Business

లక్ష్మీవిలాస్ బ్యాంకు ఖాతాదారులకు షాక్-వాణిజ్యం

Business News - Lakshmi Vilas Bank Shocks Customers

* ప్రైవేటు యాజమాన్యంలోని లక్ష్మీవిలాస్ బ్యాంకు ఖాతాదారులకు ఇది షాకింగ్ న్యూసే. గత మూడేళ్లుగా ఈ బ్యాంకు ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగుండకపోవడం, ‘స్థిరమైన క్షీణత’ కారణంగా డిసెంబరు 16 వరకు బ్యాంకుపై భారతీయ రిజర్వు బ్యాంకు తాత్కాలికంగా మారటోరియం విధించింది. ఆర్‌బీఐ నిర్ణయం తక్షణం అమల్లోకి వచ్చింది. ఫలితంగా ఆ బ్యాంకు ఖాతాదారులు రూ. 25 వేలకు మించి నగదు ఉపసంహరించుకోకుండా పరిమితి విధించింది. ఆచరణీయమైన ఎటువంటి వ్యూహాత్మక ప్రణాళిక లేకపోవడం, పురోగతి క్షీణించడం, నిరర్ధక ఆస్తులను (ఎన్‌పీఏఎస్) పెంచడం కారణంగా బ్యాంకుపై తాత్కాలికంగా మారటోరియం విధించినట్టు ఆర్‌బీఐ పేర్కొంది. అలాగే, తన ప్రతికూల నికర విలువ చుట్టూ ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన మూలధనాన్ని సమీకరించడంలో బ్యాంకు పూర్తిగా విఫలమైందని బ్యాంకు పేర్కొంది. 

* దేశీయ ఆన్‌లైన్‌ రిటైల్‌ మార్కెట్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ మరో సంస్థను కొనుగోలు చేసింది. అగ్‌మెంటెడ్‌ రియాల్టీ సేవలు అందించే స్కాపిక్‌ కంపెనీని కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని ఫ్లిప్‌కార్ట్‌ ప్రకటించింది. డీల్‌ విలువను మాత్రం కంపెనీ వెల్లడించలేదు.

* దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ మంగళవారం మరో విడత ‘మెయిల్‌’ (మొబిలిటీ అండ్‌ ఆటోమొబైల్‌ ఇన్నోవేషన్‌ ల్యాబ్‌) కార్యక్రమాన్ని చేపట్టింది. మొబిలిటీ, ఆటోమొబైల్‌ స్పేస్‌లో సరికొత్త స్టార్టప్‌లను ఆహ్వానించింది. ఈ విషయాన్ని మారుతీసుజుకీ ఇండియా ఒక ప్రకటనలో వెల్లడించింది.

* దేశీయ స్టాక్‌ మార్కెట్లు నేడు దూకుడుగా ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి. ఉదయం ఒక దశలో సెన్సెక్స్‌ 44,115 పాయింట్లను తాకింది. సెన్సెక్స్‌ ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. ఆ తర్వాత కొంత తగ్గినా లాభాల్లో కొనసాగుతోంది. ఉదయం 9.30 సమయానికి 324 పాయింట్లు పెరిగి సెన్సెక్స్‌ 43,963 వద్ద, నిఫ్టీ 88 పాయింట్ల లాభంతో 12,873 వద్ద కొనసాగుతున్నాయి. ఆస్ట్రల్‌ పాలీ టెక్నిక్‌, టాటా స్టీల్‌, వొడాఫోన్‌, సుజ్లాన్‌ ఎనర్జీ, దేవాన్‌ హౌసింగ్‌ షేర్లు లాభపడుతుండగా.. ఇండియా బుల్స్‌ రియల్‌ ఎస్టేట్‌, ఇండియా బుల్స్‌ హౌసింగ్‌, ఎస్‌హెచ్‌ కేల్క్ర్‌ర్‌ అండ్‌ కంపెనీ, భారత్‌ పెట్రోలియం, ఇండియాబుల్స్‌ ఇంటిగ్రేట్‌ నష్టాల్లో కొనసాగుతున్నాయి.

* వరుసగా మూడో రోజు దేశీయ మార్కెట్లు లాభాల్లో పయనించాయి. కరోనా వ్యాక్సిన్‌ ప్రయోగాల ఫలితాలు సానుకూలంగా వస్తుండటంతో ప్రపంచ మార్కెట్లు పుంజుకున్నాయి. ఆ సంకేతాలను అందిపుచ్చుకున్న దేశీయ సూచీలు కూడా జోరు పెంచాయి. దీంతో మంగళవారం నాటి ట్రేడింగ్‌లో మార్కెట్లు కొత్త గరిష్ఠాలను అధిరోహించాయి.