Politics

135ఏళ్ల కాంగ్రెస్ పార్టీ దుస్థికి ఎవరు కారణం?

The Horrible State Of Indian National Congress

స్వాతంత్ర్యం తెచ్చిన పార్టీ — 135 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ —- నేటి దుస్థితి.

మహాత్మ గాంధీ, పండిట్ జవహర్ లాల్ నెహ్రు, నేతాజీ సుభాష్ చంద్ర బోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా ఆజాద్, సరిహద్దు గాంధీ ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ లాంటి మహా మహులు, ఉద్దండులు, “మహా నాయకులు” ” జాతి నిర్మాతలు” ఉన్న మహోజ్వల చరిత్ర కలిగిన పార్టీ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ. 1885 లో ముంబైలో ఆవిర్భ వించి, ఆనాడు బ్రిటిష్ వారి నుండి మన భారత దేశానికి స్వాతంత్య్రం తేవడంలో ప్రధాన పాత్ర కాంగ్రెస్ పార్టీదే. ప్రపంచంలో నే చాలా గొప్ప చరిత్ర కలిగిన పార్టీ.

1947 లో స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి 1977 వరకు కాంగ్రెస్ పార్టీ యథేచ్ఛగా 30 సంవత్సరాలు పాటు దేశాన్ని పరి పాలించింది. మన మొట్ట మొదటి ప్రధాన మంత్రి శ్రీ జవహర్ లాల్ నెహ్రు, శ్రీ లాల్ బహుదూర్ శాస్త్రి మరియు శ్రీమతి ఇందిరాగాంధీ నాయకత్వంలో ఎన్నో బహుళార్ధ సాధక నీటి పారుదల ప్రాజెక్టులు, ఇస్రో, భేల్, అణు విద్యుత్ కేంద్రాలు, డి.ఆర్.డి.ఎల్ లాంటి ఎన్నెన్నో గొప్ప సంస్థలని స్థాపించింది కూడా కాంగ్రెస్ పార్టీనే.

చాలా కాలం దేశంలోని దాదాపు 90 –95 శాతం రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీ చేతిలోనే ఉండేవి. మధ్యలో కొంత కాలం ( 1977–79), (1989–1991), (1996–2004 ) తప్పితే 2014 వరకు దాదాపు 55 సంవత్సరాలు మన దేశాన్ని కాంగ్రెస్ పార్టీయే పరి పాలించింది.

కానీ అంతటి గొప్ప చరిత్ర కలిగిన కాంగ్రెస్ రాను రాను ఒక ప్రాంతీయ పార్టీ స్థాయికి దిగ జారీ పోతోంది.
దానికి కారణం, అప్పట్లో స్వాతంత్ర్యం తెచ్చిన పార్టీ అనే కాక ఆ ఉద్యమం లో పాల్గొన్న స్వాతంత్ర్య సమర యోధులు తర్వాత వారి వారసుల తరం నెమ్మది నెమ్మదిగా అంతరించి పోవడం, ముఖ్యంగా కొత్త తరానికి అప్పటి నాయకత్వ చరిత్ర, వారి ఘనత తెలియక పోవడంతో కనుమరుగై పోతూ వచ్చింది.

అంత కన్నా ముఖ్య కారణం కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకత్వం చేసుకొంటున్న స్వయం కృతాపరాధం.

అదేంటంటే, కాంగ్రెస్ పార్టీ అధీ నాయకత్వం మొదట్నుంచీ, మరీ ముఖ్యంగా ఇందిరాగాంధీ సమయం నుంచి రాష్ట్రాలలో బలమైన మరియు ప్రజాదరణ కలిగిన సామర్ధ్యం ఉన్న నాయకులను పూర్తిగా ఎదగ నీకుండా చెయ్యటం, వారిని ఆ రాష్ట్రంలో స్వేచ్ఛగా పరిపాలించకుండా ఉండటం, వారికి ప్రజాదరణ లేని తమ అడుగులకు మడుగులోత్హే తొత్తుల ద్వారా అనుక్షణం సమస్యలు, అసమ్మతి సృష్టించే నైజం. అంతే కాకుండా వాళ్ళను కుదురు కోనీకుండా, మాట్లాడితే ఢిల్లీ చుట్టూ తిప్పడం, సంవత్సరానికి, రెండేళ్లకు ఒకసారి ముఖ్యమంత్రులను మార్చటం లాంటివి. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ లో గొప్ప పరిపాలనా దక్షులైన డాక్టర్ మర్రి చెన్నారెడ్డి, మహారాష్ట్రలో వసంత్ దాదా పాటిల్, శరద్ పవార్, కర్ణాటక లో దేవరాజ్ ఆర్స్, కేరళలో కె.కరుణాకరన్, పశ్చిమబెంగాల్ లో కుమారి మమతా బెనర్జీ, ఆంధ్రప్రదేశ్ లో డాక్టర్ వైస్సార్ మరణం తర్వాత ఆయన కుమారుడు వై. యెస్. జగన్మోహన్ రెడ్డి , మధ్య ప్రదేశ్ లో మాధవరావు సిందియా, ఆ తర్వాత ఆయన కుమారుడు జ్యోతిరాదిత్య సిందియా, రాజస్థాన్ లో సచిన్ పైలట్ ( దాదాపు) ఇలా ఎంతో మంది ప్రజాదరణ కలిగిన నాయకులను కోల్పోయింది. ఎందువల్లనో గానీ కాంగ్రెస్ పార్టీ అధి నాయకత్వానికి ఎప్పుడూ కూడా ప్రజా నాయకులంటే గిట్టదు. చారిష్మా ఉన్న నాయకులంటే అస్సలు పడదు. తమ విషయంలో వారసత్వం ఉండొచ్చు గానీ, రాష్ట్రాలలో బలమైన రాజకీయ వారసులను అసలు సహించ లేదు. ( జగన్, జ్యోతిరాదిత్య, సచిన్ పైలట్) విచిత్రం ఏమిటంటే, ఇలాంటి దుశ్చర్యల వల్ల చాలా రాష్ట్రాలలో కాంగ్రెస్ మీద వ్యతిరేకతతో ప్రాంతీయ పార్టీలు పుట్టి ఏకు మేకు లాగా తయారయ్యాయి. అందువల్లే కాంగ్రెస్ పార్టీకి మొదట్నుంచీ బలమైన రాష్ట్రాలైన ఆంద్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో రోజు రోజుకి కాంగ్రెస్ పార్టీ దిగజారి పోతోంది.

ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీని రెండు సార్లు ( 2004,2009 ) అధికారం లోకి తీసుకు వచ్చి తద్వారా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో కూడా అధికారంలోకి వచ్చేటట్లు చేసిన డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఆయన పట్ల ఆయన కుటుంబం పట్ల హై కమాండ్ వ్యవహరించిన తీరు వల్ల కాంగ్రెస్ పార్టీకి అత్యంత బలమైన (1977,1978, 1989, 2004,2009 లో దేశం మొత్తం నిరాదరించినా ఆదుకున్న ) రాష్ట్రంలో ఇప్పుడు కనీసం అసెంబ్లీ లో కానీ, పార్లమెంట్ లో కానీ ఒక్క ప్రజా ప్రతినిధి కూడా లేకపోవడం అనేది దౌర్భాగ్యం, ఆ పార్టీ స్వయంకృతాప రాధమే. వైస్సార్ శాపమే. అంతే కాక మన రాష్ట్రంలో 60 ఏళ్లుగా చెక్కు చెదరని ఓట్ బ్యాంక్ జగన్ వైపు మారిపోయింది. ఇప్పుడు తెలంగాణ లో కూడా పతనమై పోతోంది.

చాలా కాలం దేశం మొత్తంలో ఉన్న ఏకైక జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ. కొన్ని కొన్ని రాష్ట్రాలలో వేరే పార్టీలు అధికారం లోకి వచ్చినా దేశాన్ని మాత్రం కాంగ్రెస్ పార్టీయే పరిపాలించ గలదు అనే అభిప్రాయం చాలా మందిలో ఉండేది. ఆ అభిప్రాయం ఇప్పుడు దాదాపు తుడుచుపెట్టుకు పోయింది. ప్రస్తుతం చాలా రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉన్న బలమైన ప్రాంతీయ పార్టీలకు తోక పార్టీ లాగా మారి 5, 6 శాతం ఓట్లతో వాళ్ళు ఇచ్చే 10,15 సీట్ల కోసం బేరాలాడే పరిస్థితి కోచింది. ఇంత జరుగుతున్నా ఇప్పటికీ అధి నాయకత్వం వ్యవహార శైలి మార్చు కోవట్లేదు.

ముందు ముందు కూడా కాంగ్రెస్ పార్టీ ఇలాగే వ్యవహరిస్తే ఇంకా ఇంకా దిగజారి పోతుంది. ఒకప్పుడు దేశాన్ని పరిపాలించింది ఈ పార్టీయేనా అని రాబోయే తరం ఆశ్చర్య పోయే దుస్థితి వస్తుంది.

జవహర్ లాల్ తుర్లపాటి. +91 93473 36699