తుంగభద్రమ్మ చెంతలో పుష్కరుడు తేదీ.20.11.2020 (శుక్రవారము) నాడు చేరి తేదీ.01.12.2020 (మంగళవారము) వరకు ఉంటున్నాడు. జీవనదిగా పేరున్న “తుంగభద్రమ్మ ” పుష్కరాలకు ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయి.
భారతదేశపు పశ్చిమ కనుమలలో పుట్టి తూర్పు దిశగా ప్రవహిస్తూ కర్ణాటక రాష్ట్రములోని సహ్యాద్రి పర్వతముల మీదుగా ప్రవహించి “గంగ మూల” వద్ద మొదటగా తుంగ, భద్ర లు రెండు వేరు వేరు నదులుగా పేరొంది అక్కడ నుండి తూర్పు దిశగా ప్రవహిస్తూ కర్ణాటక రాష్ట్రంలో ” కూడలి ” వద్ద ఒకటిగా కలిసి ” తుంగభద్ర నదిగా ” రూపాంతరము చెంది శృంగేరి , హౌస్ పేట్(తుంగభద్ర) రిజర్వాయర్లలో మజిలీ చేసి హంపి మీదుగా ప్రవహిస్తూ బళ్ళారి జిల్లాలో ప్రవహించే ” హగరి ” నదిని కలుపుకొని అక్కడి నుండి 250 కిలోమీటర్లు ప్రవహించి , కర్నూలు జిల్లా ఆదోని డివిజన్ లోని కౌతాళం మండలము ” నదిచాగి ” అనే గ్రామము నుండి ఆంధ్రప్రదేశ్ లోకి అడుగు పెట్టింది.
అక్కడనుండి రామాపురం, మంత్రాలయం, నాగలదిన్నె ,గురజాల, సంఘాల, గుండ్రేవుల , ఈర్లదిన్నె, కే సింగవరం, ” కొత్తకోట రాఘవేంద్ర స్వామి మరియు గుంటి రంగస్వామి దేవాలయముల సమీపములో ” నుండి సాగుతూ ” సుంకేసుల (కోట్ల విజయభాస్కర్ రెడ్డి) రిజర్వాయర్లో ” సేదతీరి ఆర్. కొంతలపాడు, జి సింగవరం, మామిదాల పాడు, కర్నూలు నగరముల మీదుగా ప్రవహించి ” అలంపూర్ క్షేత్రానికి ” ఆరు కిలోమీటర్ల దూరములో ” సంగమము ” వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది.ఈ నది మొత్తము ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ సరిహద్దులలో దాదాపు 85 మైళ్ళ దూరము పప్రవహించుచున్నది.
తుంగభద్రా నది ” అతి ప్రాచీనమైన మహానది. అత్యంత పురాతనమైనది అని చెప్పవచ్చు. ఇందుకు రామాయణ కాలముకంటే ముందుగానే నదీ ఉండేదిని చెప్పడానికి ఆధారాలున్నాయి.
వాల్మీకి రామాయణములో ” శ్రీరాముడు ” సీతాన్వేషణ చేస్తూ సుగ్రీవునితో చెలిమి చేసిన ” ఋష్యమూక పర్వతము ” తుంగభద్రా నది తీరంలోని నేటి ” హంపి క్షేత్రములో ” ఉన్నది. రామాయణములో పేర్కొన్నందున తుంగభద్రా నది రామాయణ కాలముకంటె ముందునుంచే ఉన్నట్లు మనకు స్పష్టమవుతున్నది.
తుంగభద్రా నది పరివాహక ప్రాంతములో అనేక ” ఔషధ లక్షణములు ” గల వృక్షములు ఉన్నాయని ఈ వృక్షముల మీదుగా ప్రవహించిన నీరు ఔషధ లక్షణాలను కలిగి ఉన్నదని చెబుతారు. ఉత్తరాదిన స్నానమునకు ” గంగ ” ఎంత ముఖ్యమైనదో, పవిత్రమైనదో దక్షిణమున “తుంగ ” అంతటి ముఖ్యమైన, ఔషధ లక్షణములుగల నీరు కలిగినదని ప్రఖ్యాతి పొందినది.
అందువలననే ” గంగా స్నానము తుంగా పానము ” అనబడే నానుడి పుట్టినది.
భారత కాలమానము ప్రకారము దేశము లోని 12 ముఖ్యమైన నదులకు పుష్కరాలు బృహస్పతి ఆయా రాశుల్లో ప్రవేశించిన సమయములో వస్తాయి. బృహస్పతి ఆయా రాశుల్లో ఉన్నంతకాలము ఆ నదిలో పుష్కరము ఉన్నట్లు లెక్క. ఒక సంవత్సర కాలముపాటు ఆయా రాశుల్లో ఉండటము జరుగుతుంది. ఆ సందర్భాల్లో ప్రవేశించిన మొదటి 12 రోజులు ఆది పుష్కరాలుగాను, సంవత్సరములోని చివరి 12 రోజులను అంత్య పుష్కరాలుగాను పిలుస్తారు. మొదటి, చివరి 12 రోజులు ఎంతో ప్రత్యేకమైన రోజులుగా పరిగణించడము జరుగుతున్నది.