WorldWonders

ఒకే కాక్‌పిట్‌లో తల్లీకూతుళ్లు

ఒకే కాక్‌పిట్‌లో తల్లీకూతుళ్లు

మహిళలు తలచుకుంటే సాధించలేనిది ఏమీ లేదని నిరూపించారు అమెరికాకు చెందిన తల్లీకూతుళ్లు. ఒకే విమానాన్ని నడిపి చరిత్ర సృష్టించారు. విమానంలో కాక్‌పిట్‌ పంచుకున్న ప్రపంచంలోనే మొదటి తల్లీకూతుళ్లుగా వారు రికార్డు సొంతం చేసుకున్నారు. కెప్టెన్ సుజీ గారెట్ 30 ఏళ్లుగా పైలట్. ఇటీవల ఆమె తన కుమార్తె, మొదటి అధికారి డోనా గారెట్‌తో కాక్‌పిట్‌ను పంచుకుంది. వీరిద్దరూ ప్రస్తుతం యూఎస్‌లోని స్కైవెస్ట్ ఎయిర్‌లైన్స్‌లో ఉద్యోగం చేస్తున్నారు. సుజీ, డోనా కలిసి వాణిజ్య విమానం నడిపిన మొదటి తల్లి-కుమార్తె ద్వయంగా గుర్తింపు పొందారు. సుజీ భర్త డౌగ్, కొడుకు మార్క్ కూడా పైలట్లు కావడం విశేషం. ‘మేం మా ఉద్యోగాలను పూర్తిగా ప్రేమిస్తాం. మా పిల్లలు కూడా ఇష్టంగానే పైలెట్లు అయ్యారు. కార్యాలయాల్లో కూర్చుని చేసే జాబ్‌పై మాకు మక్కువ లేదు. ఫ్లైయింగ్‌ చేస్తూ ఆనందిస్తున్నాం.’ అని సుజీ తన కుమార్తెతో కలిసి విమానం నడిపేందుకు బయలుదేరేముందు మాట్లాడారు.