Editorials

కరోనాకు నేటితో ఏడాది పూర్తి

కరోనాకు నేటితో ఏడాది పూర్తి

కంటికి కనిపించకుండా ప్రపంచాన్ని గడగడలాడించి, అన్ని వర్గాల వారినీ తీవ్ర భయాందోళనల్లోకి నెట్టేసిన కరోనా వైరస్‌ బయటపడి మంగళవారానికి ఏడాది పూర్తవుతోంది!! ఇది కచ్చితంగా ఎప్పుడు బయటపడిందనే దానిపై భిన్నాభిప్రాయాలున్నా.. చైనా ప్రభుత్వ సమాచారాన్ని ఉటంకిస్తూ.. కరోనాకు ఈ నెల 17తో ఏడాది పూర్తవుతోందని హాంకాంగ్‌ కేంద్రంగా వెలువడే ‘ది సౌత్‌ చైనా మార్నింగ్‌ పోస్ట్‌’ పేర్కొంది. చైనాలోని హుబెయ్‌ ప్రావిన్సులో 2019 నవంబరు 17న 55 ఏళ్ల వ్యక్తిలో కరోనా తొలికేసు వెలుగు చూసిందని ఆ పత్రిక వెల్లడించింది. అయితే చైనాలో 2019 డిసెంబరు 8న కరోనా తొలికేసు వచ్చిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతుండగా.. డిసెంబరు 1న తొలికేసు వచ్చినట్లు ‘ది లాన్సెట్‌’ కథనం స్పష్టంచేసింది. కరోనా వెలుగుచూసిన తొలినాళ్లలో రోజుకు గరిష్ఠంగా ఐదు కేసులు వచ్చేవి. డిసెంబరు 15 నాటికి మొత్తం కేసులు 27 మాత్రమే. చాలా మంది వైద్యులు అవన్నీ మామూలు వైరస్‌ కేసులేనని పొరపడినా.. ఆ నెల 27న హుబెయ్‌లోని ఒక వైద్యుడు మాత్రం ఇవన్నీ కొత్తరకం కరోనా వైరస్‌వేనని గుర్తించారు. వైరస్‌ ఎలా తీవ్రతరమైందో తెలిపే గణాంకాలను ప్రభుత్వం వెల్లడించకపోయినా దాని ఉద్ధృతి మాత్రం వ్యవస్థల్ని కకావికలం చేసింది. మొట్టమొదటగా ఈ వైరస్‌ బారిన పడిన వ్యక్తి(పేషెంట్‌ జీరో) ప్రస్తుత స్థితిని తెలుసుకోవాలని శాస్త్రవేత్తలు ఉత్సాహం చూపిస్తున్నారు. తద్వారా అసలు ఇది ఎక్కడి నుంచి ఆవిర్భవించిందో తెలుసుకోవచ్చనేది వారి ఉద్దేశం. గబ్బిలం నుంచి గానీ, మరేదైనా జంతువు నుంచి గానీ ఇది మానవుల్లోకి ప్రవేశించి ఉంటుందనేది ఎక్కువమంది నమ్మకం.