ScienceAndTech

మళ్లీ చంద్రుడిపై చైనా ప్రయోగాలు

మళ్లీ చంద్రుడిపై చైనా ప్రయోగాలు

చంద్రుడిపై పరిశోధనలకు చైనా మరోసారి సిద్ధమైంది. జాబిలిపై ఉన్న మట్టి, రాళ్ల వంటి పదార్థాలను భూమిపైకి తీసుకువచ్చే లక్ష్యంతో చైనా ఈ మిషన్‌ను చేపడుతోంది. నాలుగు దశాబ్దాల సుదీర్ఘ సమయం తర్వాత తొలిసారిగా చైనా ఈ తరహా ప్రయోగం చేస్తోంది. ఇప్పటివరకు అమెరికా, రష్యాలు మాత్రమే ఇలాంటి మిషన్‌ చేపట్టాయి. ‘చాంగె-5’ మిషన్‌లో భాగంగా లాంగ్‌ మార్చ్‌-5 రాకెట్‌ను లాంచ్‌ ప్యాడ్ వద్ద‌కు చేరవేసింది. హైనాన్ ప్రావిన్సులో ఉన్న వెన్‌చాంగ్‌ ప్రయోగ కేంద్రం నుంచి ఈ చంద్రుడిపైకి ఈ రాకెట్‌ను వచ్చే వారం ప్రయోగించనుంది.

ఈ చాంగె-5 మిషన్‌ ద్వారా చంద్రుడిపైకి చైనా ఓ ల్యాండర్‌ను పంపిస్తోంది. ఈ ల్యాండర్‌ చంద్రుడి ఉపరితలంపై దిగి అక్కడ దాదాపు 2 మీటర్లలోతు తవ్వకం చేపట్టనుంది. అనంతరం అక్కడి రాళ్లు, మట్టి శిథిలాలను భూమిపైకి తీసుకురానుంది. తద్వారా చంద్రుడిపై వాతావరణం, నేలపై శాస్త్రవేత్తలు మరిన్ని పరిశోధనలను చేపట్టే ఆస్కారం ఉంటుంది. అయితే, 1960-70 దశకంలో కేవలం అమెరికా, రష్యా దేశాలు మాత్రమే ఈ తరహా ప్రయోగాలు చేపట్టాయి. 2003లో మొదటి రోదసి యాత్రికుణ్ని అంతరిక్షంలోకి పంపిన చైనా ఆ తర్వాత చంద్రునిపై ముమ్మర పరిశోధనలకు నడుం బిగించింది. గత ఏడాది చంద్రుని మరోవైపు (చీకటి వైపు) జరిపిన ప్రయోగంలో విజయం సాధించిన చైనా.. తాజా మిషన్‌ను కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది.

చంద్రుడిపై జరుపుతున్న పరిశోధనలో చైనా ముందుందనే చెప్పవచ్చు. 2018లో చైనా పంపించిన చాంగె-4 లూనార్‌ రోవర్‌ చంద్రుడికి వెనుక భాగంలో విజయవంతంగా దిగిన విషయం తెలిసిందే. జాబిలి వెనుక వైపు దిగిన తొలి వ్యోమనౌకగా ఇది చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకు చంద్రుడి అవతలి వైపు ప్రాంతానికి అమెరికా, రష్యా సహా ఎవరూ వెళ్లలేదు. అలాంటి చోట చైనా అడుగుపెట్టి విజయం సాధించింది. చంద్రుడిపై దిగిన రోవర్‌ దానిలోని ఓ మానిటర్‌ కెమెరా నుంచి అది దిగిన ప్రదేశాన్ని ఫొటో తీసి పంపించింది. చంద్రుడి వెనుక వైపున తొలి ఫొటో కూడా అదే.

భూమికి ఎదురుగా ఉండే చంద్రుడి భాగం మాత్రమే మనకు కనిపిస్తుంది. కానీ వెనుక వైపు కనిపించదు. భూమి ఎలాగైతే గుండ్రంగా తిరుగుతుందో.. చంద్రుడు కూడా అలాగే గుండ్రంగా తిరుగుతాడు. ఈ ‘టైడల్ క్లాకింగ్’‌ లక్షణం కారణంగా ఎప్పుడూ చందమామ ఒకవైపు మాత్రమే మనకు కనిపిస్తుంది. ఇంకోవైపు కనిపించదు. ఇప్పటివరకు ఆ ప్రాంతంలో ఏ వ్యోమనౌక సురక్షితంగా దిగలేదు. అందువల్ల శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయడానికి సాధ్యపడలేదు. చైనా అక్కడ వ్యోమనౌకను దింపి పరిశోధలు చేస్తోంది.

ఇదిలా ఉంటే, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్‌)తో భాగస్వామ్యం కాని చైనా ఇతర దేశాలతో కలిసి అంతరిక్ష ప్రయోగాలు చేస్తోంది. ఈ క్రమంలో స్వతహాగా అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసుకునే పనిలో నిమగ్నమయ్యింది. అంతరిక్ష ప్రయోగాల్లో విజయం సాధించే క్రమంలో భారత్‌, జపాన్‌ వంటి ఆసియా దేశాలకు చైనా గట్టి పోటీ ఇస్తోంది.