విద్యాబాలన్ ప్రధాన పాత్రలో నటించిన లఘు చిత్రం ‘నట్‌ఖట్’ అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. ఈ ఫిల్మ్ 2020 ఏడాదికి గానూ భారతీయ లఘు చిత్ర పురస్కారాల్లో విజేతగా నిలిచింది. ఈ విజయంతో.. ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డుల పరిశీలనకు నేరుగా అర్హత సాధించింది. ఈ విషయాన్ని విద్యాబాలన్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులకు తెలియజేస్తూ.. తన ఆనందాన్ని పంచుకుంది. ‘‘ఇప్పుడు నాకు చంద్రుడిపై ఉన్నట్లుగా.. ఎంతో గర్వంగా ఉంది. నేను భాగమైన ‘నట్‌ఖట్’.. 3వ భారతీయ లఘు చిత్ర పురస్కారాల్లో విజేతగా నిలిచింది. అంతేకాదు.. ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డుకు అర్హత సాధించింది’’ అని తన పోస్ట్‌లో రాసుకొచ్చింది విద్య. పితృస్వామ్య పోకడలు, లింగ వివక్ష, గృహ హింసకు వ్యతిరేకంగా దర్శకుడు షాన్ వ్యాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో విద్యాబాలన్.. సోనూ అనే ఆకతాయి బాలుడికి తల్లిగా నటించారు. ఆమె ఈ చిత్రాన్ని రోనీతో కలిసి స్వయంగా నిర్మించడం మరో విశేషం.
భేష్ బాలన్!
Related tags :