గత దశాబ్దకాలంలో సామాజిక పరిస్థితుల్లో ఎంతో మార్పు.. అందులో భాగంగా ఆడపిల్లల సగటు వివాహ వయసు కూడా పెరిగింది. పదేళ్ల క్రితం వరకు ఎక్కువమందికి 18-20 ఏళ్ల మధ్యలోనే వివాహాలు జరగ్గా, ఇప్పుడు చాలామంది 21 ఏళ్ల తర్వాతే పెళ్లి చేసుకుంటున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన 2019-20 గణాంకాలు వెల్లడించాయి. ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2006లో 10.2% మంది ఆడపిల్లలకు 18 ఏళ్లలోపే వివాహాలు జరిగేవి. ఇది జాతీయ సగటు (9.1%) కంటే ఎక్కువ. ఇప్పుడు ఆ వయసులోపు జరిగే వివాహాలు 1.9%కి తగ్గిపోయాయి. కాలానుగుణంగా పరిస్థితుల్లో వచ్చిన మార్పే ఇందుకు ప్రధాన కారణం. తల్లిదండ్రుల ఆలోచనలు మారడం, ఆడపిల్లల చదువు, కెరీర్‌కి ప్రాధాన్యం ఇవ్వడం, పిల్లలు తమ అభిప్రాయాలను తల్లిదండ్రులతో చెప్పే స్వేచ్ఛ పెరగడం, చదువు కోసం దేశ, విదేశాలకు వెళ్తుండడం, జీవితంలో స్థిరపడ్డాకే పెళ్లికి సుముఖత చూపడంలాంటి కారణాలవల్ల ఆడపిల్లల సగటు వివాహ వయసు పదేళ్లలో గణనీయంగా పెరిగింది. 2006లో దేశవ్యాప్తంగా వివాహం జరిగే నాటికి యువతుల సగటు వయసు 20.5 ఏళ్లు ఉండగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 19.5 ఏళ్లే ఉండేది. ఇప్పుడు తెలంగాణలో ఆడపిల్లల వివాహ సగటు వయసు 22 ఏళ్లకు చేరింది. గ్రామీణ మహిళల సగటు వయసు 19.2 నుంచి 21.6 ఏళ్లకు పెరగగా, పట్టణ ప్రాంతాల్లోనివారి వయసు 20.6 నుంచి 22.8 ఏళ్లకు చేరింది. కేంద్ర ప్రభుత్వం మహిళల కనీస వివాహ వయసుపై అధ్యయనం చేయడానికి కమిటీ వేసిన నేపథ్యంలో ఈ గణాంకాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
ఏపీ అమ్మాయిల లేటు పెళ్లిళ్లు
Related tags :