DailyDose

వీరజవాన్ కుటుంబానికి ₹50లక్షలు-తాజావార్తలు

Breaking News - YS Jagan Govt Issues 50Lakhs To Soldier Praveen's Family

* జమ్మూ కశ్మీర్‌ కుప్వారా జిల్లాలోని నియంత్రణ రేఖ వెంట ఎదురు కాల్పులలో వీర మరణం పొందిన హవాల్దార్‌ సీహెచ్‌ ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.50 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించింది. చిత్తూరు జిల్లా ఐరాల మండలం రెడ్డివారిపల్లెకు చెందిన ప్రవీణ్‌కుమార్‌ రెడ్డి గత 18 ఏళ్లుగా భారత సైన్యంలోని మద్రాస్‌ రెజిమెంట్‌లో పని చేస్తున్నారు. ప్రస్తుతం జమ్మూ కశ్మీర్‌లోని మాచిల్‌ సెక్టార్, నియంత్రణ రేఖ వద్ద విధులు నిర్వర్తిస్తుండగా,  ఉగ్రవాదులు కాల్పులకు తెగపడడంతో ప్రవీణ్‌కుమార్‌రెడ్డి వీర మరణం పొందారు. 

* ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతంలో రెండు రాష్ట్రాల ప్రజలకు ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి జనసేన పక్షాన సహకరించాలని ఆ పార్టీ అధినేత పవన్ ‌కల్యాణ్​ను ఒడిశాలోని పర్లాఖెముండి ఎమ్మెల్యే, గజపతి జిల్లా భాజపాఅధ్యక్షుడు కోడూరు నారాయణరావు కోరారు. సోమవారం హైదరాబాద్‌లో పవన్​ను​ ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు.

* పంచాయతీ ఎన్నికలు జరపాలంటూ న్యాయవాది తాండవ యోగేష్ దాఖలు చేసిన పిటిషన్​పై హైకోర్టు విచారణ జరిపింది.ఎస్​ఈసీ దాఖలు చేసిన అఫిడవిట్‌ను కోర్టు రికార్డులోకి ఎక్కించాలని రిజిస్ట్రార్​ను హైకోర్టు ఆదేశించింది.సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పెండింగ్​లో ఉందని కోర్టుకు తెలిపిన ఏజీ వచ్చే మంగళవారం విచారణకు వచ్చే అవకాశం ఉందని వివరించారు.నిర్ణయం వచ్చే వరకు సమయం ఇవ్వాలని ఏజీ ధర్మాసనాన్ని కోరారు. దీంతో న్యాయస్థానం తదుపరి విచారణను వాయిదా వేసింది.

* 328వ రోజుకి చేరుకున్న రాజధాని గ్రామాల రైతులు, మహిళల నిరసనలు- మందడం, నెల్లూరు, తుళ్లూరు, వెలగపూడి తదితర గ్రామాల్లో కొనసాగుతున్న రైతుల ఆందోళనలు- రాజధానిగా అమరావతి కొనసాగుతుందని ప్రభుత్వం ప్రకటన చేసే వరకు ఆందోళనలు కొనసాగిస్తామంటున్న రాజధాని రైతులు- కరోనా సూచనలు పాటిస్తూ కొనసాగుతున్న అమరావతి ఉద్యమం

* కాశ్మీర్ కాల్పుల్లో ఐరాల – రెడ్డి వారి పల్లి వీర జవాన్ మృతి.చిత్తూరు జిల్లా, ఐరాల మండలం, రెడ్డి వారి పల్లి కి చెందిన చీకల ప్రవీణ్ కుమార్ రెడ్డి (37) మృతి.కాశ్మీర్ లో ఆదివారం మధ్యాహ్నం జరిగిన కాల్పులలో వీరమరణం.ఆయనకు భార్య, రజిత కుమార్తె, కుమారుడు.రెడ్డి వారి పల్లి గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

* రాష్ట్రంలో క్రమంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతుండడంతో చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. రాష్ట్రంలో ఈశాన్య గాలులు తక్కువ ఎత్తులో వీస్తుండడంతో కనిష్ట ఉష్ణోగ్రతల్లో మార్పులొస్తున్నాయి. కోస్తా, రాయలసీమల్లో రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నాయి.

* కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన అబ్దుల్‌ సలాం కుటుంబం ఆత్మహత్య కారకులపై వెంటనే చర్యలు తీసుకున్నామని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతమ్‌సవాంగ్‌ తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడైనా పోలీసుల నుంచి వేధింపులు ఎదురైతే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని హోంమంత్రి సూచించారు. అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. పోలీసులు ఎవరైనా అత్యుత్సాహం ప్రదర్శిస్తే సహించబోమని సుచరిత హెచ్చరించారు.

* యావత్‌ ప్రపంచం ఎంతగానో ఎదురుచూస్తోన్న కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌పై తయారీ సంస్థలు మరికొంత పురోగతి సాధించాయి. ఇప్పటికే చాలా వ్యాక్సిన్‌లు తుది దశ ప్రయోగాల్లో ఉండగా, వీటిలో ఫైజర్-బయోఎన్‌టెక్‌ సంస్థలు కలిసి అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ 90శాతం ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు తేలింది. సురక్షిత, సమర్థత కలిగిన వ్యాక్సిన్‌ను అందించడంలో కీలక దశను పూర్తి చేసుకున్నామని తాజాగా ఫైజర్‌ యాజమాన్యం పేర్కొంది.

* దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకునే దీపావళి పర్వదినం సందర్భంగా స్థానికంగా తయారయ్యే ఉత్పత్తులకే ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దేశీయ ఉత్పత్తులకే ప్రాధాన్యత ఇవ్వాలనే నినాదంతో చాలారోజుల నుంచి ప్రధాని ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా పండుగ సందర్భంగా దేశీయ ఉత్పత్తులకు ఊతమిచ్చేందుకు వాటిని ఖరీదు చేయాలని ప్రధాని దేశ ప్రజలను కోరారు.

* టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీకి బీసీసీఐ పితృత్వపు సెలవులను మంజూరు చేసింది. ఆస్ట్రేలియాతో తొలి టెస్టు తర్వాత అతడు భారత్‌కు తిరిగొస్తాడని తెలిపింది. తొడ కండరాల గాయం వల్ల తొలుత ఎంపికవ్వని రోహిత్ ‌శర్మను టెస్టు జట్టులోకి తీసుకుంది. కోహ్లీ సతీమణి అనుష్క శర్మ 2021, జనవరిలో ప్రసవించే అవకాశం ఉంది. కాన్పు సమయంలో ఆమె చెంతనే ఉండాలనే ఉద్దేశంతో విరాట్‌ సెలవులు తీసుకున్నాడు.

* సినీ నటుడు రాజశేఖర్‌ కరోనాను జయించారు. తాజాగా చేసిన పరీక్షల్లో నెగెటివ్‌ రావడంతో సినీ న్యూరో సెంటర్‌ ఫర్‌ సర్వీస్‌ నుంచి ఆయనను వైద్యులు డిశ్చార్జి చేశారు. తన సతీమణి జీవితతో కలిసి రాజశేఖర్‌ దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. గత కొన్ని రోజుల కిందట రాజశేఖర్‌ కరోనా బారిన పడగా, చికిత్స నిమిత్తం సిటీ న్యూరో సెంటర్‌ ఫర్‌ సర్వీస్‌లో చేరారు.

* దేశంలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో పలు నగరాలు బాణసంచా విక్రయాలు, పేల్చడాన్ని నిషేధిస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలో ముంబయి కూడా చేరింది. మహమ్మారిని నియంత్రించడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బృహత్‌ ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌(బీఎంసీ) వివరించింది. అయితే నవంబర్‌ 14న లక్ష్మీపూజ సందర్భంగా స్వల్ప స్థాయిలో పొగ విడుదలయ్యే కాకరపువ్వొత్తుల వంటి చిన్న చిన్న పటాకులను కాల్చేందుకు అనుమతించింది.

* కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన అబ్దుల్‌సలాం కుటుంబం ఆత్మహత్య కేసులో అరెస్టయిన సీఐ సోమశేఖర్‌ రెడ్డి, హెడ్‌ కానిస్టేబుల్‌ గంగాధర్‌కు న్యాయస్థానం బెయిల్‌ మంజూరు చేసింది. నిందితులపై 303, 506, 509, 306 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. నిందితుల తరఫున సీనియర్‌ న్యాయవాదులు కేసును వాదించారు. ఈ కేసులో సెక్షన్‌ 306 వర్తించదని కోర్టు దృష్టికి తీసుకెళ్లగా న్యాయమూర్తి ఆ సెక్షన్‌ను తొలగించారు.

* యూఎస్ అధ్యక్ష ఎన్నికల్లో విజేతగా నిలిచిన డెమొక్రాటిక్ అభ్యర్థి జోబైడెన్‌ను అభినందించేందుకు సోమవారం చైనా నిరాకరించింది. ఎన్నికల్లో ఇంకా తుదినిర్ణయం వెలువడకపోవడమే అందుకు కారణంగా వెల్లడించడం గమనార్హం. ‘మా అవగాహన ప్రకారం ఎన్నికల ఫలితాలను అమెరికా చట్టాలు, విధానాలకు అనుగుణంగా నిర్ణయిస్తారు’ అని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్‌బిన్ మీడియాకు వెల్లడించారు.

* నిర్దేశిత అంతర్జాతీయ ప్రమాణాల అమలులో విఫలమైన పాక్‌ వైమానిక సేవలపై.. 188 ప్రపంచ దేశాలు వేటువేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. పాక్‌లో చోటుచేసుకున్న లైసెన్సు కుంభకోణం నేపథ్యంలో పాకిస్థాన్‌‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌లైన్స్‌ (పీఐఏ)ను బ్రిటన్‌, యూరోపియన్‌ యూనియన్‌ దేశాలు ఇప్పటికే నిషేధించిన సంగతి తెలిసిందే.

* ఏపీ ప్రభుత్వం కరోనా బులెటిన్‌ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో 61,050 నమూనాలను పరీక్షించగా 1,392 మందికి కొవిడ్‌ నిర్ధారణ అయినట్లు వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,44,359కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 11 మంది కొవిడ్‌ చికిత్స పొందుతూ మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 6,802కి చేరింది.