Business

చైనాను నిధుల కోసం యాచించనున్న పాకిస్థాన్-వాణిజ్యం

Business News - Pakistan To Beg China For 2Billion Funds

* పాకిస్థాన్‌ మరోసారి చైనా వద్ద చెయ్యి చాపింది. తమ దేశంలో నిర్మిస్తున్న చైనా-పాకిస్థాన్‌ ఎకనామిక్‌ కారిడార్‌ పాక్యేజీ 1లోని మెయిన్‌లైన్‌1(ఎంఎల్‌1) నిర్మాణ ఖర్చుల కోసం అప్పు అడిగింది. ఇటీవల పాకిస్థాన్‌లోని ఎంఎల్‌-1 ప్రాజెక్టు అప్‌గ్రేడింగ్‌ సమావేశం జరిగింది. దీనిలో ఈ ప్రాజెక్టులోని 1,872 కిలోమీటర్ల మేరకు కరాచీ-పెషావర్‌ రైల్వేలైన్‌ అప్‌గ్రేడింగ్‌కు చైనాను 2.73 బిలియన్‌ డాలర్లు అప్పు అడగాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని పాక్‌ పత్రిక ది ఎక్స్‌ప్రెస్‌ ట్రిబ్యూన్‌ పేర్కొంది. కొవిడ్‌-19, అంతర్జాతీయ ఆంక్షల కారణంగా పాక్‌ ఆర్థిక వ్యవస్థ దివాలా అంచులకు చేరింది. ఇదే సమయంలో రుణం కోసం చైనాకు లేఖ రాయాలని నిర్ణయించారు. సీపెక్‌కు సంబంధించి వచ్చే ఏడాది కేటాయింపులను డ్రాగన్‌ ఖరారు చేయనుంది.

* రిలయన్స్‌ రిటైల్‌ విస్తరణకు వేగంగా పావులు కదుపుతోంది. రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఆర్‌వీఎల్‌) తాజాగా అర్బన్‌ ల్యాడర్‌ హోమ్‌ డెకార్స్‌ సొల్యూషన్స్‌ లిమిటెడ్‌ను దక్కించింది. ఈ డీల్‌ విలువ రూ.182.12 కోట్లు. దీంతో అర్బన్‌ ల్యాడర్‌లో 96శాతం వాటాలు ఆర్‌ఆర్‌వీఎల్‌ చేతికి దక్కాయి. తర్వాత మిగిలిన వాటాలను కొనుగోలు చేసే హక్కు కూడా ఆర్‌ఆర్‌వీఎల్‌కు లభించింది. అప్పుడు అది నూరుశాతం ఆర్‌ఆర్‌వీఎల్‌ సబ్సిడరీ సంస్థగా మారిపోతుంది.

* భారత్‌ దిగుమతులు భారీగా తగ్గిపోతున్న నేపథ్యంలో– ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం వాణిజ్యలోటు సింగిల్‌ డిజిట్‌లో నమోదవుతోంది. అక్టోబర్‌లో ఇది 8.71 బిలియన్‌ డాలర్లకు దిగివచ్చింది. గత ఏడాది ఇదే కాలంలో ఈ వాణిజ్యలోటు 11.53 బిలియన్‌ డాలర్లు.

* తనకు ఓ మాదిరి లక్షణాలతో కరోనావైరస్‌ సోకినట్లు భావిస్తున్నానని టెస్లా సీఈవో ఎలన్‌ మస్క్‌ పేర్కొన్నారు. అదే సమయంలో ఆయన కరోనా పరీక్షల కచ్చితత్వాన్ని కూడా ప్రశ్నిస్తున్నారు. ‘‘నేను వేర్వేరు ల్యాబ్‌ల్లో కరోనా పరీక్షలు చేయించుకున్నాను. వేర్వేరు రకాలుగా ఫలితాలు వచ్చాయి. నా అంచనా ప్రకారం.. ఓ మాదిరి లక్షణాలతో కరోనా సోకి ఉండవచ్చు. స్వల్పంగా జలుబు చేసింది. ఇదేమి ఆశ్చర్యకరం కాదు. కరోనావైరస్‌ నుంచి జలుబే వస్తుంది’’ అని పేర్కొన్నారు.

* దోమలు, ఇతర కీటకాల ద్వారా సంక్రమించే మలేరియా, డెంగ్యూ చికున్‌గున్యా, కాలా-అజర్‌, జపనీస్‌ ఎన్‌సెఫలైటిస్‌, జికా వైరస్‌, ఫైలేరియా (లింపాటిక్‌ ఫైలేరియాసిస్‌) లాంటి వ్యాధుల చికిత్స కోసం ప్రజలకు బీమా రక్షణ కల్పించేందుకు త్వరలో ఆరోగ్య, సాధారణ బీమా సంస్థలను అనుమతించనున్నారు. ఏడాది కాలపరిమితితో ఇలాంటి పాలసీలను ఆఫర్‌ చేసేలా బీమా సంస్థలను ప్రోత్సహించేందుకు ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఐఆర్‌డీఏఐ) శుక్రవారం ఓ విధాన ముసాయిదాను తీసుకొచ్చింది. దోమలు, కీటకాల ద్వారా వ్యాపించే కొన్ని రకాల వ్యాధుల నుంచి ప్రజలకు రక్షణ కల్పించేందుకు ప్రామాణిక బీమా పాలసీని అందుబాటులోకి తీసుకురావాలన్నది ఈ ముసాయిదా ఉద్దేశమని ఐఆర్‌డీఏఐ వెల్లడించింది. నిర్ధిష్ఠంగా ఏడాది కాలపరిమితి కలిగిన పాలసీని 15 రోజుల వెయిటింగ్‌ పీరియడ్‌తో ఆఫర్‌ చేయాలని ఈ ముసాయిదాలో ప్రతిపాదించింది. దీనిపై బీమా సంస్థలు ఈ నెల 27లోగా తమ అభిప్రాయాలను తెలియజేయాలని ఐఆర్‌డీఏఐ కోరింది.