* దేశీయ మార్కెట్లు మళ్లీ పండగ చేసుకున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపు దిశగా బైడెన్ దూసుకెళుతుండడం, అంతర్జాతీయ మార్కెట్లు రాణించడం, దేశంలో తయారీ రంగం పుంజుకోవడం వంటి కారణాలతో మదుపరులు కొనుగోళ్లకు మొగ్గు చూపారు. దీనికి తోడు ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి ఐటీ షేర్లకు తోడు, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్నాలజీ వంటి ప్రధాన షేర్లు రాణించడంతో సూచీలు వరుసగా నాలుగో రోజూ లాభాల్లో ముగిశాయి. దీంతో నిఫ్టీ 12,100 మార్కును దాటింది.
* విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) విధానం, విదేశీ మారక నిర్వహణ చట్టం (ఫెమా) నిబంధనలను ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఉల్లంఘిస్తోందని ట్రేడర్ల సమాఖ్య కాయిట్ ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను అమెజాన్ ఖండించింది. భారత్‌లో మల్టీ బ్రాండ్ రిటైల్ కార్యకలాపాలు నిర్వహించేందుకు అమెజాన్ ప్రభుత్వ అనుమతి తీసుకోలేదని వాణిజ్య మంత్రి పీయూశ్ గోయల్‌కు రాసిన లేఖలో కాయిట్ పేర్కొంది. దీనిపై చర్యలు తీసుకోవాలని, గరిష్ఠ జరిమానా విధించాలని డిమాండ్ చేసింది. ‘వెబ్‌సైట్‌లో లభిస్తున్న సమాచారం ప్రకారం అమెజాన్ ఇండియాలో అమెజాన్ దాదాపు రూ.35000 కోట్ల పెట్టుబడులు పెట్టింది. వాస్తవానికి పరోక్షంగా మల్టీ బ్రాండ్ రిటైల్ వ్యాపారాన్ని నిర్వహిస్తోంది’ అని కాయిట్ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్‌వాల్ తెలిపారు. భారత్‌లో బాధ్యత కలిగిన పెట్టుబడిదారుగా ఎఫ్‌డీఐ నిబంధనలను అమెజాన్ పాటిస్తుందని, భవిష్యత్ పెట్టుబడులను నిబంధనలకు అనుగుణంగానే పెడతామని అమెజాన్ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు.
* కరోనా వైరస్ నిర్మూలనకు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్)తో కలిసి భారత్ బయోటెక్ కంపెనీ రూపొందిస్తున్న కొవాగ్జిన్ టీకా అనుకున్న సమయానికంటే ముందుగానే అందుబాటులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. వచ్చే ఏడాది మార్చి తర్వాతే ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని తొలుత ఐసీఎంఆర్ అంచనా వేసినప్పటికీ అంతకంటే ముందగా ఫిబ్రవరిలోనే విడుదలయ్యే అవకాశం ఉందని ఐసీఎంఆర్ సీనియర్ శాస్త్రవేత్త రజనీకాంత్ అన్నారు. ఇప్పటికే రెండు దశల ప్రయోగాలు పూర్తి చేసుకున్న ఈ వ్యాక్సిన్.. మూడ దశ ప్రయోగాలు ఈ నెలలో ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కొవిడ్-19 టాస్క్‌ఫోర్స్‌లోనూ సభ్యుడైన ఆయన ఓ వార్తా సంస్థతో ఈ విధంగా అన్నారు.
* దేశ ఆర్థిక వ్యవస్థ ఊహించిన దాని కంటే వేగంగా పుంజుకుంటోందని కేంద్రమంత్రి ప్రకాశ్ జావడేకర్ అన్నారు. జీఎస్టీ వసూళ్లు, విద్యుత్ వినియోగం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తదితరాలు పెరగడాన్ని ఉదాహరణగా చూపుతూ ఆయన ఈ విధంగా అన్నారు. కేబినెట్ భేటీ అనంతరం బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
* దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా భావించే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల (ఎంఎస్‌ఎమ్‌ఈలు) వ్యాపార కార్యకలాపాలు వేగంగా పుంజుకుంటున్నాయని, కొవిడ్ ముందటి స్థితికి చేరువవుతున్నాయని అంకుర సంస్థ ఓకే క్రెడిట్ తెలిపింది. సామర్థ్యం పెంపునకు, వృద్ధికి డిజిటల్ వ్యాపార మార్గాలను అందిపుచ్చుకోవడంలోనూ ఈ సంస్థలు దూకడు కనబరుస్తున్నాయని తెలిపింది. సంస్థ నివేదిక ప్రకారం.. 16 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో వ్యాపార కార్యకలాపాలు కొవిడ్-19 ముందున్న స్థాయికి మించి పుంజుకున్నాయి. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, దిల్లీలలో మాత్రం కొవిడ్ ముందు స్థాయిలో 90-95% మేర వ్యాపార కార్యకలాపాలు జరుగుతున్నాయి.. బిహార్, అస్సోం, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్‌లలో కొవిడ్-19 ముందు కంటే 10 శాతానికి మించి వ్యాపార కార్యకలాపాలు జరుగుతున్నాయని నివేదిక తెలిపింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, ఒడిశా, జార్ఖండ్, ఉత్తరాఖండ్, పంజాబ్‌లలోనూ ఇదే తరహా పరిస్థితి నెలకొంది. మహా నగరాలతో పోలిస్తే ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో వ్యాపార కార్యకలాపాలు వేగంగా పుంజకుంటున్నాయని నివేదిక పేర్కొంది. 2020 సెప్టెంబరులో ఔషధ, కిరాణా దుకాణాల వ్యాపారాల్లో 21%, 15% వృద్ధి నమోదైందని వెల్లడించింది.