NRI-NRT

అమెరికా కాంగ్రెస్‌కు ఆ వర్గం నుండి తొలి గే!

Richie Torress Becomes First Black Gay In US Congress

అమెరికా ఎన్నికల్లో డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థి రిచీ టోరెస్‌(32) సరికొత్త చరిత్ర సృష్టించాడు. యూఎస్‌ కాంగ్రెస్‌(పార్లమెంట్‌)కు ఎన్నికైన తొలి నల్ల జాతి స్వలింగ సంపర్కుడిగా(గే) టోరెస్‌ రికార్డుకెక్కాడు. ప్రస్తుతం న్యూయార్క్‌ సిటీ కౌన్సిల్‌ సభ్యుడిగా పని చేస్తున్న ఆయన న్యూయార్క్‌ రాష్ట్రంలోని 15వ కాంగ్రెషనల్‌ జిల్లా నుంచి పార్లమెంట్‌కు ఎన్నికయ్యాడు. తన సమీప ప్రత్యర్థి, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి పాట్రిక్‌ డెలిసెస్‌ను ఓడించాడు. నేటి నుంచి కొత్త శకం మొదలవుతుందని టోరెస్‌ వ్యాఖ్యానించాడు. తన గెలుపు పట్ల ఆనందం వ్యక్తం చేశాడు. తాను ఆఫ్రో–లాటినో అని టోరెస్‌ తరచూ చెబుతుంటాడు. 2013 నుంచి సిటీ కౌన్సిల్‌ సభ్యుడిగా కొనసాగుతున్నాడు. అలా మాండెయిర్‌ జోన్స్‌(33) అనే మరో నల్లజాతి గే కూడా వెస్ట్‌చెస్టర్‌ కౌంటీ నుంచి పోటీ చేశాడు. ఫలితాన్ని ఇంకా వెల్లడించకపోవడంతో అతడు గెలిచాడా లేదా అనే తెలియరాలేదు. ఒకవేళ గెలిస్తే అమెరికా కాంగ్రెస్‌లో ఇద్దరు నల్లజాతి స్వలింగ సంపర్కులు ఉన్నట్లు అవుతుంది. సామాజిక వివక్షను తట్టుకొని, ప్రజల మద్దతు పొంది, నల్లజాతి స్వలింగ సంపర్కులు పార్లమెంట్‌లో అడుగుపెడుతుండడం శుభపరిణామమని ప్రజాస్వామ్య ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.