చార్ సౌ సాల్ కా షహర్ హైదరాబాద్. చార్మినార్‌పై ఎంతటి ప్రత్యేక ఆసక్తిని చూపేవారో.. ఇక్కడి టాంగాలపై, డబుల్ డెక్కర్ బస్సులపైనా ప్రజలు అంతటి ఆసక్తిని చూపించేవారు. డబుల్ డెక్కర్ బస్సులో ప్రయాణించాలని ఉవ్విళ్లూరేవాళ్లు. తాజాగా ఇదే విషయాన్ని ఓ నెటిజన్ ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్‌తో ట్విట్టర్ వేదికగా ప్రస్తావించడంతోపాటు, ఆ సర్వీసులను ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. నెటిజన్ ట్వీట్‌పై మంత్రి కేటీఆర్ స్పందించారు. డబుల్ డెక్కర్ బస్సులతో తనకూ అనేక జ్ఞాపకాలున్నాయని, అబిడ్స్‌లోని సెయింట్ జార్జి గ్రామర్ స్కూల్‌కు వెళ్లే దారిలో కనిపించేవని నెమరువేసుకున్నారు. ఆ బస్సు సర్వీసులను ఎందుకు నిలిపేశారో స్పష్టంగా తెలియదని, ప్రస్తుతం వాటిని తిరిగి తీసుకువచ్చే ఉద్దేశం ఏమైనా ఉందా? అంటూ రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు కేటీఆర్ ట్వీట్ చేశారు. దీనిపై వెంటనే స్పందించిన మంత్రి డబుల్ డెక్కర్ బస్సులను తిరిగి ప్రవేశపెట్టేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని చెప్పారు.
*** ఇదీ డబుల్ డెక్కర్ బస్సుల ప్రస్థానం
1932లో నిజాం రోడ్డు రవాణా సంస్థ ఏర్పాటయింది. హైదరాబాద్ స్టేట్‌లో బస్సు సర్వీసులను ప్రారంభించింది. ఆ తర్వాత 1942లో హైదరాబాద్‌లో ఆల్విన్ మెటల్ వర్క్స్ లిమిటెడ్ కంపెనీని స్థాపించారు. ఇది స్టీల్, ఇతర ఫర్నిచర్‌ను ఉత్పత్తి చేసేది. అందులో ప్రత్యేకంగా బస్సుల బాడీలను కూడా తయారు చేసేవారు. నిజాం రోడ్డు రవాణా సంస్థలోని బస్సులను ప్రముఖంగా ఇదే కంపెనీ తయారు చేసేది. అలా 1964లో మొదటి సారిగా లండన్ కంపెనీలైన పార్క్ రాయల్ వెహికిల్స్ లిమిటెడ్, ప్రెస్ స్టీల్ కంపెనీ లిమిటెడ్ సాంకేతిక సాయంతో డబుల్ డెక్కర్ బస్సులను కూడా తయారు చేయడం ప్రారంభించింది. ఆ సంవత్సరంలోనే బస్సులను హైదరాబాద్‌లో ప్రవేశపెట్టారు. అప్పటి వరకు ఆ విధానం హైదరాబాద్, పశ్చిమబెంగాల్‌లో మినహా దేశంలో మరెక్కడా లేకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే డబుల్ డెక్కర్ బస్సులపై ప్రజలు ఆసక్తి చూపేవారు. హైదరాబాద్‌ను సందర్శించిన ప్రతి ఒక్కరూ ఆ రోజుల్లో ఆ బస్సులో తిరిగేందుకు ఉత్సాహం చూపేవారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వలసపాలకుల నిర్లక్ష్యం వల్ల ఆల్విన్ కంపెనీ నష్టాల బారిన పడింది. దీంతో 1994 నాటికి మూసివేత దశకు చేరుకుంది. డబుల్ డెక్కర్ బస్సుల తయారీని కూడా నిలిపివేయడంతో ఆ సర్వీసులను ఆర్టీసీ సంస్థ రద్దు చేసింది. ఇప్పటికీ రెండు దశాబ్దాలు గడిచినా డబుల్ డెక్కర్ బస్సు సర్వీసుల జ్ఞాపకాలు ప్రయాణికుల మనోఫలాకాల నుంచి చెదిరిపోకపోవడం విశేషం.