పాన్ ఇండియా చిత్రం ‘సాహో’తో శ్రద్ధా కపూర్ దేశవ్యాప్తంగా సుపరిచితురాలైంది. ఇటీవలే నృత్య ప్రధాన చిత్రం ‘స్ట్రీట్ డ్యాన్సర్ త్రీడీ’తో వచ్చింది. అందులో తన చిన్ననాటి స్నేహితుడు వరుణ్ ధావన్‌తో కలసి నటించింది శ్రద్ధ. ఆ చిత్రంలో వారిద్దరి నృత్యాలు అబ్బురపరుస్తున్నాయి. ఈ సినిమా కన్నా ముందే వారిద్దరూ ‘ఏబీసీడీ 2’లో జోడీగా నటించారు. వరుణ్‌తో తనకున్న అనుబంధంతో పాటు ‘స్ట్రీట్ డ్యాన్సర్’ విశేషాలను పంచుకుంది శ్రద్ధ. ‘‘చిన్నప్పుడు నేను, వరుణ్ వేరు వేరు పాఠశాలల్లో చదివేవాళ్లం. ఇద్దరం కలిసినప్పుడు మా స్కూలే గొప్పదంటూ పోట్లాడుకునేవాళ్లం. వరుణ్కు నా జీవితంలోనూ, నా మనసులోనూ ప్రత్యేక స్థానముంది. అతణ్ని చూస్తూ పెరిగాను. తను చాలా నిరాడంబరంగా ఉంటాడు. అతణ్ని తెరపై చూస్తుంటే ఆనందంగా ఉంది. మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే ఓ ప్రత్యేక లక్షణం అతనిలో ఉంది’’ అని చెప్పింది శ్రద్ధ. డ్యాన్స్‌పై తనకున్న ఇష్టం గురించి చెబుతూ ‘‘చిన్నప్పుడు నడవడం నేర్చుకున్న వెంటనే నాకు డ్యాన్స్ మీద మక్కువ ఏర్పడింది. మా అమ్మానాన్న నన్ను, అన్నయ్యను డ్యాన్స్ చేయమని ప్రోత్సహించేవారు. శ్రీదేవి, మాధురీ దీక్షిత్‌ల పాటలు ఎక్కువ సౌండ్‌తో పెట్టేవారు. అవి వినగానే మేం అద్దం ముందుకు వచ్చి డ్యాన్స్ చేసేవాళ్లం. మాకు కనపడకుండా అమ్మానాన్న కెమెరాలు దాచి రికార్డు చేసేవారు. వెండితెరపై డ్యాన్స్ చేయాలన్న నా చిన్ననాటి కల ‘ఏబీసీడీ 2’, ‘స్ట్రీట్ డ్యాన్సర్ త్రీడీ’ చిత్రాలతో తీరింది. ఇప్పటికీ నృత్య సన్నివేశాలంటే నాకు భయం వచ్చేస్తుంది. రిహార్సల్స్ చేస్తున్నప్పుడు కొన్ని స్టెప్పులు ఊహించిన దానికన్నా కఠినంగా అనిపిస్తాయి. అప్పుడు నా టీమ్ ధైర్యం చెబుతుంటుంది. ఆహార నియమాలు పాటించడం, కసరత్తులు చేయడం లాంటి జాగ్రత్తలు తీసుకుని దేహాన్ని స్వాధీనంలోకి తెచ్చుకుని డ్యాన్స్ సీన్లు చేస్తాన’’ని చెప్పింది శ్రద్ధ.
వరుణ్ ఈజ్ స్పెషల్
Related tags :