లోహపు పాత్రల మెరుపు కొన్నప్పుడు ఉన్నట్టుగా కొన్నాళ్లు వాడిన తర్వాత ఉండదేం?
✳లోహపు పాత్రలను తయారు చేసిన తర్వాత ఒక రకం పొడితో రుద్దడం ద్వారా వాటిని తళతళా మెరిసేటట్టు చేస్తారు. ఇలా రుద్దడం వల్ల ఆ పాత్రల ఉపరితలం మొత్తం ఒకే రీతిగా చదును అవుతుంది. అందువల్ల ఆ పాత్రపై పడిన కాంతి కిరణాలన్నీ ఒకే విధంగా ఒక నిర్దిష్ట దిశలో పాత్ర ఆకారాన్ని బట్టి పరావర్తనం (reflection) చెందుతాయి. అందువల్లనే అవి మెరుస్తూ కనిపిస్తాయి.
వాడుతున్న కొద్దీ పాత్రలపై ఎగుడు దిగుడు గీతలు ఎర్పడి వాటి ఉపరితలం గరుకుగా మారుతుంది. దాంతో ఆ పాత్రలపై పడే కాంతి కిరణాలు ఒక క్రమ పద్ధతిలో కాకుండా చిందరవందరగా పరిక్షేపణ (scattering) చెందుతాయి. అందువల్ల కొన్నప్పటి మెరుపును అవి కోల్పోతాయి. పాత్రలపై ఏర్పడిన గీతలలో చేరిన మురికి, వాతావరణంలోని ఆక్సిజన్ వల్ల లోహాలు ఆక్సీకరణం (oxidation) చెందడం వల్ల కూడా పాత్రలు మెరుపును కోల్పోతాయి. స్టెయిన్‌లెస్ స్టీలు పాత్రలు వాటిలో ఉండే క్రోమియం వల్ల అంత తొందరగా మెరుపును కోల్పోవు.