భారత స్వాతంత్య్ర ఉద్యమకారుడు , భూదానోద్యమకారుడు ,.
భారతరత్న ఆచార్య వినోబా భావే
బహుశా ఇప్పటి తరంలో చాలా తక్కువ మంది విని ఉంటారేమో ఈ మహాశయుని పేరు .
11-9-1895 న మహారాష్ట్ర లోని కొంకణ్ ప్రాంతం లోని గగోజీ అనే చిన్న గ్రామంలో జన్మించారు . పిన్నవయసులోనే భగవద్గీత చదివి బాగా ప్రభావితులైనారు . మహాత్మాగాంధీ ప్రేరణతో , చదువును వదిలేసి స్వాతంత్య్ర ఉద్యమంలోకి వెళ్ళిపోయారు . 1916 జూన్ లో మొదటిసారి గాంధీజీ ని అహ్మదాబాద్ లోని కొచ్రాబ్ ఆశ్రమంలో కలిసారు .
1921 ఏప్రిల్ లో గాంధీజీ ఆదేశాల మేరకు వార్ధా లోని శబర్మతి ఆశ్రమానికి చేరి , ఆశ్రమ కార్యక్రమాల బాధ్యతను చేపట్టారు . 1925 లో కేరళ రాష్ట్రం లోని వైకోం లో హరిజనుల ఆలయ ప్రవేశాన్ని పర్యవేక్షణ చేయటానికి గాంధీజీ వినోబా భావే ని పంపారు .
1920 , 1930 దశకాల్లో పలుమార్లు జైలుకు వెళ్ళారు . 1940 లో అయిదు సంవత్సరాలు జైలు శిక్షను అనుభవించారు . వెల్లూరు జైల్లో ఉన్న సమయంలో నాలుగు దక్షిణ భారత భాషలను నేర్చుకుని , లోక నాగరి అనే నూతన లిపిని తయారుచేసారు .
ముఖ్యంగా ఆయన సర్వోదయ , భూదాన ఉద్యమాల ద్వారా ప్రజలకు తెలిసారని చెప్పవచ్చు . 1951 ఏప్రిల్ లో ఆం.ప్ర లోని పోచంపల్లి వద్ద నుండి భూదాన ఉద్యమానికి ప్రారంభించారు . అలా సేకరించిన భూమిని భూములు లేని పేదవారికి పంచారు .
భగవద్గీతను మరాఠీ భాషలోకి అనువదించారు . Essence of Quran , The Essence of Christian Teachings , Thoughts of Education , Swarajya Sastra వీరు రచించిన గ్రంధాలు . ఝార్ఖండ్ రాష్ట్రంలో హజీరాబాగ్ జిల్లాలో వినోబా భావే యూనివర్సిటీ నెలకొల్పబడింది .
ఆయన తన చివరి రోజుల్ని మహారాష్ట్ర లోని వార్ధా జిల్లాలోనే పౌనార్ లో తాను స్థాపించిన బ్రహ్మ విద్యా మందిర్ లోనే గడిపారు . జైన మతానుసారం సమాధి మరణాన్ని 15-11-1982 న అంటే ఈరోజు స్వర్గస్తులైనారు . రామన్ మెగసేసే పురస్కారాన్ని 1958 లో పొందిన మొదటి వ్యక్తి . ఆయన మరణానంతరం 1983 లో భారతరత్న పురస్కారం ప్రదానం చేయబడింది .