* రైతుల శాపం తగిలి ఏదోక రోజు టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కుటుంబం పతనం అవుతుందని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చాక కూడా రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయంటే పాలకులు సిగ్గుపడాలని ధ్వజమెత్తారు. ‘రోజూ ఏదో ఒక మూల రైతు మరణిస్తున్నాడు. రైతు ఆత్మహత్య లేని వార్త దినపత్రికల్లో కనిపించడం లేదు. కానీ ప్రభుత్వం మాత్రం రైతు ఆత్మహత్యలను ప్రభుత్వ రికార్డులలో చూపడం లేదు. ప్రభుత్వ ఆదేశాల మేరకే పోలీసులు రైతు ఆత్మహత్యలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయట్లేదు. గత శుక్ర, శనివారం రెండు రోజుల్లో ఆరుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు 25 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాల’ని ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్ చేశారు.
* నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య ఘటనపై వాస్తవాలు తెలుసుకోకుండా బీజేపీ ఏపీ అధ్యక్షులు సోము వీర్రాజు మాట్లాడుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మండిపడ్డారు. ఆయనకు అసలు మానవత్వం ఉందా అని ప్రశ్నించారు. వారిని సోము వీర్రాజు మత కోణంలో చూస్తున్నారే తప్ప మనుషులుగా చూడటం లేదని దుయ్యబట్టారు. ప్రతి విషయం మత కోణంలో చూడటం తగదన్నారు. సోము వీర్రాజు నంద్యాలకు వెళ్లి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని రామకృష్ణ హితవు పలికారు.
* తమకు జిల్లాలోని మెడికల్ ఆఫీసర్లు తెలుసునని, వారితో చెప్పి మీపై ఏదో ఒక కేసు బనాయిస్తామని బ్లాక్‌మెయిలింగ్‌కు దిగారు. దీనిపై ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఒక వ్యక్తి మొబైల్‌తో వీడియో తీస్తుండగా మరో వ్యక్తి సంస్థకు చెందిన లోగో బయటకు తీసి హడావుడి చేశారు. దీంతో స్థానికులు పెద్దఎత్తున అక్కడికి చేరి మెడికల్ షాపు నిర్వాహకులకు మద్దతుగా నిలబడటంతో వారు నెమ్మదిగా జారుకున్నారు. దీనిపై భవానీపురం ఇన్‌చార్జి సీఐ వెంకటేశ్వరరావును వివరణ కోరగా ఈ ఘటనపై తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. ఇదే యూట్యూబ్ చానల్‌కు చెందిన పి.సురేష్ అనే వ్యక్తి ఇద్దరు వ్యక్తులను వెంటేసుకుని గత ఏడాది సెప్టెంబర్ 13న విజయవాడ ఊర్మిళానగర్‌లో బడ్డీ కొట్టు నడుపుకుంటున్న ఒక దివ్యాంగురాలిని బ్లాక్ మెయిల్ చేసి రూ.1000 వసూలు చేశారు. దీనిపై ఆమె భవానీపురం పీఎస్‌లో ఫిర్యాదు చేయటంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. సైబరాబాద్ సిటీ ఎస్‌ఐ పేరుతో నకిలీ ఐడీ కార్డు సృష్టించిన గుత్తుల ప్రశాంత్ అనే వ్యక్తి కారులో వస్తుండగా ఈ ఏడాది జూన్ 25న భవానీపురం పోలీసులు గొల్లపూడిలో పట్టుకున్నారు. పోలీసుల విచారణలో తాను వీ వన్ చానల్ రిపోర్టర్‌నని ఐడీ కార్డ్ చూపించాడు. కారు నంబర్ ప్లేట్లుకూడా మార్చిన అతన్ని విడిపించేందుకు అప్పట్లో కొందరు పెద్దఎత్తున లాబీయింగ్ చేశారని వినికిడి.
* మోస్ట్‌వాంటెడ్ ఉగ్రవాదుల లిస్టులో ప్రముఖ వ్యాపారవేత్త పేరును చేర్చిన జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) తన నిర్ణయాన్ని వెనక్కితీసుకుంది. ఉగ్రవాదుల జాబితా నుంచి అతడి పేరు, ఫొటోను వెబ్‌సైట్ నుంచి తొలగించింది. జార్ఖండ్ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. అయితే సదరు వ్యాపారవేత్తపై నమోదు చేసిన అభియోగాలు మాత్రం సరైనవేనని స్పష్టం చేసింది. అసలు ఏం జరిగిందంటే.. బొగ్గు వ్యాపారం, స్టీల్ ప్లాంట్లు కలిగి ఉన్న అధునిక్ గ్రూప్ అధినేత మహేష్ అగర్వాల్ జార్ఖండ్‌లో బొగ్గు ఆధారిత పవర్ ప్లాంటును నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో తన వ్యాపార కార్యకలాపాలు సజావుగా సాగేందుకు వీలుగా స్థానిక మావోయిస్టు సంస్థ తృతీయ ప్రస్తుతి కమిటీ(టీపీసీ)కి అతడు నిధులు సమకూరుస్తున్నట్లు ఎన్‌ఐఏ చార్జిషీట్ దాఖలు చేసింది. 2016 నాటి కేసు(బిహార్, జార్ఖండ్‌లో వ్యాపారవేత్తలు, కాంట్రాక్టర్ల నుంచి నక్సల్స్ భారీ మొత్తంలో దోచుకున్నారన్న ఆరోపణలు)కు సంబంధించి ఈ ఏడాది జనవరి 10న ఈ మేరకు అభియోగాలు నమోదు చేసింది.
* బిహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నీతీశ్ కుమార్ ఏడోసారి ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ ఫగు చౌహాన్ ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరులు హాజరయ్యారు. నితీశ్‌తోపాటు మరో 12 మంది కూడా మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. అయితే, వీరిలో ఇద్దరు ఉపముఖ్యమంత్రులుగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది.
* అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్ని మార్చే అవకాశమే లేదని మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు. ఇకనైనా ఓటమిని అంగీకరించాలని అధ్యక్షుడు ట్రంప్‌నకు ఆయన సూచించారు. దేశ హితం కోసం ట్రంప్ తన అహాన్ని, స్వప్రయోజనాన్ని పక్కనబెట్టాలని హితవు పలికారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత సీబీఎస్‌కు ఇచ్చిన తొలి ముఖాముఖిలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
* ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఇచ్చిన ఆదేశాలను సవరించాలన్న పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. ఎన్నికల సంఘం ఏవైనా అభివృద్ధి పనులు ఆపిందా? అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డే ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం వాయిదా వేసిన విషయం తెలిసిందే. దీంతో ఏపీ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించగా అభివృద్ధి పనులకు ఈసీ అనుమతి తీసుకోవాలని అత్యున్నత ధర్మాసనం స్పష్టం చేసింది.
* పోలవరం ప్రాజెక్టు విషయంలో సాక్షాత్తు మంత్రులే అబద్ధాలు చెబుతున్నారని మాజీ మంత్రి, తెదేపా నేత దేవినేని ఉమ మండిపడ్డారు. ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పోలవరం నిర్వాసితుల తరఫున తెదేపా ప్రశ్నిస్తోందన్నారు. పోలవరం ఎత్తు విషయంలో అనేక అనుమానాలున్నాయని, వివిధ రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు దీనిపై ఆందోళనగా ఉన్నాయని అన్నారు.
* అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మహమ్మారి తన విశ్వరూపాన్ని చూపిస్తోంది. ఇప్పటికే అక్కడ కేసుల సంఖ్య కోటి మార్కును దాటేసింది. అయితే, గత వారం రోజుల్లో అక్కడ 10లక్షల కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. కరోనా తీవ్రత కారణంగా పలు ప్రాంతాల్లోని ప్రభుత్వాలు కొత్త నిబంధనలను అమలుచేస్తున్నాయి. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని సోమవారం చికాగో అధికారులు ఆదేశించనున్నట్లు సమాచారం.
* పత్రికా స్వేచ్ఛపై జరిగే ఏవిధమైన దాడి ఐనా అవి జాతి ప్రయోజనాలకు హానికరమైనవని, అలాంటి వాటిని ప్రతిఒక్కరు వ్యతిరేకించాల్సిందేనని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పష్టంచేశారు. స్వేచ్ఛాయుత, నిర్భయమైన మీడియా లేకుండా ప్రజాస్వామ్యం మనుగడ సాగించదని ఆయన నొక్కిచెప్పారు. జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా ‘కరోనా సమయంలో మీడియా పాత్ర-మీడియాపై ప్రభావం’ అన్న అంశంపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన వెబినార్‌లో ఉపరాష్ట్రపతి ఈ విధంగా స్పందించారు.
* దేశ రాజధానిలో కొవిడ్-19 మూడో దఫా గరిష్ట స్థాయిని దాటేసిందని, అందుకే లాక్‌డౌన్ విధించే అవకాశం లేదని దిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ వెల్లడించారు. అలాగే లాక్‌డౌన్‌కు సంబంధించి వదంతులను ఆయన కొట్టిపారేశారు. ‘లాక్‌డౌన్‌కు అవకాశం లేదు. దాని గురించి ఎలాంటి ప్రస్తావన లేదు. మూడో దఫా గరిష్ట స్థాయిని దిల్లీ దాటేసింది. పండుగ పూర్తికావడంతో మార్కెట్లలో రద్దీ కూడా తగ్గిపోనుంది. లాక్‌డౌన్ అనేది నేర్చుకొనే ప్రక్రియ’ అంటూ జైన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
* దిగ్గజ ఆటగాడు సచిన్ తెందుల్కర్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి సరిగ్గా నేటితో ఏడేళ్లు పూర్తయ్యాయి. 2013, నవంబర్ 16న వెస్టిండీస్‌తో సచిన్ తన చివరి టెస్టు మ్యాచ్‌ను ముగించి భావోద్వేగంతో వాంఖడే మైదానాన్ని వీడాడు. క్రికెట్‌లో లెక్కలేనన్ని రికార్డులు సాధించిన అతడి ఘనతలను ఐసీసీ, అభిమానులు గుర్తుచేస్తూ ట్విటర్‌లో పోస్ట్‌లు చేస్తున్నారు.
* ఏటా పండక్కి బంధువుల ఇంటికెళ్లి మిఠాయిలు ఇచ్చి శుభాకాంక్షలు చెప్పి వచ్చేవాళ్లు కూడా కొవిడ్-19 ప్రభావంతో ఇళ్లకే పరిమితమయ్యారు. పరిమిత సంఖ్యలో విమానాలు, రైళ్లు, బస్సులు తిరుగుతున్నప్పటికీ దూర ప్రయాణాలు చేసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపడంలేదు. ఆన్‌లైన్ క్లాసులు, ఇంటి నుంచి పని చేయడం అనేవి సర్వసాధారణమైపోయాయి. ఒక్క క్లిక్‌తో ఆన్‌లైన్‌లో ఆత్మీయుల పలకరింపులు, బంధువులతో బాతాఖానీ అన్నీ అయిపోతున్నాయి. వీటికి ముఖ్య కారణం వీడియో కాలింగ్ యాప్స్.
* బిహార్ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో ఘోరపరాభవం చవిచూసిన కాంగ్రెస్ పార్టీని దేశ ప్రజలు ఇక ఏమాత్రం ప్రత్యామ్నాయంగా భావించడం లేదని పార్టీ సీనియర్ నేత కపిల్ సిబల్ అభిప్రాయపడ్డారు. ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’కు ఇచ్చిన ముఖాముఖిలో ఆయన సొంతపార్టీ తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలను ప్రస్తావించారు. వెంటనే పార్టీలో ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉందన్నారు.
* ఏపీ ప్రభుత్వం కరోనా బులెటిన్ విడుదల చేసింది. ఒక్కరోజు వ్యవధిలో 43,044 నమూనాలను పరీక్షించగా 753 మందికి కొవిడ్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,54,764కి చేరింది. 24 గంటల వ్యవధిలో కొవిడ్ చికిత్స పొందుతూ 13 మంది మృతిచెందారు. చిత్తూరు, కృష్ణా, విశాఖపట్నం జిల్లాల్లో ఇద్దరేసి.. అనంతపురం, తూర్పుగోదావరి, గుంటూరు, నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒకరు చొప్పున మరణించారు. దీంతో రాష్ట్రంలో కొవిడ్‌తో మృతిచెందిన వారి సంఖ్య 6,881కి చేరింది. ఒక్కరోజులో 1,507 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకోగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 17,892 యాక్టివ్ కేసులన్నాయి. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 91,97,307 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది.
* రికార్డు స్థాయిలో వరసగా 44వ రోజు కూడా కొత్త కరోనావైరస్ పాజిటివ్ కేసుల కంటే దాన్నుంచి కోలుకున్న వారి సంఖ్యే ఎక్కువగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆదివారం 30,548 కొత్త వైరస్ కేసులు నమోదు కాగా, 43,851 మంది కోలుకొని ఇళ్లకు చేరుకున్నారు. ‘కొత్త కేసులతో పోల్చుకుంటే రికవరీల విషయంలో భారత్ సంతృప్తికరంగా ఉంది’ అని సోమవారం మంత్రిత్వ శాఖ ప్రకటన చేసింది. ఒకవైపు అమెరికా, ఐరోపా దేశాల్లో కేసుల సంఖ్యలో భారీ పెరుగుదల కనిపిస్తుండగా, భారత్‌లో మాత్రం జులై 13 తరవాత మొదటిసారి తక్కువ కేసులు(30,548) నమోదవడం ఊరటకలిగించే అంశం. ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 4,65,478గా ఉంది. కాగా, క్రియాశీల కేసుల రేటు 5.26 శాతానికి తగ్గగా, రికవరీ రేటు 93.27 శాతానికి పెరిగింది. 24 గంటల వ్యవధిలో కోలుకున్న కేసులలో 78.59 శాతం 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందినవేనని మంత్రిత్వ శాఖ తెలిపింది.