Health

డెంగీని తరిమే కషాయాలు

డెంగీని తరిమే కషాయాలు

ఒళ్లు కాలిపోయేంత జ్వరం! భరించలేని కీళ్ల నొప్పులు, ఒంటి నొప్పులు! ఇంతలా బాధించే డెంగ్యూ, చికున్‌గున్యాలకు ప్రత్యామ్నాయ వైద్య విధానాల్లో అద్భుతమైన నివారణ చికిత్సలు ఉన్నాయి!
***ఇంట్లోనే చేసుకోవచ్చు…
ఈ జ్వరం బారిన పడితే, జీర్ణాశయం పాడైపోతుంది. ఫలితంగా శరీరంలో ఆమం పెరుగుతుంది. ఇది రక్తంలో, కీళ్లల్లో, శరీరంలోని సమస్త కణజాలంలో పేరుకుపోతుంది. దాని ఫలితమే జ్వరం, ఒంటి నొప్పులు. సాధారణ జ్వరానికీ, డెంగీ జ్వరానికీ మధ్య లక్షణాల పరంగా పెద్ద తేడాలేవీ ఉండవు. సునిశితంగా గమనిస్తే తప్ప ఆ తేడా బోధపడదు. ఆ తేడాలు తెలియకపోతే అది డెంగీ జర్వమని గానీ, దానికి సంబంధిత ప్రత్యేక చికిత్సలు అవసరమని గానీ గుర్తించలేకపోయే ప్రమాదం ఉంది.
**డెంగీ లక్షణాలు
తలనొప్పితో పాటు కళ్లు లాగడం, కళ్లనొప్పి ఉంటాయి. వీటితో పాటు ఒంటి నొప్పులు, కండరాల నొప్పులు, ఎముకలు విరిచేస్తున్న నొప్పి కూడా ఉంటాయి.
వాంతులు కావడం లేదా వికారం ఉంటాయి.చర్మం మీద అక్కడక్కడా దద్దుర్లలా కాకుండా శరీరంలో అత్యధిక భాగం ఎర్రబారుతుంది. మౌలికంగా డెంగీ బాధితుల్లో కనిపించే లక్షణాలు ఈ మూడే. అయితే, అందరిలోనూ మొత్తం మూడూ కాకపోయినా వీటిలోని ఏ రెండు లక్షణాలైనా తప్పనిసరిగా ఉంటాయి. ఈ లక్ష ణాలతో పాటు చర్మాన్ని ఎక్కడైనా నొక్కితే అప్పటిదాకా ఎర్రగా ఉన్న చర్మం కాసేపు తెల్లగా కనిపిస్తుంది. డెంగీ వైరస్‌ ఎముక మజ్జను దెబ్బ తీయడం వల్ల క్రమ క్రమంగా రక్తంలోని ప్లేట్‌లెట్ల సంఖ్య పడిపోతుంది. ఫలితంగా గడ్డకట్టే సహజ లక్షణాన్ని రక్తం కోల్పోతుంది. అందుకే ఒక దశలో రక్తస్రావం అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. డెంగీలో కనిపించే ఒంటి నొప్పులు, తలనొప్పి, వాంతులు అనేవి వాత లక్షణాలు. చర్మం ఎర్రబారడం అనేది పిత్త లక్షణం. ఈ రెండు లక్షణాలూ ఉండడం వల్ల ఆయుర్వేదం డెంగీని ‘వాతపిత్త జ్వరం’గా పిలుస్తారు.
***డెంగీని ఎదుర్కోండిలా…
*చికిత్స సులువే!
శరీరం అస్వస్థతకు గురికావడానికి కారణమైన ఆమాన్ని తొలగించడం చాలా ముఖ్యం. ఆమం తగ్గితేనే నొప్పి తగ్గుతుంది. అయితే, ఆమం సమస్త కణజాలాన్ని పట్టుకుని ఉంటుంది కాబట్టి దాన్ని వేరు చేసి బయటికి పంపడం కష్టం. అందువల్ల దాన్ని దహించడం ద్వారా మాత్రమే దాన్ని హరించగలం. శొంఠి, తిప్పతీగ (గుడూచి), పిప్పళ్లు, తుంగ ముస్తలు ఇవన్నీ ఆమాన్ని హరించే ఔషధ అంశాలు. ఇవి కాకుండా అమృతాది గుగ్గుళ్లు. ముస్తకారిష్టం వంటివి ముఖ్యమైనవి. కాకపోతే, ఆమం ఏ స్థాయిలో ఉంది, కణజాలంలో ఏ మేరకు వాపు ఉంది? ఏ మందులు ఇవ్వాలి అనేది ఆయుర్వేద వైద్యులు నిర్ణయిస్తారు.
వ్యాధినిరోధకశక్తి పెంచుకోవడం కోసం గుడూచి (తిప్ప తీగ) మాత్రలు బాగా ఉపయోగపడతాయి. వాటిని ఉదయం ఒకటి, రాత్రికి ఒకటి తీసుకుంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. డెంగీ, చికున్‌గున్యాల సమస్య ఏదీ లేనప్పుడు మామూలుగా ఇమ్యూనిటీ పెంచుకోవాలనుకుంటే రోజుకు ఒక మాత్ర వేసుకున్నా చాలు. జీర్ణశక్తి బాగా ఉన్నవాళ్లయితే, రోజుకు ఒక స్పూన్‌ చవన్‌ప్రాశ్‌ తీసుకున్నా సరిపోతుంది.
**డెంగీని వదిలించే కషాయాలు!
ఇమ్మూనిటీ పెంచడంతో పాటు యాంటీ వైరల్‌గా పనిచేసే కొన్ని కషాయాలను మనం ఇంట్లోనే తయారుచేసుకుని అన్ని వయసుల వారూ సేవించవచ్చు.
అందుకు…. సుమారుగా గుప్పెడు తులసి ఆకులు, గుప్పెడు తమలపాకులు, గుప్పెడు వాము ఆకులు (దొరకకపోయినా ఫరవాలేదు) మరీ లేతవీ, మరీ ముదురువీ కాకుండా అర గుప్పెడు వేప ఆకులు వీటన్నింటినీ తుంచేసి, అందులో మూడు వెల్లుల్లి పాయలు, అర స్పూన్‌ మిరియాలు, పావు స్పూన్‌ అతి మధురంతో పాటు 400 మి. లీటర్ల నీళ్లలో వేసి 150 మి.లీ నుంచి 200 మి.లీ. అయ్యేదాకా మరిగించాలి. ఈ కషాయాన్ని వడగట్టి ఈ ద్రావణాన్ని నాలుగు భాగాలు చేసి, రోజుకు సుమారు అరకప్పు నాలుగు పూటలా తాగాలి. కుదురకపోతే, కనీసం మూడు పూటలైనా తాగాలి. అవసరమనుకుంటే అందులో కొంత బెల్లం కలుపుకోవచ్చు. చిన్న పిల్లలకైతే ఐదారు చుక్కలు తాగించినా చాలు. ఇలా చేస్తే యాంటీ వైరల్‌గానూ పనిచేస్తుంది. జ్వరాన్నీ, ఒంటినొప్పులనూ తగ్గిస్తుంది.
***ప్లేట్‌లెట్లు పడిపోతే?
బొప్పాయి లేత ఆకుల గుజ్జు డెంగీ నివారణకు బాగా ఉపయోగపడుతుంది. బొప్పాయి లేత ఆకులను నూరి ముద్దలా చేసి, ఒక స్పూన్‌ ముద్ద ఉదయం, ఒక స్పూన్‌ సాయంత్రం తీసుకుంటే రెండు రోజుల్లో ప్లేట్‌లెట్ల పెరుగుదల కనిపిస్తుంది.
**ఒక్క రోజులోనే అదుపులోకి…
పగటి వేళ కుట్టే దోమతో డెంగీ సోకుతుంది. కండరాల నొప్పులు, కీళ్లనొప్పులతో పాటు ఎముకలు విరిగిపోతున్నట్లు నొప్పి ఉంటుంది. ప్లేట్‌లెట్లు పడిపోవడంతో చర్మం అడుగున రక్తస్రావం అవుతుంది. పంటి చిగుళ్ల్లలో నుంచి, శ్వాసకోశాల్లో కూడా రక్తస్రావం కావచ్చు. వైద్య చికిత్సలేవీ తీసుకోకపోతే ఒక్కోసారి ప్లేట్‌లెట్లు బాగా పడిపోయి, ప్రాణహాని ఏర్పడే ప్రమాదం కూడా ఉంటుంది. అయితే హోమియోపతి మందులతో డెంగీ సమస్య ఒక్క రోజులోనే అదుపులోకి వస్తుంది. 3 నుంచి 5 రోజుల్లో రోగి నూటికి నూరు శాతం డెంగీ నుంచి బయటపడతాడు.
***హోమియో వైద్య చికిత్సగా…..
తీవ్రమైన ఒంటి నొప్పులు, భరించరాని బాధతో అటూ ఇటూ దొర్లుతూ ఉంటే, ‘రూస్టాక్స్‌ – 200’ మందు వేయవచ్చు. దీనితో చాలా త్వరగా ఉపశమనం లభిస్తుంది.ఎముకలు విరిగిపోతున్నట్లు ఉంటే ‘ఇపటోరియం పర్ఫ్‌ – 200’ అనే మందును వేయవచ్చు.లోలోపల రక్తస్రావం అవుతూ, ప్లేట్‌లెట్లు పడిపోతున్నప్పుడు ‘ఆర్నికా – 200’, ‘ఫాస్ఫరస్‌ – 200’ మందులను ఇస్తే రక్తస్రావం ఆగిపోవడంతో పాటు ప్లేట్‌లెట్స్‌ పెరగడం మొదలవుతుంది. అయితే ఈ మందును హోమియో వైద్యుని పర్యవేక్షణలోనే తీసుకోవడం మేలు. ఎందుకంటే సమస్య తీవ్రతను అనుసరించి వారు మందుల మోతాదును సూచిస్తారు.