అమాయకత్వం.. అనుభవ రాహిత్యం.. అత్యాశ.. వివాదాలు.. అనుచిత వ్యాఖ్యలు.. గిల్లికజ్జాలు.. అబద్దాలు.. అహంకారపూరిత చర్యలు.. కించపర్చడాలు.. లైంగిక ఆరోపణలు.. బడాయి మాటలు.. ఇలాంటి పదాలన్నీ వింటుంటే, వీటన్నింటినీ కలగలిపిన ఒక పేరు మనసులో స్ఫురిస్తుంది. ఆ పేరే డొనాల్డ్ ట్రంప్. అమెరికా అధ్యక్షుడిగా అధికారం చేపట్టినప్పటి నుంచి ఎన్నికల్లో ఓడిపోయే వరకు లెక్కలేనన్ని వివాదాల్లో ఉన్నారాయన. విజయవంతమైన వ్యాపారవేత్తగా పేరున్న ట్రంప్.. తన పాలనలో కీలకమైన సంస్కరణలు చేశారు. ఆ ఫలాలను ప్రజలు అనుభవించారు. కానీ, వివాదాస్పదుడిగా ఉన్న ముద్రను మాత్రం చెరుపుకోలేకపోయారు. చివరికి ఈ చెడ్డపేరు ఏ స్థాయిలో వచ్చిందంటే.. సర్వేల్లో ‘షై ట్రంప్ ఓటర్స్’ అనే విభాగం కింద కూడా అంచనాలు తయారు చేశారు. అంటే తాము ట్రంప్‌కు ఓటు వేస్తామని చెప్పడానికి సిగ్గుపడేవారి కోసం దీన్ని ఏర్పాటు చేశారన్నమాట! దీనిబట్టి ఆయన ఇమేజ్‌ను అర్థం చేసుకోవచ్చు. చివరికి ఆ వివాదాలే ట్రంప్‌ను గద్దె దించే వరకు తీసుకొచ్చాయి.
*** కరోనా విషయంలో బాధ్యతా రాహిత్యం..
ఎన్నికల సంవత్సరంలో కరోనా వ్యాపించడం ట్రంప్‌కు శాపంగా మారింది. టీకా కోసం ‘ఆపరేషన్ వార్‌స్పీడ్’, నిరుద్యోగులకు, కంపెనీలు ప్యాకేజీ వంటివి చేపట్టినా.. వ్యాప్తిని నిరోధించడంలో ట్రంప్ విఫలమయ్యారనే పేరొచ్చింది. ప్రపంచంలోనే అత్యధిక కేసులు అమెరికాలో నమోదయ్యాయి. కొవిడ్ నిబంధనలు పాటించాల్సిన అధ్యక్షుడే వాటిని గాలికొదిలేశారు. దీంతోపాటు అంటువ్యాధుల నిపుణుడైన ఆంతోనీ ఫౌచీని తరచూ విమర్శించడం కూడా ట్రంప్‌పై వ్యతిరేకతను పెంచింది. పార్టీలతో సంబంధం లేకుండా అమెరికాలో ఆరుగురు అధ్యక్షుల వద్ద ఫౌచీ పనిచేశారు. ఆయనకు అభిమాన సంఘాలే ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దీనికి తోడు వైట్‌హౌస్‌లో మహమ్మారుల వ్యాప్తి సమయంలో స్పందించే అత్యవసర బృందాన్ని ట్రంప్ 2018లో రద్దు చేశారు. ఆ ఫలితమే ఇప్పుడు అమెరికా అనుభవిస్తోంది.
*** నల్ల జాతీయుల ఆగ్రహం..
అసలే గ్రాండ్ ఓల్డ్ పార్టీ (రిపబ్లికన్లు) శ్వేతజాతీయుల పక్షపాతులనే ముద్ర ఉంది. దీనికి తోడు ట్రంప్‌పై మొదటి నుంచి నల్లజాతీయులు ఆగ్రహంగానే ఉన్నారు. జార్జిఫ్లాయిడ్ హత్య అనంతరం ఆ పరిస్థితి మరింత దిగజారింది. అప్పటి వరకు శాంతియుతంగా సాగిన ట్రంప్ పాలనలో ఒక్కసారిగా హింస చెలరేగింది. నల్లజాతీయులకు భద్రతకు సంబంధించి విశ్వాసం కల్పించే చర్యలతో సమస్యను పరిష్కరించాల్సిందిపోయి.. బాధ్యతారాహిత్యమైన ప్రకటనలతో ట్రంప్ వివాదానికి ఆజ్యం పోశారు. ఆందోళనకారులను దేశీయ ఉగ్రవాదులతో పోల్చారు. సైన్యాన్ని రంగంలోకి దింపుతానని రెచ్చగొట్టారు. ఫలితంగా ఆందోళనకారులు వైట్‌హౌస్‌ను చుట్టుముట్టడంతో భూగర్భ బంకర్‌లో దాక్కోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ‘‘లూటీలు ఎప్పుడైతే మొదలవుతాయో.. కాల్పులు కూడా అప్పుడు మొదలవుతాయి’’ అని ట్రంప్ చేసిన ట్వీట్‌తో నల్లజాతీయుల్లో ఆగ్రహం పెరిగిపోయింది. ఈ డైలాగ్‌ను 1967లో శ్వేతజాతి అహంకారిగా పేరున్న వాల్టర్ హెడ్లీ అనే మియామి పోలీస్ అధికారి తొలిసారి వాడారు. ట్రంప్ అటువంటి వ్యక్తి వ్యాఖ్యలను ఉటంకించి తప్పు చేశారు. దీంతో ట్రంప్ నల్లజాతీయుల వ్యతిరేకి అనే ముద్ర పడింది.
*** అనుభవరాహిత్యం..
ట్రంప్ నేరుగా కార్పొరేట్ ఆఫీస్ నుంచి శ్వేత సౌధంలోకి అడుగుపెట్టారు. ఆయనకు కౌంటీ స్థాయిలో కూడా పాలనపరమైన అవగాహన లేదు. ఆయన ఏ దశలోనూ నేర్చుకోవడానికి ఇష్టపడలేదు. దీంతో ఆయన కార్యవర్గంలో ఎవరూ ఎక్కువ కాలం కొనసాగలేదు. కొన్నాళ్లు పనిచేసి బయటకు వెళ్లిన తర్వాత ట్రంప్ లోపాలను ఎత్తిచూపడం ఒక ఆచారంగా మారిపోయింది. అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పాంపియో మినహా ఆయన కార్యకవర్గంలో స్థిరంగా కొనసాగిన కీలక వ్యక్తులు ఎవరూ కనిపించరు. జేమ్స్ మ్యాటిస్ వంటి కరుడుగట్టిన సైనిక జనరల్స్ తలపట్టుకొని వెళ్లిపోయారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
*** ఐరోపాతో వైరం..
ఐరోపా, ఆస్ట్రేలియా, జపాన్ వంటివి ఆర్థిక మహా శక్తులు. అంతేకాదు, అమెరికాతో విడదీయరాని విధంగా సాంస్కృతిక సంబంధాలు కలిగిన దేశాలు. ముఖ్యంగా ఐరోపా దేశాలను అమెరికాకు దూరం చేసేలా ట్రంప్ తీసుకొన్న కొన్ని నిర్ణయాలు ఓటర్లను బెదరగొట్టాయి. ‘ట్రంప్ వంటి మిత్రుడు ఉంటే చాలు.. ప్రత్యేకంగా వేరే శత్రువులు ఉండాల్సిన అవసరం లేదు’ అని ఐరోపా సంఘం అధ్యక్షుడిగా 2019 వరకు బాధ్యతలు నిర్వహించిన డొనాల్డ్ టస్క్ పేర్కోవడం పరిస్థితికి అద్దంపడుతుంది. ఐరోపా దేశాల నుంచి వచ్చే స్టీల్, ఆటోమొబైల్ వంటి వాటిపై భారీ టారీఫ్‌లు విధించడం.. నాటో వంటి కూటముల్లోని దేశాలను చిన్నచూపు చూడడం వంటి చర్యలు అమెరికాలోని ఐరోపా వాసులు ఓటింగ్ సమయంలో పునరాలోచించుకొనేలా చేశాయి.
*** కీలక కూటముల్లో అమెరికా పరువు పోవడం..
నాటో, జీ20 వంటి కూటముల్లో ట్రంప్ హయాంలో అమెరికా తన స్థాయిని తగ్గించుకుందనే అభిప్రాయం విద్యావంతుల్లో ఉంది. ఒక దశలో ఐరోపా దేశాలు కలిసి సైనిక కూటమిగా ఏర్పడాల్సిన సమయం ఆసన్నమైందని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానియేల్ మాక్రోన్ 2019లో ప్రకటించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఒక్కసారి నాటో విచ్ఛిన్నం అయితే ప్రపంచంపై అమెరికా ఆధిపత్యానికి గండిపడటం ఖాయం.
*** వలసలు.. వీసా నిబంధనలు..
అమెరికా వీసా నిబంధనలను ట్రంప్ కఠినతరం చేయడం వంటివి దేశీయంగా ఉద్యోగాలను పెంచడానికే అని చెప్పినా.. అమెరికా పరిశ్రమలకు చౌకగా లభించే కార్మికులను దూరం చేసింది. అమెరికా చుట్టుపక్కల దేశాల నుంచి వచ్చే హిస్పానిక్ ప్రజలను కట్టడి చేయడంతో వ్యవసాయ రంగంలోని కూలీల లభ్యతపై అది ప్రతికూల ప్రభావం చూపింది. చాలా రాష్ట్రాల్లో అమెరికా రైతుల పొలాల్లో ఎక్కువగా వీరే పనిచేస్తుంటారు. మెక్సికో నుంచి పొట్ట చేతపట్టుకొచ్చే వలస కూలీలను జైళ్లలో బంధించి.. వారి పిల్లలను ట్రంప్ ప్రభుత్వం గిడ్డంగుల్లో ఉంచింది. వీరిలో పాకే పసివారు.. పదేళ్లలోపు పిల్లలు కూడా ఉండటంతో అమెరికా సమాజం భావోద్వేగానికి లోనైంది. ఈ విషయంలో దేశ తొలి మహిళ మెలానియానే భర్తకు వ్యతిరేకంగా గళం విప్పారు. ఇక వివిధ వృత్తుల్లో నైపుణ్యం ఉన్నవారిని అమెరికాకు తీసుకొచ్చి వారి సేవలను వినియోగించే అవకాశాలను కూడా ఆయన బిగించి వేశారు. అమెరికా ఆర్థిక వ్యవస్థకు వీరు చాలా కీలకం. ఇవి బెడిసికొడతాయని నిపుణులు మొదటి నుంచీ హెచ్చరిస్తూనే ఉన్నారు.
ఇక ట్రంప్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలకు అసలు లెక్కేలేదు. ప్రత్యర్థులపై వ్యక్తిగత దూషణలు చేయడం.. వెక్కిరించడం వంటివి హద్దులు దాటి ప్రజలు వెగటు పుట్టించాయి. ట్రంప్‌లో ఓటమి భయం పట్టుకున్నాక ఓ సందర్భంలో ఆయన మాట్లాడుతూ ‘కొవిడ్ సమయంలో ప్రజా సంబంధాల్లో (పీఆర్) మాత్రమే విఫలం అయ్యాం’ అని ట్రంప్ స్వయంగా అంగీకరించారు. ఒక్క కొవిడ్ విషయంలోనే కాదు.. గత నాలుగేళ్లగా ప్రజా సంబంధాల్లో విఫలం అయ్యారనే సంగతి ఇప్పటికీ కూడా గ్రహించలేకపోవడమే ట్రంప్ మారలేదనడానికి చిహ్నం!!