ScienceAndTech

10 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టిన PSLV-C49

10 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టిన PSLV-C49

శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ నుంచి పీఎస్ఎల్‌వీ సి-49 రాకెట్‌ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. పీఎస్‌ఎల్‌వీ సి-49 వాహకనౌక ద్వారా 10 ఉపగ్రహాలను శాస్త్రవేత్తలు నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. భారత్‌కు చెందిన ఎర్త్‌ అబ్జర్వేషన్‌ శాటిలైట్‌ (ఈవోఎస్‌-01) సహా మరో 9 విదేశీ ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. భారత్‌కు చెందిన ఉపగ్రహం ఈవోఎస్‌-01 వ్యవసాయం, ప్రకృతి వైపరీత్యాలపై అధ్యయనం చేయనుంది. పీఎస్‌ఎల్‌వీ సి-49 ప్రయోగం విజయవంతంపై ఇస్రో ఛైర్మన్ శివన్‌ హర్షం వ్యక్తం చేశారు. ప్రయోగం సఫలీకృతం చేసిన ఇస్రో శాస్త్రవేత్తలను ఆయన అభినందించారు. అంతకుముందు పీఎస్ఎల్‌వీ సి-49 ప్రయోగం 10 నిమిషాలు వాయిదా పడింది. రాకెట్‌ ప్రయోగానికి షార్‌లో అన్ని ఏర్పాట్లు పూర్తి కాగా భారీ వర్షం కారణంగా ప్రయోగం ఆలస్యం అయింది. మొదటగా 3:02 నిమిషాలకు ప్రయోగించాలని భావించిన శాస్త్రవేత్తలు పది నిమిషాలు ఆలస్యంగా 3:12కు రాకెట్‌ ప్రయోగించారు.