* సరికొత్త హంగులతో మార్కెట్లోకి వచ్చిన మహీంద్ర అండ్ మహీంద్రా థార్ దీపావళి కానుకగా ఇళ్లకు చేరబోతోంది. ఈ నెల 7,8 తేదీల్లో 500 కార్లను వినియోగదారులకు అందించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. రెండు వేరియంట్లకు లభించిన బుకింగ్ క్రమాన్ని బట్టి అందిస్తామని వెల్లడించింది. సెప్టెంబరులో నిర్వహించిన వేలంలో అత్యధిక పాట పాడిన వ్యక్తికి థార్ తొలి యూనిట్‌ను అందించిన విషయం తెలిసిందే. థార్ కొత్త వెర్షన్‌ను ఎంఅండ్‌ఎం అక్టోబర్ 2న ఆవిష్కరించిన విషయం తెలిసిందే. నెలకు 2000 యూనిట్ల ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకుంది. జనవరి నాటికి దీన్ని మూడు వేలకు పెంచాలని నిర్ణయించారు. విడుదలైన ఒక్క నెల వ్యవధిలోనే 20,000 బుకింగ్స్ వచ్చినట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.
* ఉద్యోగులు ఆఫీసుకు వచ్చి పనిచేసే పాత పని పద్ధతికి ఐటీ పరిశ్రమ తిరిగి వెళ్లకపోవచ్చని ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ కార్యదర్శి అజయ్ ప్రకాశ్ సాహ్నే అన్నారు. సుమారు 75 శాతం మంది సిబ్బందిని ఆఫీసు బయట నుంచే పనిచేయడాన్ని కొనసాగించే అవకాశం ఉందని తెలిపారు. లాక్‌డౌన్ సమయంలోనూ ఐటీ పరిశ్రమ రాణించిందని తెలిపారు. దేశీయ, విదేశీ క్లయింట్లకు సేవలను అందించేందుకు సుమారు 97 శాతం మంది ఉద్యోగులు ఇంటి నుంచి లేదా తమకు అనువైన ప్రదేశం నుంచి పనిచేసిన విషయాన్ని గుర్తు చేశారు. ‘లాక్‌డౌన్ సమయంలో పరిశ్రమలో చోటుచేసుకున్న మార్పులు ఆశ్చర్యానికి గురి చేశాయి. పాత పని విధానానికి తిరిగి వెళ్తారని నేను అనుకోవడం లేద’ని తెలిపారు. కాగా. గురువారం బీపీఓలు, ఐటీఈఎస్ కంపెనీలకు సంబంధించి వర్క్‌ఫ్రమ్ హోమ్, వర్క్ ఫ్రమ్ ఎనీవర్ విధానాన్ని సులభతరం చేయడంతో పాటు నిబంధనలను సడలించిన సంగతి తెలిసిందే. డేటా కేంద్రాల సాయంతో అందించే సేవలు ఆఫీసు బయట నుంచి ఎలాంటి అంతరాయం లేకుండా పనిచేసేందుకు తోడ్పడ్డాయని సాహ్నే తెలిపారు.
* మదుపరుల ఫిర్యాదులను 15 రోజుల్లోగా పరిష్కరించాలని స్టాక్ ఎక్స్ఛేంజీలను మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఆదేశించింది. పెట్టుబడిదారుల ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని మరింత పటిష్ఠం చేయాలనే లక్ష్యంతో ఈ ఆదేశాలను జారీ చేసింది. సరైన సమాచారం లేదంటూ మదుపరుల ఫిర్యాదులను బుట్టదాఖలు చేయొద్దని మదుపరుల ఫిర్యాదు పరిష్కార కమిటీ (ఐజీఆర్‌సీ)కి సూచించింది. ఏదైనా అదనపు సమాచారం కావాల్సి ఉంటే.. ఫిర్యాదు దాఖలైన ఏడు రోజుల్లోగా దానిని కోరాలని పేర్కొంది. ఒకవేళ 15 రోజుల్లోగా ఫిర్యాదు పరిష్కారం కాకపోతే.. అందుకు తగిన కారణాలను పేర్కొంటూ ఆ సమాచారాన్ని భద్రపరచాలని సూచించింది. ఫిర్యాదుదారు తనకు లభించిన పరిష్కారంతో సంతృప్తి చెందకపోతే.. దాన్ని ఐజీఆర్‌సీకి పంపించాలని పేర్కొంది. ఒకవేళ అక్కడ అదనపు సమాచారం అవసరమైతే ఆ ఫిర్యాదును 30 రోజుల్లోగా పరిష్కరించాలని స్పష్టం చేసింది.
* దేశ జీడీపీ మదింపునకు డిజిటల్ చెల్లింపుల పెరుగుదల దోహదపడుతుందని, పన్ను నిపుణులు తమ ఖాతాదారులు డిజిటల్ పద్ధతుల్లో చెల్లింపులు చేసే విధంగా సూచనలు చేయాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. దేశంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా పన్ను వసూళ్లు పెంచేందుకు, రెవెన్యూ వసూళ్లలో పన్ను భారాన్ని తగ్గించేందుకు చూస్తాయని, పన్ను చెల్లింపుదార్లు నిబంధనలు పాటించడంలో నిపుణులు కీలక పాత్ర పోషిస్తారని అన్నారు. డిజిటల్ లావాదేవీలు పెరిగే కొద్దీ, నగదు లావాదేవీలు తగ్గొచ్చని అభిప్రాయపడ్డారు. ఆలిండియా ఫెడరేషన్ ఆఫ్ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ నిర్వహించిన ‘నేషనల్ ట్యాక్స్ కాన్ఫరెన్స్ 2020’ పాల్గొన్న నిర్మలా సీతారామన్ మాట్లాడారు. వాణిజ్య లావాదేవీలు పర్యవేక్షణలోకి రాకుండా భారత జీడీపీని సరిగ్గా అంచనా వేయలేమని తెలిపారు.