ఎన్నికల్లో తాను ఓటమి పాలైతే అంగీకరించబోనని బయటకు గంభీరంగా చెప్తున్నప్పటికీ.. లోలోపల మాత్రం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర గందరగోళానికి గురవుతున్నట్లు తెలుస్తోంది. బైడెన్ విజయం సాధించిన అన్నిచోట్లా కోర్టుల్లో దావాలు వేస్తానని ట్రంప్ ఇప్పటికే హెచ్చరించిన సంగతి తెలిసిందే. అయితే- ఈ అంశంపై ట్రంప్ న్యాయవాద బృందంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్లు ఆయన సన్నిహితుడొకరు తెలిపారు. ఓటమి ఎదురైతే హుందాగా అంగీకరించడం మంచిదని కొందరు సూచిస్తుండగా, పోరాటం కొనసాగించాలంటూ మరికొందరు ప్రోత్సహిస్తున్నారని వెల్లడించారు. దీంతో ఎటూ తేల్చుకోలేక ట్రంప్ అయోమయంలో ఉన్నారని పేర్కొన్నారు. ప్రతికూల ఫలితం వస్తే.. చిట్టచివరకు ఆయన అంగీకరించే పరిస్థితులు ఉన్నాయని, ఆలోపు మాత్రం కచ్చితంగా పోరాటం కొనసాగిస్తారని చెప్పుకొచ్చారు.
అగ్రరాజ్య తదుపరి అధినేత ఎవరన్నదానిపై నెలకొన్న అనిశ్చితి క్రమంగా తొలగిపోతోంది! డెమొక్రాట్ల అభ్యర్థి జో బైడెన్ అధ్యక్ష పీఠానికి చేరువవుతున్నారు. తాజాగా జార్జియా, పెన్సిల్వేనియాల్లో ఆయన ఆధిక్యంలోకి దూసుకెళ్లారు. నెవాడాలో ముందంజలో కొనసాగుతున్నారు. ఈ మూడు రాష్ట్రాల్లో ఏ ఒక్కటి దక్కినా.. అధ్యక్ష పదవి ఆయన సొంతమవుతుంది. దీంతో ట్రంప్ పదవిలో కొనసాగే అవకాశాలు దాదాపుగా మూసుకుపోయినట్లే కనిపిస్తున్నాయి! మరోవైపు- జార్జియాలో అభ్యర్థులిద్దరి మధ్య అంతరం స్వల్పంగా ఉండటంతో ఓట్లను మళ్లీ లెక్కించడం అనివార్యమని అధికారులు చెబుతున్నారు. పెన్సిల్వేనియాలోనూ రీకౌంటింగ్ కోరుతూ కోర్టును ఆశ్రయించాలని ట్రంప్ బృందం యోచిస్తోంది. విజయానికి చేరువ కావడంతో బైడెన్‌కు అమెరికా సీక్రెట్ సర్వీస్ విభాగం భద్రతను పెంచింది. యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్నవేళ అమెరికాలో ఓట్ల లెక్కింపు సుదీర్ఘంగా కొనసాగుతోంది. మొత్తం ఐదు రాష్ట్రాల్లో ఫలితాలు ఇంకా స్పష్టం కావాల్సి ఉంది. ఆ ఐదింటినీ చేజిక్కించుకుంటేనే ట్రంప్‌కు అధ్యక్ష పీఠం దక్కుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో అది దాదాపు అసాధ్యంగా కనిపిస్తోంది! గురువారం వరకూ ఆయన ముందంజలో ఉన్న జార్జియా, పెన్సిల్వేనియాల్లో తాజాగా బైడెన్ ఆధిక్యంలోకి దూసుకెళ్లడమే ఇందుకు కారణం. పోలింగ్ రోజు నమోదైన సాధారణ ఓట్ల లెక్కింపు అన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే పూర్తయింది. పోస్టల్ బ్యాలెట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. పోలింగ్ రోజుకు ముందే గణనీయ సంఖ్యలో డెమొక్రాట్లు ఓటు హక్కును వినియోగించుకున్నట్లు ఇప్పటికే పలు సర్వేలు అంచనా వేశాయి. తాజా ఫలితాల సరళిని చూస్తే అది వాస్తవమేనని తెలుస్తోంది. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు సాగే కొద్దీ జార్జియా, పెన్సిల్వేనియాల్లో ట్రంప్ వెనకబడటమే ఇందుకు నిదర్శనం.