Business

28 మోడళ్లు విడుదల చేయనున్న రాయల్ ఎనిఫీల్డ్-వాణిజ్యం

28 మోడళ్లు విడుదల చేయనున్న రాయల్ ఎనిఫీల్డ్-వాణిజ్యం

* పబ్‌జీ అభిమానులకు శుభవార్త. భారత్‌లో నిషేధానికి గురైన పబ్‌జీ త్వరలో అడుగుపెట్టనుంది. మైక్రోసాఫ్ట్‌ అజ్యూర్ క్లౌడ్‌ సర్వీస్‌ సహకారంతో పబ్‌జీని తీసుకు వస్తామని దక్షిణ కొరియాకు చెందిన క్రాఫ్టన్‌ ఇన్‌కో సంస్థ ప్రకటించింది. భారత్‌-చైనా ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం 117 యాప్‌లపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. యాపిల్‌ స్టోర్‌, గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి యాప్‌ను తొలగించారు. ప్లే స్టోర్‌లలో తొలగించినా అప్పటికే డౌన్‌లోడ్‌ చేసుకున్న వారు కొన్ని రోజులపాటు ఆడుకునే వెసులుబాటు వచ్చింది. అయితే టెన్సెంట్‌ తన సర్వర్ యాక్సెస్‌ను నిలిపివేయడంతో పబ్‌జీ గేమ్‌ పూర్తిగా ఆగిపోయింది.

* రాబోయే ఏడేళ్లలో 28 కొత్త మోడళ్లను తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ వెల్లడించింది. దేశీయంగానూ, ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్‌ను పెంచుకునేందుకు త్రైమాసికానికో కొత్త మోడల్‌ బైక్‌ను తీసుకురానున్నట్లు తెలిపింది.ఈ మేరకు ఆ కంపెనీ సీఈవో వినోద్‌ కె దాసరి ఓ వార్తా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో రాబోయే 5-7 ఏళ్లకు సంబంధించిన ఉత్పత్తి ప్రణాళికను వివరించారు.

* పాత వాహనాన్ని తుక్కు కింద ఇస్తే.. కేంద్ర ప్రభుత్వం కొత్త వాహనం కొనుగోలుపై 1 శాతం రాయితీ ఇవ్వనుంది. పాత వాహనాలను వదిలేస్తే కొత్త వాహనాలకు గిరాకీ పెరుగుతుంది కనుక ప్రభుత్వం ఆ మేరకు ప్రోత్సాహకం ఇవ్వనుంది. వాహన పరిశ్రమకు ప్రయోజనాలందించే ఈ ప్రభుత్వ ప్రతిపాదనకు పరిశ్రమ అంగీకరించింది. రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్‌ గడ్కరీ, భారత వాహన తయారీదార్ల సంఘం(సియామ్‌) మధ్య జరిగిన సమావేశంలో ఈ అంగీకారం కుదిరినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే ‘ఈ తుక్కు విధానాన్ని ప్రస్తుత పండుగ సీజను పూర్తయ్యాక అమలు చేయాలని పరిశ్రమ సంఘం కోరగా.. అందుకు ప్రభుత్వం అంగీకరించిన’ట్లు ఆ వర్గాలు వివరించాయి. ‘ప్రస్తుత పండుగ సీజనులో మార్జిన్లు ఒత్తిడిలో ఉన్నాయి. పండుగ తర్వాత గిరాకీ తగ్గిన పక్షంలో ఈ రాయితీలను వాహన పరిశ్రమ భరించగలుగుతుందో లేదో తెలియద’ని సియామ్‌ సభ్యుడు ఒకరు నితిన్‌ గడ్కరీతో అన్నట్లు తెలుస్తోంది. కాగా, బీఎస్‌-4 నుంచి బీఎస్‌-6 ఉద్గార ప్రమాణాలకు ఏప్రిల్‌ 1, 2020 నుంచే వాహన కంపెనీలు మారినప్పటికీ.. పాత వాహనాలను తుక్కుగా మార్చే విధానం మాత్రం ఆలస్యమవుతూ వస్తున్న సంగతి తెలిసిందే.

* ధన త్రయోదశికి పసిడి అమ్మకాలు పుంజుకునే అవకాశం ఉందని ఆభరణాల వర్తకులు ఆశాభావంతో ఉన్నారు. ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడిలో పడుతుండటం, గిరాకీ పరిస్థితులు మెరుగవుతుండడం ఇందుకు కలిసొస్తుందని భావిస్తున్నారు. కిందటేడాది ధన త్రయోదశి సమయంలో జరిగిన ఆభరణాల అమ్మకాల్లో 70 శాతాన్ని నమోదు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. పసిడి ధర పెరిగినప్పటికీ.. కరోనా పరిణామాల నేపథ్యంలో ప్రజల ఆదాయాలపై ప్రభావం పడినప్పటికీ పండగ సీజనులో అమ్మకాలు పుంజుకోవచ్చని అంచనా వేస్తున్నారు. భారత్‌లో జరుపుకునే పండగల్లో ముఖ్యంగా ధనత్రయోదశి, దీపావళి నాడు పసిడికి ప్రజలు అత్యంత ప్రాధాన్యం ఇస్తుండటమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. ‘పండగ సీజను ప్రారంభమైనప్పటి నుంచి అమ్మకాలు, విక్రయ కేంద్రాలకు వచ్చే వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ వస్తోంది. కొవిడ్‌-19 పరిణామాలున్నప్పటికీ ఇటీవల కొన్ని రోజుల్లో గిరాకీ బాగా పెరిగింది. దీనిని దృష్టిలో పెట్టుకునే కిందటి ధన త్రయోదశి వేళ నమోదైన అమ్మకాల్లో ఈసారి 70 శాతం జరగొచ్చని అనుకుంటున్నామ’ని ఆల్‌ ఇండియా జెమ్స్‌ అండ్‌ జువెలరీ డొమెస్టిక్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ అనంత పద్మనాభన్‌ తెలిపారు.

* విద్యుత్‌ ద్విచక్రవాహనాలను ఉత్పత్తి చేసే సంస్థ ఏథర్‌ ఎనర్జీ దాదాపు రూ.250 కోట్ల (35 మిలియన్‌ డాలర్లు) పెట్టుబడులను సాధించింది. హీరోమోటార్‌ కార్ప్‌ పెట్టుబడులున్న ఈ సంస్థకు సిరీస్‌ డి ఫండింగ్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్‌ సహ వ్యవస్థాపకుడు సచిన్‌ బన్సాల్‌ 23 మిలియన్‌ డాలర్లను పెట్టుబడి పెట్టారు. దీంతోపాటు హీరోమోటార్‌ కార్ప్‌ 12 మిలియన్‌ డాలర్లను అందించింది. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఏథర్‌ ఎనర్జీ ఈ తాజా పెట్టుబడులతో మరింత విస్తరించేందుకు, ఏథర్‌ 450ఎక్స్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ఉత్పత్తిని పెంచేందుకు వినియోగించనుంది.

* కరోనా కారణంగా ఏర్పడ్డ స్తబ్దత నుంచి వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని ఎస్‌బీఐ ఛైర్మన్‌ దినేశ్‌ కుమార్‌ ఖారా పేర్కొన్నారు. మహమ్మారి కారణంగా అన్ని రంగాల్లో చాలా మార్పులు చోటు చేసుకున్నాయని.. అందులో కొన్ని శాశ్వతం కానున్నాయని ఆయన అంచనా వేస్తున్నారు. కార్పొరేట్ల నుంచి పెట్టుబడులుపెరగడానికి కొంత సమయం పట్టొచ్చని అన్నారు. కంపెనీలు సగటు సామర్థ్య వినియోగం 69 శాతం వరకు నమోదు కావడం విశేషం.

* ఇ-కామర్స్‌ సంస్థ బిగ్‌ బాస్కెట్‌లో డేటా చౌర్యం జరిగిందని, కంపెనీకి చెందిన సుమారు 2 కోట్ల మంది వినియోగదారుల వివరాలు బయటకు వెళ్లాయని సైబర్‌ ఇంటెలిజెన్స్‌ సంస్థ సైబుల్‌ ఆధారంగా తెలుస్తోంది. ఈ విషయమై బెంగళూరులోని సైబర్‌ క్రైమ్‌ సెల్‌లో కంపెనీ ఫిర్యాదు చేసింది. బిగ్‌బాస్కెట్‌కు చెందిన ఈ సమాచారాన్ని హ్యాకర్‌ 30 లక్షలకు విక్రయానికి పెట్టినట్లు తెలుస్తోంది.

* దేశంలోని అన్ని నాలుగు చక్రాల వాహనాలకూ ఫాస్టాగ్‌ను కేంద్రం తప్పనిసరి చేసింది. ఈ మేరకు రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ శనివారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. గతంలో మినహాయింపు పొందిన పాత వాహనాలు తప్పనిసరిగా ఫాస్టాగ్‌ తీసుకోవాల్సిందేనని స్పష్టంచేసింది. ఈ మేరకు 1989 నాటి మోటారు వాహన చట్టంలో మార్పులు చేస్తూ​ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 2017 డిసెంబర్ ‌1 కంటే ముందు కొనుగోలు చేసిన వాహనాలకూ ఈ నిబంధనలు వర్తించనున్నాయి. 2021 జనవరి 1 నుంచి నూతన నిబంధనలు అమల్లోకి రానున్నాయి.