Movies

తప్పుల్లేవు…అందుకే విజయాలు

తప్పుల్లేవు…అందుకే విజయాలు

‘‘నా సినీ ప్రయాణంలో దొర్లిన తప్పులు తక్కువే. మా అమ్మానాన్నల మార్గదర్శనమే అందుకు ప్రధాన కారణం’’ అంటోంది కీర్తి సురేష్‌. దక్షిణాదిలో విజయవంతమైన నాయికల్లో కీర్తి ఒకరు. ఆమె ప్రస్తుతం బాలీవుడ్‌పై దృష్టిపెట్టింది. సినిమా కుటుంబంలో పుట్టడం మీకు ఎంతవరకు కలిసొచ్చిందని అడిగితే… ‘‘మా అమ్మానాన్నలు సినీ పరిశ్రమకి చెందినవాళ్లు కాకపోయుంటే నేను కథానాయికని అయ్యేదాన్నే కానేమో. నటిగా మా అమ్మ ప్రయాణాన్ని చూస్తూనే పెరిగాను. ఆమె అనుభవాలు నా ఎదుగుదలకి దోహదం చేశాయి. అందుకే చాలామంది నాయికలు చేసిన తప్పుల్ని నేను చేయలేదు. ఆ రోజుల్లో సాంకేతిక సదుపాయాలు లేకుండానే గొప్ప ప్రతిభని చూపారు. అమ్మతో మాట్లాడుతున్నప్పుడు అప్పటి సంగతులన్నీ ఆశ్చర్చంగా అనిపించేవి. వాళ్లతో పోలిస్తే ఇప్పుడు నటించడం సులభమైంది. ఇన్ని వనరులు ఉన్నప్పుడు మేం నటన పరంగా మరింత ప్రభావం చూపించాలి కదా. ఆ విషయం నాకెప్పుడూ దృష్టిలో ఉంటుంద’’ని చెప్పింది కీర్తి.