Business

ఆర్థిక మాంద్యంలోకి ఇండియా-వాణిజ్యం

Business News - India Into Financial Crisis

* దేశ చరిత్రలోనే తొలిసారిగా భారత్‌ ఆర్థిక మాంద్యంలోకి అడుగుపెట్టబోతోంది. కొవిడ్‌ మహమ్మారి కారణంగా వరుసగా రెండో త్రైమాసికంలోనూ జీడీపీ వృద్ధిరేటు క్షీణించిందని…..దానర్థం భారత ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుకుందని ఆర్‌బీఐలోని నిపుణులు అభిప్రాయపడ్డారు.

* వరుస లాభాల్లో పయనిస్తున్న దేశీయ స్టాక్‌ మార్కెట్ల దూకుడుకు బ్రేక్‌ పడింది. బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ షేర్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కోవడంతో మార్కెట్లు నష్టాలు చవిచూశాయి. ‘ఆత్మనిర్భర్‌ భారత్‌ 3.0’ పేరిట కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కొన్ని ఉద్దీపన చర్యలు ప్రకటించినప్పటికీ మార్కెట్లపై దాని ప్రభావం పెద్దగా కనిపించలేదు. దీంతో 8 రోజులుగా లాభాల్లో పయనిస్తూ కొత్త రికార్డులు నెలకొల్పిన సూచీలకు అడ్డుకట్ట పడినట్లయ్యింది.

* కొవిడ్‌ సంక్షోభంతో కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థ క్రమంగా కోలుకుంటోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజం కలిగించేందుకు మరో ఉద్దీపన ప్రకటించనున్న నేపథ్యంలో కేంద్రం ప్రవేశపెట్టిన పథకాల గురించి కేంద్రమంత్రి ప్రస్తావించారు.

* కిశోర్‌ బియానీకి చెందిన ఫ్యూచర్‌ రిటైల్‌(ఎఫ్‌ఆర్‌ఎల్‌)కు వ్యతిరేకంగా సింగపూర్‌ ఆర్బిట్రేటర్‌(ఎస్‌ఐఏసీ) జారీ చేసిన ఆదేశాలు చెల్లుబాటు కలిగినవేనని.. అందువల్ల వాటి గురించి నియంత్రణ సంస్థలకు సమాచారం ఇవ్వడం తమ హక్కు అని దిల్లీ హైకోర్టుకు అమెజాన్‌ విన్నవించింది. సింగపూర్‌ ఆర్బిట్రేటర్‌ మధ్యంతర ఉత్తర్వుల ఆధారంగా రిలయన్స్‌ రిటైల్‌తో కుదుర్చుకున్న రూ.24,713 కోట్ల ఒప్పందంలో జోక్యం చేసుకుంటోందంటూ ఎఫ్‌ఆర్‌ఎల్‌ చేసిన విజ్ఞప్తిపై కోర్టు విచారణ జరుపుతోంది. ఈ నేపథ్యంలోనే న్యాయమూర్తి ముక్తా గుప్తా ముందు అమెజాన్‌ తన వివరణ ఇచ్చింది. ఎఫ్‌ఆర్‌ఎల్‌ దాఖలు చేసిన దావా ‘సందేహాస్పదం’గా ఉందని.. కోర్టులో నిలిచే దావాలా కనిపించడం లేదని అమెజాన్‌ తరఫు న్యాయవాది గోపాల్‌ సుబ్రమణియమ్‌ పేర్కొన్నారు. అక్టోబరులోనే ఆదేశాలు అందుకున్నా, ఇప్పటిదాకా ఎఫ్‌ఆర్‌ఎల్‌ వేచిచూసిందని పేర్కొన్నారు.

* భారత్‌లో కొవిడ్‌-19 కేసుల సంఖ్య 87 లక్షలకు చేరువ కానుంది. ఈ విధంగా ప్రబలుతున్న మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు వ్యాక్సిన్‌ ఒక్కటే సమీప పరిష్కారమని పలువురు భావిస్తున్నారు. ఇందుకు గాను వ్యాక్సిన్‌ తయారీలో ముందంజలో ఉన్న వివిధ జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నట్టు ఆరోగ్య శాఖ సెక్రటరీ రాజేశ్‌ భూషణ్‌ ప్రకటించారు. అందరికీ కొవిడ్‌ టీకాను అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్రానికి స్పష్టమైన ప్రణాళిక ఉందని ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలో స్విట్జర్లాండుకు చెందిన ‘క్రెడిడ్‌ సూస్సీ’ అనే ఆర్థిక సేవల సంస్థ అధ్యయనంలో పలు ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి.

* హోటల్‌ రంగంపై కొవిడ్‌ ప్రభావం అధికంగా ఉంది. జనవరి-సెప్టెంబరులో సగటున ఒక్కో గదిపై వచ్చే అద్దె ఆదాయం 2019 ఇదే సమయంతో పోలిస్తే 53 శాతం క్షీణించిందని ప్రోపర్టీ కన్సల్టెంట్‌ జేఎల్‌ఎల్‌ ఇండియా తెలిపింది. జేఎల్‌ఎల్‌ నివేదిక ప్రకారం.. భారత్‌లోని అన్ని కీలక 11 మార్కెట్లలో జులై-సెప్టెంబరులో ఒక్కో గదిపై వచ్చే సగటు ఆదాయ గణాంకాలు డీలా పడ్డాయి. బెంగళూరులో ఈ ఆదాయాలు క్రితం ఏడాది క్రితంతో పోలిస్తే ఏకంగా 88.1 శాతం మేర తగ్గాయి. ‘వ్యాపారాలు, పర్యటనలకు అనువుగా ఉండే ప్రాంతాల్లో హోటల్‌ పరిశ్రమకున్న అవకాశాలపై పెట్టుబడుదార్లు ఇపుడిపుడే దృష్టి సారిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ అన్‌లాక్‌ అవుతుండడంతో గిరాకీ క్రమంగా పెరుగుతుందని..ముఖ్యంగా పర్యాటక ప్రాంతాల్లో వారాంతాల్లో గదుల భర్తీ పుంజుకుంటుంద’ని జేఎల్‌ఎల్‌ ప్రతినిధి అభిప్రాయపడ్డారు. ముంబయిలో ఒక్కో గదికి వచ్చే ఆదాయాలు గతంతో పోలిస్తే 71.7 శాతం తగ్గినా.. సగటు ఆదాయాల్లో అగ్రస్థానంలోనే ఉంది. పుణె(86.2%), కోల్‌కతా(82.6%), గోవా(78.8%)లలో కూడా ఆదాయాలు బాగా తగ్గాయి.