Devotional

కార్తిక నదీస్నానం గొప్పదనం అదే

కార్తిక నదీస్నానం గొప్పదనం అదే

కార్తీక మాసం అనగానే ఉపవాసాలు, దీపాలు, వనభోజనాలు గుర్తుకువస్తాయి. వీటితో పాటు కార్తీక స్నానం కూడా తలపులోకి వస్తుంది. కార్తీకమాసంలో ప్రాతఃకాలానే నిద్రలేచి నది, చెరువు, బావుల దగ్గర స్నానమాచరించి దీపారాధన చేస్తారు. ఇక సముద్ర స్నానం చేసేందుకు మన పెద్దలు నిర్దేశించిన నాలుగు మాసాలలోనూ కార్తీకం ఒకటి. అలాంటి కార్తీక స్నానం గురించి మరిన్ని విశేషాలు…

స్నాన మహత్యము
కార్తీకపురాణంలో నదీస్నాన మహత్యం గురించి ప్రత్యేకంగా పేర్కొన్నారు. అధికార గర్వంతో కన్నూమిన్నూ కానక ఒకడు, తల్లిదండ్రుల ఆలనాపాలనా చూసుకోక మరొకడు, వ్యసనాలలో మునిగితేలిన ఇంకొకడు బ్రహ్మరాక్షసులుగా మారిన వృత్తాంతం అందులో కనిపిస్తుంది. వీరు ముగ్గురూ కూడా నదీస్నాన మహిమ వలన శాపవిముక్తులుగా మారినట్లు కార్తీక పురాణం పేర్కొంటోంది.

కారణాలు
– ఇంచుమించు కార్తీకమాస సమయంలోనే సూర్యుడు తులారాశిలోకి చేరుకుంటాడు. ఇలా సూర్యుడు తులా సంక్రమణంలోకి ప్రవేశించగానే గంగానది అన్ని నదులలోనూ వ్యాపిస్తుందని చెబుతారు. అంటే ఏ నదిలో మునిగినా కూడా అది గంగాస్నానంతో సమానమైన ఫలితాన్ని అందిస్తుంది.

– కార్తీకమాసంలో చలితీవ్రత పెరుగుతుంది. దీనిని శరీరం తట్టుకుని నిలబడాలంటే కాలానుగుణంగా దినచర్యను మార్చుకోవలసిందే! ప్రాతఃకాలంలో చేసే స్నానంతో శరీరం కఫసంబంధమైన దోషాలను తట్టుకునేందుకు సిద్ధంగా ఉంటుంది.

– కార్తీకమాసంలో చీకటివేళలు ఎక్కువగా ఉంటాయి. దీంతో జీవగడియారం అస్తవ్యస్తం అయిపోతుంది. ఆకలి మందగిస్తుంది, బద్ధకం పెరిగిపోతుంది. ఉదయాన్నే లేచి తప్పనిసరిగా స్నానం చేయాలనే నియమాన్ని ఆచరించడం వలన జీవనశైల అదుపుతప్పకుండా ఉంటుంది.

– హరిహరులకు ఇష్టమైన కార్తీకమాసంలో ధర్మాచరణకు సైతం అధిక ప్రాధాన్యత ఉన్న విషయం తెలిసిందే! ఇందుకోసం ఇటు మనసు అటు శరీరమూ శుచిగా ఉండటం చాలా అవసరం. అందుకు స్నానం విషయంలో తగినంత శ్రద్ధ తీసుకోవలసిందే! భూమితో అనుబంధం ఉన్న నీరు కానీ, ప్రవాహంగా సాగుతున్న నీరు కానీ స్వచ్ఛంగా ఉంటాయి. అందుకే నది, తటాకం లేదా బావిలోని నీటితో ప్రాతఃకాల స్నానం చేయమని సూచిస్తుంటారు. ఏదీ కుదరకపోతే అప్పటికప్పుడు భూమి నుంచి పట్టుకున్న నీటితో స్నానం చేయమని చెబుతారు.

– నవంబరు నాటికి వర్షాలు తగ్గిపోతాయి. నదుల ఉధృతి తగ్గి గంభీరంగా ప్రవహిస్తూ ఉంటాయి. వాటిలోని మలినాలన్నీ అడుగుకి చేరుకుని నిర్మలమైన నీరు మాత్రమే ప్రవహిస్తుంటుంది. అటు సమృద్ధిగా, ఇటు స్వచ్ఛంగా ఉన్న నీటిలో స్నానం చేయాలంటే కార్తీక మాసమే అనువైన సమయం.

– నవంబరు మాసం తీర్థయాత్రలు చేసేందుకు అనువైన సమయం. అందుకే ఈ మాసంలో ఒక్కసారైనా నదీస్నానం చేయమంటూ పెద్దలు ప్రోత్సహిస్తుంటారు. అలాగైనా మన దగ్గరలోని పుణ్యక్షేత్రాలను దర్శిస్తామని వారి నమ్మకం.

– ఇక సముద్ర స్నానం చేసేందుకు మన పెద్దలు సూచించిన నాలుగు మాసాలలో (ఆషాడం, కార్తీకం, మాఘం, వైశాఖం) కార్తీకం ఒకటి. ముఖ్యంగా కార్తీక పౌర్ణమినాడు కనుక సముద్ర స్నానం చేస్తే విశేష ఫలితం ఉంటుందని చెబుతారు. కార్తీక మాసంలోని సముద్రంలోకి నదీజలాలు విశేషంగా సంగమిస్తూ ఉంటాయి. పైగా నీరు కూడా వెచ్చగా ఉండి స్నానం చేసేందుకు అనువుగా ఉంటుంది.

– కార్తీకమాసంలో నీటి మీద చంద్రుని కిరణాల ప్రభావం అధికంగా ఉంటుందంటారు. ఇలా చంద్రకిరణాలను సోకిన నీటితో స్నానం చేయడం వలన అనేక వ్యాధులు నయమవుతాయని చెబుతారు. సూర్యోదయానికి ముందుగానే స్నానం చేయమని సూచించడం వెనుక ఇదే అంతరార్థం కావచ్చు.