అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అత్యంత కీలకమైన ఘట్టం ముగిసింది.. అమెరికన్ ఓటర్లందరూ భారీ సంఖ్యలో పోలింగ్‌లో పాల్గొన్నారు. గతంలో కంటే ఈసారి ఎక్కువ శాతం పోలింగ్ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. పెరిగిన పోలింగ్ తమకు అనుకూలమంటే.. తమకు అనుకూలమని డెమోక్రాట్స్, రిపబ్లికన్లు చెప్పుకుంటున్నారు. ఇప్పటికే ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమయింది. ముందు నుంచి అనుకుంటున్నట్టుగానే ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ మధ్య హోరాహోరీగా పోరు నడుస్తోంది.. క్షణక్షణానికి ఆధిక్యం మారిపోతోంది. ఉదయం 8గంటల సమయానికే (భారతీయ కాలమానం ప్రకారం) జో బైడెన్ 131 ఎలక్ట్రోరల్ ఓట్లను గెలుపొంది ముందంజలో ఉన్నారు. ట్రంప్‌కు 92 ఎలక్ట్రోరల్ ఓట్లు వచ్చాయి. అదే సమయంలో ఇప్పటివరకు లెక్కించిన ఓట్లలో ట్రంప్‌కు 50.2శాతం ఓట్లు రాగా.. జో బైడెన్‌కు 48.2శాతం ఓట్లు పోలయ్యాయి.
ఇక ఈ ఎన్నికల్లో గెలుపును తారుమారు చేసే రాష్ట్రాలుగా చెప్పుకుంటున్న స్వింగ్ స్టేట్స్లో కూడా ఆశ్చర్యకర ఫలితాలు వస్తున్నాయి. అరిజోనా, ఫ్లోరిడా, జార్జియా, మిచిగాన్, మిన్నెసోటా, నార్త్ కరోలినా, పెన్సిల్వేనియా, టెక్సాస్, ఓహియో, విస్కిన్సన్ రాష్ట్రాలు ఈ ఎన్నికల్లో విజేత ఎవరో నిర్ణయించబోతున్నాయి. ఈ రాష్ట్రాల్లో ఎవరిది పై చేయి అయితే వారే అమెరికా అధ్యక్షుడు కాబోతున్నారు. ఇప్పటివరకు వచ్చిన సమాచారం మేరకు ఆయా రాష్ట్రాల్లో ఫలితాలు ఇలా ఉన్నాయి.
అరిజోనా రాష్ట్రంలో 55.9శాతం ఓట్లతో జో బైడెన్ ముందంజలో ఉన్నారు. 42.9శాతం ఓట్లు ట్రంప్‌కు వచ్చాయి. ఇంకా 40శాతం ఓట్లను లెక్కించాల్సి ఉంది.
ఇక ఫ్లోరిడా రాష్ట్రంలో ట్రంప్‌కు పూర్తి అనుకూలమైన వాతావరణం కనిపిస్తోంది. 51.3శాతం ఓట్లతో ట్రంప్ ఆధిక్యంలో ఉండగా.. 47.8శాతం ఓట్లతో బైడెన్ వెనుకంజలో ఉన్నారు.
జార్జియాలో కూడా ఇదే సీన్ కనిపిస్తోంది.. ట్రంప్ 55.7శాతం ఓట్లతో ముందంజలో ఉన్నారు. 43.1శాతం ఓట్లతో బైడెన్ రెండో స్థానంలో ఉన్నారు.
మిచిగాన్ రాష్ట్రంలో కూడా ట్రంప్ ఆధిక్యం కనపరుస్తున్నారు.. ట్రంప్‌కు 55.7శాతం ఓట్లు రాగా బైడెన్‌కు 42.3శాతం ఓట్లు పోలయ్యాయి.
మిన్నెసోటా రాష్ట్రంలో బైడెన్ పూర్తి ఆధిక్యంలో ఉన్నారు. జో బైడెన్‌కు 64.2శాతం ఓట్లు రాగా ట్రంప్‌కు 33.8శాతం ఓట్లు వచ్చాయి.
నార్త్ కరోలినా రాష్ట్రంలో ట్రంప్ స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు. ఇక్కడ ఇద్దరు అభ్యర్థుల మధ్య గట్టి పోటీ జరుగుతోంది.. ట్రంప్ 49.6శాతం ఓట్లతో ముందంజలో ఉండగా.. జో బైడెన్‌కు 49.2శాతం ఓట్లు పోలయ్యాయి.
ఇక పెన్సిల్వేనియా రాష్ట్రంలో ప్రస్తుతానికి ట్రంప్ ఆధిక్యంలో ఉన్నారు. 53.1శాతం ఓట్లతో ట్రంప్ ముందంజలో ఉండగా.. 45.6శాతం ఓట్లతో బైడెన్ రెండో స్థానంలో ఉన్నారు.
టెక్సాస్ రాష్ట్రంలో కూడా ట్రంప్ ముందంజలో ఉన్నారు. 50.8శాతం ఓట్లతో ట్రంప్ ఆధిక్యంలో ఉండగా.. బైడెన్‌కు 47.8శాతం ఓట్లు పోలయ్యాయి.
ఓహియో రాష్ట్రంలో ట్రంప్ ముందంజలో ఉన్నారు. 51.2శాతం ఓట్లు రాగా.. బైడెన్‌కు 47.4శాతం ఓట్లు పోలయ్యాయి.
విస్కిన్సన్ రాష్ట్రంలో కూడా ట్రంప్ ఆధిక్యంలో ఉన్నారు.. ట్రంప్‌కు 51.5శాతం ఓట్లు రాగా… బైడెన్‌కు 47శాతం ఓట్లు పోలయ్యాయి.
ఓట్ల లెక్కింపు ముగిసేటప్పటికి ఈ రాష్ట్రాల్లో పరిస్థితులు తారుమారు అవొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మెయిల్ ఇన్ బ్యాలెట్ ఓట్లు ఎక్కువగా బైడెన్‌కు అనుకూలంగా పడ్డాయని అభిప్రాయపడుతున్నారు. ఈ ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి ఫలితాల్లో మార్పులు జరగొచ్చని చెబుతున్నారు.
స్వింగ్ రాష్ట్రాలను ఊపేసిన ట్రంప్
Related tags :