముగిశాక ఓటింగ్ ఎట్టిపరిస్థితుల్లోనూ జరగనివ్వకూడదు..’ అని ట్రంప్ ట్వీట్ చేశారు. కానీ ట్విటర్ ఆ ట్వీట్‌ను జనబాహుళ్యంలోకి వెళ్లకుండా చేసింది.. తప్పుడు ప్రకటనగా అభివర్ణించింది.. అంతేకాకుండా అమెరికా ఎన్నికల సెక్యూరిటీ గురించి ఓ లింక్‌ను కూడా ఆ ట్వీట్‌కు జోడించింది. ఇదిలా ఉండగా జో బైడెన్ కూడా ట్రంప్ ట్వీట్ చేసిన సమయంలోనే ట్విటర్ వేదికగా స్పందించారు. ‘మనమే గెలుస్తాం.. నమ్మకం ఉంచండి.. ఈ ఎన్నికల విజేత ఎవరో నిర్ణయించేది నేనో..? ట్రంపో కాదు..? ఓటర్లు.. ఇప్పటి వరకు గెలిచిన సీట్ల పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాం.. మరిన్ని సీట్లు గెలిచి ఎన్నికల విజేత మనమే అవుతామని నాకు నమ్మకం ఉంది..’ అని జో బైడెన్ ట్వీట్ చేశారు. కాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు క్షణ క్షణం ఉత్కంఠను రేపుతున్నాయి.. మొదట్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి ముందంజలో కనిపించారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్‌కు, ఆయనకు మధ్య దాదాపు 100కు పైగా ఎలక్టోరల్ ఓట్ల తేడా కనిపించింది.. కానీ సమయం గడిచేకొద్దీ.. ఆ తేడా కూడా కనుమరుగైపోయింది.. ప్రస్తుతం జో బైడెన్‌కు 224 ఎలక్టోరల్ ఓట్లతో ముందంజలో ఉండగా.. ట్రంప్ కూడా అంతే ధీటైన స్థాయిలో 213 ఎలక్టోరల్ ఓట్లతో దూసుకొస్తున్నారు. కీలకమైన స్వింగ్ స్టేట్స్‌లో ట్రంప్ తన సత్తాను చాటుతున్నారు. ఫలితాలు రావాల్సిన రాష్ట్రాల్లో ఇద్దరి మధ్య స్వల్ప తేడా మాత్రమే ఉండటంతో.. ఎవరు అధ్యక్షుడిగా గెలుస్తారన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది.. మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లలో ఎవరికి 270 స్థానాలు లభిస్తాయో.. వారే అగ్రరాజ్య పాలకుడు అవుతారు.
అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు తీవ్ర ఉత్కంఠకు తెరతీశాయి. కీలకమైన 12 స్వింగ్‌స్టేట్స్‌లో ఫలితాలు మలుపులు తిరుగుతున్నాయి. ఉదయం కౌంటింగ్ మొదట్లో బైడెన్ ఆధిపత్యం కనిపించినా.. ఆ తర్వాత ట్రంప్ వైపు మొగ్గు చూపాయి. కేవలం అరిజోనా, న్యూహాంప్‌షైర్, నెవడాలు మొదటి నుంచి బైడెన్‌కు పట్టంకట్టాయి. కానీ, విస్కాన్సిన్ ఫలితాలు మాత్రం ట్రంప్.. బైడెన్ ఇద్దరినీ ఒత్తిడికి గురి చేస్తున్నాయి. మొత్తం 10 ఎలక్టోరల్ ఓట్లున్న ఈ రాష్ట్రంలో ప్రస్తుతం బైడెన్ 0.3శాతం ఓట్ల ఆధిక్యంలోకి వచ్చారు. కౌంటింగ్ మధ్యలో ట్రంప్ దాదాపు 4శాతానికి పైగా ఆధిక్యంలో దూసుకుపోయినా.. ఆ తర్వాత దానిని నిలబెట్టుకోలేకపోయారు. దాదాపు 95శాతం ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సమయానికి ఇక్కడ బైడెన్‌కు 49.4శాతం పోల్‌కాగా.. ట్రంప్‌నకు 49.1శాతం ఓట్లు పోలయ్యాయి. మరో ఐదుశాతం ఓట్లు లెక్కించాల్సి ఉంది. అవి ఇక్కడి 10 ఎలక్టోరల్ ఓట్లు ఎవరికి దక్కనున్నాయో తేల్చనున్నాయి.
ప్రస్తుతం ఉన్న ఫలితాల ప్రకారం చూస్తే ఎవరు గెలిచినా స్వల్ప మెజార్టీతో మాత్రమే గట్టెక్కే అవకాశం ఉంది. అప్పుడు ఫెయిత్‌లెస్ ఎలక్టోరల్ ఓట్లు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో రిపబ్లికన్లకు 306 ఎలక్టోరల్ ఓట్లు వస్తే వారిలో ఇద్దరు ట్రంప్‌కు ఓటు వేసేందుకు నిరాకరించారు. అలానే 227 ఓట్లు హిల్లరీకి రాగా.. వారిలో ఐదుగురు ఆమెకు ఓటు వేసేందుకు నిరాకరించారు.