Movies

నా మాటల్లో దూరదృష్టి ఉంటుంది

నా మాటల్లో దూరదృష్టి ఉంటుంది

బాలీవుడ్‌ కథానాయిక కంగనా రనౌత్‌ ముక్కుసూటితనం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్నోసార్లు ఘాటైన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది. ఆమెకు కోపం ఎక్కువని, అందుకే అలాంటి వ్యాఖ్యలు చేస్తుందనే అభిప్రాయం బాలీవుడ్‌ వర్గాల్లో ఉంది. ఎప్పుడైనా కానీ తన కోపానికి ఓ అర్థం ఉంటుంది అంటోంది కంగన. దిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడింది. ‘‘నాకు కోపం వచ్చినా అది నిర్మాణాత్మకంగానే ఉంటుంది. నా ప్రతి మాట వెనుక ఓ ప్రణాళిక, దూరదృష్టి ఉంటాయి. మనల్ని వెనక్కి లాగే పద్ధతులకు నేను ఎప్పుడూ వ్యతిరేకం. నేను ఎప్పుడు ఆగ్రహం వ్యక్తం చేసినా దాని వల్ల నాకు మంచే జరిగింది. నాది చిన్నపిల్లల మనస్తత్వం. అది ఎవరి లాజిక్‌కు అందదు’’ అని చెప్పింది కంగన. తను డబ్బులు వృథాగా ఖర్చుపెడుతుంది అనే మాట కంగన చెవిన పడిందట. దీని గురించి కంగన మాట్లాడుతూ ‘‘డబ్బును ఎంత జాగ్రత్తగా ఖర్చుపెట్టాలో నాకు తెలుసు. నా కలలను నెరవేర్చుకోవడానికి డబ్బును వాడుతుంటాను. నాకు ఇష్టమైన వాళ్ల కోసం ఎంతైనా ఖర్చుచేస్తాను. నా మనసుకు బాగా దగ్గరైన సామాజిక కార్యక్రమాలకు విరాళాలు ఇస్తుంటాను’’ అని చెప్పింది కంగన.