Kids

గజ్జలేశర్!

గజ్జలేశర్!

ప్రాచీన కాలం నుంచీ కొన్ని ప్రాంతాలు ఏదో ఒక కళకు ప్రత్యేకంగా నిలవడం వింటూనే ఉంటాం. అలానే ఉత్తర్‌ప్రదేశ్‌లోని ‘ఎటా’ జిల్లా, జలేసర్‌ పట్టణం మువ్వల తయారీకి పేరుగాంచింది. ఇక్కడి గజ్జెలు మనదేశంతో పాటు, సింగపూర్‌, మలేషియా, కంబోడియా, సౌదీ అరేబియా, జోర్డాన్‌, యూఏఈ, ఇరాక్‌, దక్షిణాఫ్రికా లాంటి దేశాలకూ ఎగుమతి అవుతున్నాయి. కూచిపూడి, భరతనాట్యం, కథాకళి… ఇలా ఏ నాట్యానికైనా కాలికి గజ్జె కట్టాల్సిందే. అయితే ఆ మువ్వల తయారీకి వాడే నాణ్యమైన ఇత్తడిని బట్టీ తయారీదారుల నైపుణ్యాన్ని బట్టీ గజ్జెల శబ్దం మారుతుందట. జలేసర్‌లో మువ్వల్ని చెయ్యడానికి వాడే నాణ్యమైన ఇత్తడి, తెల్లటి పొడి, మట్టి… విరివిగా దొరుకుతాయి. అందుకే, అక్కడ గజ్జెలూ, గంటల తయారీ కళ ఎన్నో ఏళ్ల కిందటే పురుడు పోసుకుంది. స్థానికంగా పదివేలమందికి పైగా కార్మికులు ఈ రంగంలో ఉపాధి పొందుతున్నారు. ఏటా ఎన్నో కోట్ల వ్యాపారం జరుగుతోందంటేనే జలేసర్‌ మువ్వలకు ఎంత ప్రత్యేకత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ‘ఒక జిల్లా ఒక ఉత్పత్తి పథకం’ కింద ఈ కళను ఎంపిక చెయ్యడంతో పాటు రూ.350 కోట్ల నిధులను కార్మికులకు లోన్లుగా ఇచ్చిందట. మువ్వలే కాదు, కాశీ, మధుర, అయోధ్య… ఇంకా పేరు పొందిన ఎన్నో ఆలయాల్లో జలేసర్‌లో తయారైన గంటలు మోగుతుంటాయి.