DailyDose

ట్రంప్ ఓటమితో పండుగ చేసుకుంటున్న చైనా-తాజావార్తలు

China Celebrating Biden Win - Telugu Breaking News

* కర్నూలు జిల్లా నంద్యాలలో అబ్దుల్‌ సలాం కుటుంబం ఆత్మహత్య వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ సోమశేఖర్‌రెడ్డి, హెడ్‌ కానిస్టేబుల్‌ గంగాధర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇప్పటికే సీఐను సస్పెండ్‌ చేయగా.. తాజాగా ఆయనపై క్రిమినల్‌ కేసు నమోదు చేసినట్లు డీఐజీ వెంకట్రామిరెడ్డి తెలిపారు. కేసు దర్యాప్తు వేగవంతం చేయాలన్న సీఎం జగన్‌ ఆదేశాల నేపథ్యంలో ఐజీ శంకబ్రత బాగ్చి నంద్యాల చేరుకుని విచారణ చేపట్టారు. కొంతమంది కానిస్టేబుళ్లను ఆయన ప్రశ్నించారు. అబ్దుల్‌ సలాం ఆటోలో నగదు పోయినట్లు ఫిర్యాదు చేసిన భాస్కర్‌రెడ్డిని కూడా పోలీసులు ఆర్‌అండ్‌బీ అతిథిగృహానికి పిలిపించి వివిధ అంశాలపై ఆరా తీశారు.

* కర్నూలు జిల్లా నంద్యాలలో అబ్దుల్‌ సలాం కుటుంబం ఆత్మహత్యపై తెదేపా అధినేత చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. అబ్దుల్‌ కుటుంబం ఆత్మహత్యకు ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాలని ఆయన డిమాండ్‌ చేశారు. చేయని నేరం ఒప్పుకోవాలంటూ వేధించడంతోనే నిండు కుటుంబం బలైందని చంద్రబాబు మండిపడ్డారు. వైకాపా పాలనలో ముస్లింలపై వేధింపులు, అక్రమ కేసులు పెరిగాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరంలోనూ అత్యాచార నిందితులకు అధికార పార్టీ నేతలు అండగా నిలిచారని ఆరోపించారు. కేసు వెనక్కి తీసుకోవాలంటూ ముస్లిం బాలిక తండ్రిపై వైకాపా నేతలు ఒత్తిడి తేవడంతోనే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారని చెప్పారు. ముస్లింలపట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వీడాలని చంద్రబాబు హితవు పలికారు.

* అమెరికా అధ్యక్షుడిగా డెమొక్రాటిక్‌ అభ్యర్థి గెలుపొందడంతో ప్రపంచ దేశాలు ఆయనకు అభినందనలు తెలుపుతున్నాయి. కానీ, చైనా మాత్రం ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. అక్కడి అధికారిక మీడియా మాత్రం ట్రంప్‌ శకం ముగిసిందని పేర్కొంది. అంతేకాకుండా అమెరికా-చైనా దేశాల మధ్య క్షీణిస్తోన్న సంబంధాలను బైడెన్‌ తటస్థీకరిస్తారని ఆశాభావం వ్యక్తంచేసింది. వీటిని చూస్తే.. బైడెన్‌ గెలుపుతో చైనా ఊపిరి పీల్చుకున్నట్లే కనిపిస్తోంది. కొన్ని మీడియా సంస్థలు మాత్రం ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరికొంత కాలంపాటు కొనసాగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాయి.

* ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 76,663 కరోనా పరీక్షలు నిర్వహించగా 2,237 కొవిడ్‌ కేసులు నమోదు కాగా, 12 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,42,967కు చేరింది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. తాజాగా మరణించిన వారితో కలిపి రాష్ట్రంలో మరణాల సంఖ్య 6,791కి చేరింది. గడిచిన 24 గంటల్లో 2,256 మంది బాధితులు పూర్తిగా కోలుకోగా.. రాష్ట్రంలో మొత్తంగా 8,14,773 మంది కోలుకొని ఇళ్లకు వెళ్లిపోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 21,403 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 86,63,975 కరోనా సాంపుల్స్‌ను పరీక్షించినట్లు ఆరోగ్య శాఖ బులెటిన్‌లో వెల్లడించింది.

* అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అధ్యక్ష పదవిని మూడు కౌంటీలు శాసించాయి. ఈ కౌంటీల్లో లెక్కింపునకు ముందు ట్రంప్‌నకు ఆశలు ఉన్నా.. వాటిపై ఇవి నీళ్లు కుమ్మరించాయి. ఫలితంగా ఆయన మరో రెండు నెలల్లో శ్వేతసౌధాన్ని వీడాల్సిన పరిస్థితి నెలకొంది. నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిన అమెరికా ఎన్నికల కౌంటింగ్‌లో ఇక్కడి ఆధిక్యం ఆధారంగానే తుదిఫలితం వెలువడటం విశేషం. మధ్యలో వచ్చిన ఆధిక్యం కూడా చివరిలో కోల్పోయారు. ఫలితంగా ఈ మూడు రాష్ట్రాల్లో కలిపి 47 ఎలక్టోరల్‌ ఓట్లను వదులుకోవాల్సి వచ్చింది.

* భారత్‌లో కరోనా వైరస్ వ్యాక్సిన్‌ ఇప్పట్లో అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఒక వేళ వచ్చినా సాధారణ ప్రజానీకానికి చేరువయ్యేందుకు ఏడాదికి పైగా సమయం పడుతుందని దిల్లీ ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణదీప్‌ గులేరియా తెలిపారు. ఇండియా మార్కెట్‌లో వ్యాక్సిన్‌ అందరికీ లభించాలంటే 2022 దాటే అవకాశముందని ఆయన చెప్పారు. భారత్‌లో జనాభా ఎక్కువగా ఉన్నందున మరింత సమయం పట్టొచ్చన్నారు. వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉంటాయని విలేకరులు ప్రశ్నించగా.. దేశ జనాభాను దృష్టిలో ఉంచుకొని వీలైనంత త్వరగా అన్ని ప్రాంతాలకు వ్యాక్సిన్‌ సరఫరా చేయాలన్నారు. వ్యాక్సిన్‌ పంపిణీకి అనుకూలించేలా శీతల పరిస్థితులను కల్పిస్తూ.. సిరంజీలు, సూదులను పెద్దమొత్తంలో అందుబాటులో ఉంచాల్సిన అవసరముందన్నారు.

* వలసదారుల విషయంలో తాజాగా ఎన్నికైన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కాస్త ఉదారంగా వ్యవహరించే అవకాశం ఉన్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ మేరకు 1.1 కోట్ల మంది అనధికార వలసదార్లకు అమెరికా పౌరసత్వం కల్పించే విషయంపై తన కార్యాచరణకు ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఇదే జరిగితే దాదాపు ఐదు లక్షల మంది భారతీయులు లబ్ధి పొందుతారు. అలాగే ఏటా 95 వేల మంది శరణార్థుల్ని అనుమతించే అంశాన్నీ పరిగణనలోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు బైడెన్‌ ప్రచార బృందం విదేశాంగ విధానంపై ఓ విధాన పత్రాన్ని విడుదల చేసింది.

* కరోనా సమయంలో విద్యార్థులను బలవంతంగా ప్రభుత్వ పాఠశాలలకు రప్పించడం లేదని.. తల్లిదండ్రుల ఇష్టప్రకారమే హాజరుకావొచ్చని ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్‌ అన్నారు. విశాఖలో మీడియాతో ఆయన మాట్లాడారు. పాఠశాలల్లో కరోనా కేసులు పెరుగుతున్నందున ఈ సమయంలో విద్యార్థుల హాజరు తప్పనిసరి కాదని మంత్రి అభిప్రాయపడ్డారు. ఆన్‌లైన్‌ తరగతులు వినేందుకు అవసరమైన సాంకేతిక పరికరాలు, ఇంటర్నెట్‌ సౌకర్యం లేని పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని పాఠశాలలు ప్రారంభించామని మంత్రి చెప్పారు.

* విశ్రాంత ఐపీఎస్‌ అధికారి అనురాగ్‌ శర్మ పదవీకాలాన్ని రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. పోలీసు, శాంతిభద్రతలు, నేర నియంత్రణ సలహాదారుగా వ్యవహరిస్తున్న ఆయన పదవీకాలం పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాజా ఉత్తర్వులతో మరో మూడేళ్ల పాటు అనురాగ్‌ శర్మ ఈ పదవిలో కొనసాగుతారు.

* వరద సాయం పంపిణీని కొంతమంది రాజకీయం చేస్తున్నారని తెలంగాణ ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… విజ్ఞతతో వ్యవహరించాల్సిన సమయంలో భాజపా, కాంగ్రెస్‌ నేతలు బురద రాజకీయం చేస్తున్నారని విమర్శించారు.

* జమ్మూకశ్మీర్‌లోని మాచిల్‌ సెక్టార్‌ ప్రాంతంలో ఆదివారం భారత సైన్యం ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టింది. ముష్కరుల అక్రమ చొరబాటు యత్నాలను సైన్యం తిప్పికొట్టింది. సైన్యానికి, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో బీఎస్‌ఎఫ్‌ జవాను సుదీప్‌ కుమార్‌ వీరమరణం పొందారు. ఈ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ వద్ద శనివారం రాత్రి అనుమానాస్పద కదలికలు ఉన్నట్లు సమాచారం అందుకున్న భద్రతా బలగాలు నిఘా ఉంచాయి.

* ప్రభుత్వం అన్‌లాక్‌ మార్గదర్శకాల మేరకే చిన్నపిల్లలు, వృద్ధులకు శ్రీవారి దర్శనంపై నిర్ణయం తీసుకుంటామని తితిదే ఈవో కేఎస్‌ జవహర్‌రెడ్డి అన్నారు. తిరుమల అన్నమయ్య భవన్‌లో డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం నిర్వహించిన ఆయన ఫోన్‌ లో భక్తులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ.. కొవిడ్‌ కారణంగా తితిదే రద్దు చేసిన అర్జిత సేవల టికెట్ల స్థానంలో భక్తులకు డిసెంబరు చివరి వరకు బ్రేక్‌ దర్శనాలు కల్పిస్తున్నట్టు తెలిపారు.

* రాష్ట్రంలోని అన్ని కోర్టులు తెరిచేందుకు తెలంగాణ హైకోర్టు అనుమతించింది. ఈ మేరకు డిసెంబర్‌ 31 వరకు న్యాయస్థానాలు అనుసరించాల్సిన అన్‌లాక్‌ విధానాలను ఉన్నత న్యాయస్థానం వెల్లడించింది. హైదరాబాద్‌ మినహా మిగతా జిల్లాల్లో ఇప్పటికే భౌతికంగా కేసుల విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌ జిల్లాలోని సివిల్‌, క్రిమినల్‌ కోర్టులూ తెరవాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. మరోవైపు డిసెంబర్‌ 31 వరకు హైకోర్టులో ఆన్‌లైన్‌, భౌతిక విచారణ విధానమే కొనసాగించాలని నిర్ణయించింది. ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసుల విచారణ వేగవంతం చేయాలని స్పష్టం చేసింది. సీబీఐ, ఏసీబీ ప్రత్యేక కోర్టులు.. ఎంపీలు, ఎమ్మెల్యేల కేసుల ప్రత్యేక కోర్టులు ప్రస్తుతం అనుసరిస్తోన్న విధానాన్నే కొనసాగించాలని ఆదేశాలిచ్చింది. హైకోర్టు విధించిన గడువుకు కట్టుబడి విచారణ జరపాలంటూ హైకోర్టు రిజిస్ట్రార్‌ ఉత్తర్వులు జారీ చేశారు.